నవతెలంగాణ – ఆర్మూర
మండల కేంద్రంలోని అంగడి బజార్ రాజీవ్ గాంధీ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు యం.ముత్తన్న మాట్లాడుతూ.. గత అనేక సంవత్సరాల నుండి కార్మికులు కొట్లాడి అనేక కష్టాలను ఎదుర్కొని కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు. వాటిలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినం సాధించుకొని వాటిని అమలు చేస్తున్న వివిధ కంపెనీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా రెండు గంటలకు పెంచి 10 గంటల పనిదినాలు, 12 గంటలు పనిచేయాలని చట్టం తీసుకొచ్చారని అన్నారు.
దానివలన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ యజమానులకు లబ్ది చేకూరుతుందని, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ ఫస్ట్ నుండి అమలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని, వాటిని వెంటనే విరమించుకుని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి.అరవింద్, మండల నాయకులు ఎండి. నజీర్ ఎన్.నిఖిల్ బీడీ చాటింగ్ కార్మికులు, బీడీ ప్యాకర్స్ బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



