Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంఎస్‌డీపీఐ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు : ఎంఎ బేబీ

ఎస్‌డీపీఐ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు : ఎంఎ బేబీ

- Advertisement -

కోజికోడ్‌ : ప్రస్తుతం నిషేధానికి గురైన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) రాజకీయ విభాగం సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) మద్దతు కోసం సీపీఐ(ఎం) ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ స్పష్టం చేశారు. ఎస్‌డీపీఐ రాజకీయ కార్యకలాపాలను సీపీఐ(ఎం) విమర్శిస్తుందని పేర్కొన్నారు. కాలికట్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బేబీ మాట్లాడారు. ఎస్‌డీపీఐ ప్రస్తుత పనితీరు ఆర్‌ఎస్‌ఎస్‌కు తన పనిని సమర్థించుకోవడానికి అవకాశం ఇస్తోందని ఎంఏ బేబీ విమర్శించారు. ఎస్‌డీపీఐ పార్టీ తన రాజకీయ పనితీరును మార్చుకోవాలని సూచించారు.

జమాత్‌ ఎ ఇస్లామీ హింద్‌ మద్దతు ఉన్న రాజకీయ పార్టీ వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా గురించి విలేకరులు ప్రశ్నించగా.. దానికి ‘పరిమిత ప్రభావం’ మాత్రమే ఉందని బేబీ సమాధానం ఇచ్చారు. ఎల్‌డీఎఫ్‌కు ఎస్‌డీపీఐకి మధ్య రహస్య ఒప్పందం ఉందని యూడీఎఫ్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలను బేబీ తీవ్రంగా ఖండించారు. నిజానికి యూడీఎఫ్‌కు సహాయం చేయడం కోసం కాసరగోడ్‌ జిల్లాలోని మంజేశ్వరం నియోజకవర్గంలో ఎస్‌డీపీఐ తన అభ్యర్థిని ఉపసంహరించుకుందని బేబీ వెల్లడించారు. అలాగే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీపై ఎంఏ బేబీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట్లాడే ముందు రాహుల్‌గాంధీ తగినంత హోంవర్క్‌ చేస్తున్నట్టుగా కనిపించడం లేదని విమర్శించారు. నూతన సరళీకరణ ఆర్థిక విధానాలను అమలు చేసే విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండు ఒకే రకమైన పార్టీలని కూడా ఎంఎ బేబీ విమర్శించారు.

కేరళలో ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌ ప్రారంభం
2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 85 ఏండ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభయింది. రాష్ట్రవ్యాప్తంగా 2.07 లక్షలకు పైగా ఓటర్లు ఈ సౌకర్యాన్ని ఎంచుకున్నారు. ఈ సౌకర్యం కోసం ఫారం 12డి ద్వారా దాఖలు చేసిన 85 ఏండ్లుపై బడిన వృద్ధులు నుంచి వచ్చిన 1,45,592 దరఖాస్తులను, వికలాంగుల నుంచి వచ్చిన 62,220 దరఖాస్తులను ఎన్నికల కమిషన్‌ ఆమోదించింది.

టాప్‌లో తిరువనంతపురం
ఇంటి నుంచి ఓటు వేసే వృద్ధుల విషయంలో తిరువనంతపురం (14,672) అగ్రస్థానంలో ఉంది. కన్నూర్‌లో 14,132 ఎర్నాకులంలో 14,117 మంది ఉన్నారు. వికలాంగుల కేటగిరీ ఓటర్ల విషయంలో కూడా తిరువనంతపురం (6,791) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కోజికోడ్‌ (6,788), మలప్పురం (6,746) ఉన్నాయి. ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2,468 బృందాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కోజికోడ్‌లో 308 బృందాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రథన్‌ యు. కేల్కర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, రాజకీయ పార్టీలతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించిన అనంతరం కేల్కర్‌ ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళలతో ఈ నెల 23న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం, కేరళలో వికలాంగ విభాగంలో 2,44,927 మంది ఓటర్లు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 5,55,302 మంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -