Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయొద్దు

లేబర్‌కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయొద్దు

- Advertisement -

చిట్‌ఫండ్‌ మోసాలపై సిట్‌ వేయాలి : సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికులకు నష్టదాయకమని అమలుకు కేరళం, తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు తిరస్కరిస్తూ తీర్మానాలు చేశాయనీ, వాటిని రాష్ట్రంలో అమలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు సూచించారు. చిట్‌ఫండ్‌ సంస్థల మోసాలపై సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం శాసనసభలో తెలంగాణ ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చలో ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్‌ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలనీ, వర్సిటీలోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో డీఈఓలు నలుగురు, డిప్యూటీ డీఈఓలు 62 మందికి గానూ నలుగురు, 630 ఎంఈఓలకుగానూ 62 మంది మాత్రమే ఉన్నారనీ, అలాంటప్పుడు ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించారు. గతంలో మాదిరిగా రేషన్‌ షాపుల ద్వారా పేదలకు 9 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మొక్కజొన్న పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలనీ, వడ్లకు మాదిరిగా బోనస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సహకార సంఘాల పాలకమండళ్లను నామినేటెడ్‌ పద్ధతిలో నియమించాలనే ప్రభుత్వ ఆలోచన సరిగాదని స్పష్టం చేశారు. వాటికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖలోని ఆర్టిజన్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగరేణి కార్మికుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనీ, సింగరేణి కార్మికులకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాలు, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ప్యూచర్‌ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌లకు భూములను రైతుల సమ్మతి లేకుండా సేకరించొద్దన్నారు. ఏజెన్సీ ఏరియాలో అయితే ఎస్టీ రిజర్వేషన్లు, లేకపోతే జనరల్‌ రిజర్వేషన్లు అమలవుతున్నాయనీ, దీంతో ఎస్సీలు తమ హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -