Monday, March 30, 2026
E-PAPER
Homeకరీంనగర్అన్యాక్రాంతంలో ప్రభుత్వ భూమి

అన్యాక్రాంతంలో ప్రభుత్వ భూమి

- Advertisement -

– ఆందోళనలో గ్రామస్తులు 
– స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాకు గురైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని 14వ వార్డులో దాసరి నూతి పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 10 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎంబారి గౌతమికి గ్రామస్తులు వినతి పత్రం అందించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఆక్రమణదారులు ఆ భూమి చుట్టూ ఖనీలు ఏర్పాటు చేసి, ఫెన్సింగ్ వైర్లు వేసి పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చర్యల వల్ల గ్రామానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలం లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా.. ప్రభుత్వ భూములు ఈ విధంగా అక్రమంగా కబ్జా చేయడం వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి, స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -