– సీఐటీయూ నాయకుల అరెస్టుకు నిరసనగా ధర్నా
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రాజధానిలో ధర్నా నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల భాస్కర్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆశా వర్కర్ల సమస్యలపై తహసీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ ఆశా ల సంఘం మండల అధ్యక్షురాలు భారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గత ప్రభుత్వం మాదిరిగానే హక్కులు అడిగితే అరెస్టులు, ఆంక్షలు విధించడం తగదన్నారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం, రూ.50 లక్షల బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మురహరి, రఘు, నాగమణి, సుభాని, రత్నకుమారి, వెంకాయమ్మ, మంగ, రాణి, రాఘవ, రజిని తదితరులు పాల్గొన్నారు.



