పౌరసరఫరాలశాఖ ఉక్కుపాదం
అనధికార నిల్వలు, అధిక ధరలకు విక్రయిస్తున్న మెట్రో హెచ్‌పీ ఏజెన్సీ
ప్రతినిధిపై వేటు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఆర్వో రాజిరెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎల్పీజీ గ్యాస్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చీఫ్ రేషనింగ్ కార్యాలయం(సీఆర్వో) హెచ్చరించింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న మెట్రో నాన్-డొమెస్టిక్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి అర్షియా అమిర్‌పై వేటు పడింది. ఆమె లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలోని మెట్రో నాన్-డొమెస్టిక్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి అర్షియా అమిర్.. నిబంధనలను పక్కనబెట్టి అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. అనుమతి లేని ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడంతోపాటు, రీఫిల్లింగ్‌లోనూ అవకతవకలకు పాల్పడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు విచారణలో స్పష్టమైంది. ఇది 1980 నాటి పెట్రోలియం ఉత్పత్తుల చట్టానికి పూర్తిగా విరుద్ధమని అధికారులు నిర్ధారించారు.
కొనసాగుతున్న విచారణ
ఈ ఘటనపై చీఫ్ రేషనింగ్ అధికారి(సీఆర్వో) కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ”ఎల్పీజీ అనేది సామాన్యుడి నిత్యావసర సరుకు. ఇందులో అక్రమాలు ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించడమే. ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయం” అని కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అర్షియా అమిర్ లైసెన్సును సస్పెండ్ చేయగా, విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంపిణీదారులు అప్రమత్తంగా ఉండాలి
నగరంలోని అన్ని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీ ప్రతినిధులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, వ్యాపారంలో పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో నిఘా పెంచుతున్నామని చెప్పారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి అక్రమాలను గమనిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
గ్యాస్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే లైసెన్సు రద్దు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



