– వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2, 2026 నుండి గ్రామసభలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి మంగళవారం తెలిపారు. గ్రామస్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం మరియు ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించడం ఈ గ్రామసభల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
గ్రామసభల్లో సర్పంచ్ అధ్యక్షతన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలు పంచుకోవాలని తెలిపారు.
గ్రామసభలకు ముందుగా అధికారిక నోటీసులు జారీ చేయడం, ప్రచారం నిర్వహించడం, పథకాల లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు లేదా అనువైన ప్రదేశాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలపై చర్చ జరుగుతుందని వివరించారు. అదేవిధంగా అల్పాహార పథకం, కుటుంబ జీవిత బీమా, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం వంటి కొత్త కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రజల అభిప్రాయాలను సేకరించడం, పారదర్శక పాలనను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందని పెంటేల రవి పేర్కొన్నారు. గ్రామ సభలను ప్రజలు విజయవంతం చేయాలని, ఎక్కువ సంఖ్యలో హాజరై తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని ఆయన కోరారు.



