Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ఆర్థిక సంవత్సరం నుంచి విబి-జీరాంజీ అమలు.!

నూతన ఆర్థిక సంవత్సరం నుంచి విబి-జీరాంజీ అమలు.!

- Advertisement -

125కు పెరగనున్న ఉపాదిహామీ పని దినాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

నూతన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2005 నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ ఆర్జీఏ) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంది. కొత్త చట్టంలో మార్పులు, చేర్పుల అంశాలను కేంద్రం ఇది వరకే ప్రకటించింది.పాత చట్టానికి సంబంధించి కూలీలు చేపట్టిన పనులకు సంబంధించి వేతనాల చెల్లింపు కోసం పది రోజుల గడువు పొడిగించింది. తద్వారా ఈ నెల 31లోగా కూలీల పనులకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడమే కాకుండా ఆ వేతనాలను కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు చేపడుతుంది.

మండల పరిస్థితి ఇలా..
మండలంలో 8,495వేల జాబ్ కార్డులు ఉండగా,18,873 మంది కూలీలు ఉన్నారు.ఇందులో 10,632 మంది కూలీలు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ముగింపునకు చేరువైన ఈ ఆర్థిక సంవత్సరంలో 96,490 పనిదినాలు మంజూరు కాగా 90564 పనిదినాలు పూర్తి చేశారు.ఇందులో 5,362 మంది కూలీలు పాల్గొన్నారు.ఇందుకు వీరికి రూ.229.65 లక్షలు చెల్లించారు.ఈ కొత్త చట్టంలోనూ సుమారుగా అవే పనిదినాలు మంజూరయ్యే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. మెటీరియల్ కంపొనెంట్లో ఈ ఆర్థిక సంవత్సరం లో సుమారు రూ.10 లక్షల వరకు వెచ్చిస్తుండగా,కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ అంతే మొత్తం ఉండే అవకాశం ఉండనుందని అభిప్రాయపడుతున్నారు.

పనిదినాలు పెంపు..
కొత్త చట్టంలో జాబ్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఏడాదికి హామీ ఇవ్వబడిన ఉపాధిని100 నుంచి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇందులో రెండు రకాలుగా పనులు జరుగుతాయి. కూలీలకు పని కల్పించడం ద్వారా వారికి వేతనాలు చెల్లించడం ఒకటైతే, మెటీరియల్ నిర్మాణం చేపట్టే పనులు మరొకటి కూలీల వేతనాలను ఇది వరకు కేంద్రం వంద శాతం భరించేది.కొత్త చట్టంలో మాత్రం ఇందులో మార్పులు తీసుకువచ్చారు. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరించాల్సి ఉంటుంది.ఇక మెటీరియల్ కంపొనెంట్లో ఇది వరకు 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇందులో 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం భరించేలా మార్పులు తీసుకువచ్చారు. రాష్ట్రాల మీద భారం పెంచేలా ఉందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.

వ్యవసాయ విరామం..
కొత్త చట్టంలో 60 రోజుల వ్యవసాయ విరామాన్ని ప్రకటించారు.సాగు పనులు ఉధృతంగా సాగే కాలంలో తప్పనిసరిగా 60 రోజుల విరామాన్ని విధిస్తారు.దీన్ని రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా ఎంచుకునే విధంగా నిబంధనలు పెట్టారు.విత్తనాలు విత్తే సమయంతో పాటు, పంట దిగు బడులు చేతికి వచ్చే వేళ కూలీల కొరత తలెత్తకుండా ఈ విరామం ద్వారా నివారించాలని ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -