పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుది. నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త చర్చకు తెరతీశాయి. ఒకవైపు ప్రధాని మోదీ ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని’ పిలుపునిస్తే, మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎలాంటి సంక్షోభం లేదు, నిల్వలు సమఅద్ధిగా ఉన్నాయి’ అంటూ ప్రకటించడం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సఅష్టిస్తోంది.రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం, ఇతర సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని, కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దఅష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ముందుగానే సమైక్యంగా, అప్రమత్తంగా సిద్ధపడాలని సూచించారు. కరోనా నాటి విపత్కర పరిస్థితులను గుర్తు చేస్తూ, ‘సహజ్ఞత’తో ముందుకు సాగాలన్న ఆయన పిలుపు సహజంగానే ప్రజల్లో ఆందోళనను రేపింది. ప్రత్యక్షంగా ‘లాక్‌డౌన్’ అని పేర్కొనకపోయినా, కరోనా నాటి అనుభవాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన ఆ స్థాయి సంక్షోభం వైపు ఈ ప్రభుత్వం చూస్తోందనే భావనకు దారితీసింది.అయితే, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాత్రం ఇదే అంశంపై స్పష్టత ఇస్తూ, దేశంలో లాక్‌డౌన్ ప్రచారం పూర్తిగా అసత్యమని, ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలేమీ లేవని చెప్పారు. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.ఈ రెండు వ్యాఖ్యల మధ్య ఉన్న స్పష్టమైన విరోధాభాసం ప్రజలను, విశ్లేషకులను ఇబ్బందికర పరిస్థితిలో పడేసింది.
ప్రభుత్వ వాదనలకు భిన్నంగా, భూస్థాయి వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత, పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చుతగ్గులు సామాన్య ప్రజల జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. బుక్‌చేసినా పదిహేను రోజుల తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ అందని పరిస్థితి. తెలంగాణలో కూడా బుక్‌చేసి నెలరోజులైనా ఇంకా సిలిండర్లు ఇంటిగడప తొక్కడం లేదు. గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్ చేస్తే ‘సరఫరా సరిగా కావడం లేదు. కాస్త సమయం పడుతుంది’ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా బ్లాక్‌దందా పెట్రేగిపోయింది. మొన్న హైదారాబాద్‌లో టాస్క్‌పోర్స్ పట్టుకున్న గ్యాస్ సిలిండర్ల విలువ అక్షరాల రూ.22లక్షలు. దీనంతటికి కారణం యుద్ధవాతావరణ ప్రభావం ఒక్కటే కాదు, మన పాలకులు సరైన విధంగా ప్రజలకు భరోసా కల్పించకపోవడం. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కూడా ఇంధన సంక్షోభం ఇప్పటికే తలుపు తట్టిందనడానికి నిదర్శనాలు. ఇలాంటి సమయంలో ‘సంక్షోభం లేదు’ అనే ప్రకటన వాస్తవికతకు దూరంగా ఉంది.ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ‘సంక్షోభ హెచ్చరిక’ వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రజల దృష్టిని ఇంధన కొరత, ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుంచి మళ్లించి, ‘సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సమైక్యంగా నిలవండి’ అనే పిలుపు ద్వారా తమ పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం జరిగిందా అనేది విశ్లేషకుల సందేహం. ఓటర్లను తమవైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ చెప్పినట్లు సంక్షోభం వస్తోందా? లేదా మంత్రి పూరి చెప్పినట్లు సంక్షోభమే లేదా? ఈ రెండింటి మధ్య ఉన్న సందిగ్ధతే నేడు అసలు సంక్షోభంగా మారింది. కరోనా కాలంలో రోజువారీ కూలీలు, చిన్న తరహా వ్యాపారులు, ప్రయివేటు ఉద్యోగులు ఎదుర్కొన్న ఆర్థిక దుర్భరం ఇప్పటికీ వారి గుండెల్లో భయంగా మిగిలే ఉంది. అలాంటి సమయంలో స్వయంగా ప్రధానమంత్రి ‘సంక్షోభానికి సిద్ధపడండి’ అనడం, ఎదురుగా మంత్రి ‘ఏమీ లేదు’ అనడం – ఈ వైరుధ్యం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.ఒకవైపు ప్రభుత్వంలోని ఇద్దరు పెద్ద నేతల మధ్య స్పష్టమైన అభిప్రాయ భేదం కనిపిస్తే, మరోవైపు కిందిస్థాయిలో ఇంధన కొరత వాస్తవంగా మారుతోంది. ఎన్నికల నేపథ్యం ఈ వివాదానికి మరింత రాజకీయ రంగు దిద్దుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా దేశం ఉత్సవాల్లో మునిగి ఉన్నా, ప్రజల మన సుల్లో మాత్రం ‘మరో కరోనా లాంటి సంక్షోభమా?’ అనే ప్రశ్న మెదులు తూనే ఉంది. ఈ గందరగోళాన్ని తొలగించి, వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టమైన, ఏకస్వరంతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు భయంతో కాకుండా, స్పష్టతతో ముందుకు సాగే వాతావరణం కల్పించడం ప్రభుత్వం ప్రధాన బాధ్యత.
బి.రామారావు 9030715343



