వీపీఆర్ (దుర్గ) ఓబీ కంపెనీలో టైరు పేలి ఒకరి మృతి
నలుగురికి గాయాలు
మృతుని కుటుంబానికి రూ.40 లక్షలు చెల్లించాలి : సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు డిమాండ్
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా పీకే ఓసీ-2లో వీపీఆర్ (దుర్గ) ఓబీ కంపెనీలో టైరు పేలిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగిపోయిన డంపర్ టైర్ విప్పే క్రమంలో ప్రమాదవశాత్తు టైరు పేలింది. ఈ ఘటనలో బీహార్‌కి చెందిన టైర్ ఫిట్టర్ మహమ్మద్ సర్ఫరాజ్ (40) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్టు ధ్రువీకరించారు.
ఈ ఘటనలో సాహెబ్ లాల్ యాదవ్, జగదీష్ కుష్వాల్, మంతూ కుమార్, మొహమ్మద్ తాజ్ అన్సారీ.. గాయపడగా ఆస్పత్రికి తరలించారు. సాహెబ్ లాల్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా జీఎం దుర్గం రామచందర్ అధికారులతో కలిసి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మృతుని భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం గాయాలపాలైన ఓబీ వర్కర్లను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి వైద్యులను ఆదేశించారు. మృతునితోపాటు గాయపడిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.
మృతుని కుటుంబానికి రూ.40 లక్షలు చెల్లించాలి : మంద నర్సింహారావు
నిబంధన ప్రకారం మృతుని కుటుంబానికి రూ.40 లక్షలు నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని, ప్రమాద సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు డిమాండ్ చేశారు. సీఐటీయూ బ్రాంచ్ నాయకులతో కలిసి గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. సీఐటీయూ ఏరియా బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరు వెంకటరత్నం, మాచారపు లక్ష్మణరావు, సాయి కృష్ణ, ముజఫర్ విజయ్ సందర్శించిన వారిలో ఉన్నారు.
అలాగే, ఏరియా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు వై.రాంగోపాల్, మేకల ఈశ్వర్, ఐఎన్‌టీయూసీ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సిల్వర్ గట్టయ్య, షేక్ అబ్దుల్ రవూఫ్, ఐఎఫ్‌టీయూ నాయకులు యస్‌డీ నాసర్ పాషా, అంగోత్ మంగీలాల్, టీబీజీకేస్ నాయకులు నాగేల్లి వెంకట్, హెచ్‌ఎంఎస్ నాయకులు శ్రీలత, మస్తాన్, బీఎంఎస్ నాయకులు బి.కిషన్ తదితరులు పరామర్శించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఓబీ వర్కర్లు పెద్ద ఎత్తున ఏరియాస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీకే ఓసీ 2లో ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



