Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంగిరిజనుల అభివృద్ధికి కృషి చేసే వామపక్షాలకే ఓటు

గిరిజనుల అభివృద్ధికి కృషి చేసే వామపక్షాలకే ఓటు

- Advertisement -

త్రిపుర ఏడీసీ ఎన్నికల ర్యాలీలో జితేంద్ర చౌదరి పిలుపు
అగర్తలా :
ఎన్నికల ముందు ఘర్షణలు…ఎన్నికల తర్వాత స్నేహాలు… పాలక పార్టీల మధ్య వుండే ఈ అంతర్గత పోరు ప్రజల దృష్టిని మళ్ళించి స్వయంప్రతిపత్తి జిల్లా మండలి (ఏడీసీ)ని స్వాధీనం చేసుకోవడానికి ఉద్దేశించిందేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు జితేంద్ర చౌదరి విమర్శించారు. ఏడీసీ ఎన్నికల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్ధికి మద్దతుగా మను-చలెంగ్తా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేసే వామపక్షాలకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పాలక అలయన్స్‌ను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలపుడు భాగస్వామ్య పార్టీలు భయంకరంగా పోట్లాడుకున్నా తర్వాత వారందరూ ఏకమవ్వడానికి ఎలాంటి హామీ లేదు. వేర్వేరుగా పోటీ చేసినా అందరూ చివరకు ప్రభుత్వంలోనే వుంటారు, బీజేపీ గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ ఒక్కరూ మాట్లాడరని అన్నారు. తిప్రా మోతా నుండి బయటకు వచ్చి వామపక్ష సంఘటనలో చేరుతున్నట్లు ఈ ర్యాలీలో కొన్ని కుటుంబాలు ప్రకటించాయి. వారందరికీ జితేంద్ర చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్ధి రాహుల్‌ దాస్‌ మను-చలెంగ్తా నియోజకవర్గంలో చురుకుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బంధుప్రీతి, అవినీతిలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు హిమాంశు దేవ్‌ ఓటర్లను కోరారు.
జితేంద్ర చౌదరి ర్యాలీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, యువత రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు. బీజేపీ అనుసరించే గిరిజన వ్యతిరేక వైఖరిని, తిప్రా మోతా గతంలో, ప్రస్తుతం పోషిస్తున్న పాత్రలను పూర్తిగా అవగాహన చేసుకుని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన యువతరాన్ని కోరారు. ఇప్పటికే చాలామంది చదువుకున్న యువత రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రోత్సాహకరంగా వుందని అన్నారు. వీరిలో చాలామంది రాష్ట్ర అభివృద్ధిని, గిరిజన కమ్యూనిటీల సామాజిక ఆర్థిక పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. అలాగే గిరిజనుల భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నారు. అయితే వారి భావోద్వేగాలను, విశ్వాసాన్ని త్రిపా మోతా నేతలు దుర్వినియోగం చేస్తున్నారని, స్వతంత్ర త్రిపుర, స్వతంత్ర ఈశాన్యం, త్రిపాల్యాండ్‌, గ్రేటర్‌ త్రిపాల్యాండ్‌ అంటూ నినదిస్తున్నారని జితేంద్ర చౌదరి విమర్శించారు. ఇవన్నీ అవాస్తవికమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఏడీసీ ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన హెచ్చరించారు. ఈ దశలో ఎలాంటి తప్పుడు చర్యలు లేదా నిర్ణయాలు తీసుకున్నా వాటివల్ల గిరిజనులకే కాదు, రాష్ట్రానికి, దేశానికి కూడా తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -