మాందాపూర్‌లో 321 ఎకరాలను లాక్కునే కుట్ర
కంపెనీల ఏర్పాటు పేరిట పేద రైతుల భూముల కట్టబెట్టే యత్నం
సాగు భూములు లాక్కోవద్దు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో కంపెనీల ఏర్పాటు పేరుతో చిన్న, సన్నకారు దళిత, బీసీ రైతుల భూముల్ని లాక్కుంటున్నారు. కొండాపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామంలో 200 మంది రైతుల నుంచి 321 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇండిస్టీయల్ పార్క్ పేరిట అసైన్డ్ భూముల్ని కాజేసే కుట్ర సాగుతోంది.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మదాపూర్ (మాందాపూర్)గ్రామ రెవెన్యూ శివారులోని సర్వేనంబర్ 22లో 310 ఎకరాల భూమి ఉంది. ఇండిస్టీయల్ పార్క్ కోసమంటూ ఆ భూముల్ని సేకరించేందుకు సోమవారం రెవెన్యూ అధికారులు మాందాపూర్ గ్రామానికి వచ్చారు. సేకరించే దాంట్లో అత్యధికంగా అసైన్డ్ భూములే ఉన్నాయి. 2005లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా 130 మందికి రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు పంపిణీ చేసింది. మరికొందరికి అంతకు పూర్వమే అసైన్డ్ చేయబడ్డాయి. ప్రస్తుతం ఆ భూములకు మంచి డిమాండ్ ఉంది. కాగా, 2005లో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పట్టాలు పొందిన 130 ఎకరాలను 2013లో కంపెనీల ఏర్పాటు కోసం రాసిచ్చారని రెవెన్యూ అధికారులు చెబుతు న్నారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి మొదట వాటిని తీసుకుంటామని ప్రకటిం చారు. కానీ ఆ సర్వేనంబర్‌లో ఉన్న 321 ఎకరాలను పూర్తిగా సర్వే చేసి సేకరిస్తామని, మిగిలిన 191 ఎకరాల పట్టా భూములకు సంబంధించి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి నష్టపరిహారం ఇప్పిస్తామని అన్నారు. అసైన్డ్ భూములైనం దున ప్రభుత్వం ఉచితంగానే తీసుకుంటోందని కొందరు రైతుల్ని భయపెడుతున్న పరిస్థితి. మార్కెట్‌లో ఎకరం ధర రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మూడింతల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ లెక్కన ఎకరాకు రూ.18 కోట్ల నష్టపరి హారం, 600 గజాల ప్లాట్, ఇంటికో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఇవేవీ చెప్పకుండా అధికారులు రైతులను మభ్యపెడుతున్నారని తెలిసింది.
అవి సాగు భూములే..
మాందాపూర్‌లోని 321 ఎకరాలు సాగుభూములే. రెండు తరాలుగా దళిత, బీసీ రైతులు చదును చేసుకుని పంట పొలాలుగా మార్చుకున్నారు. బోర్లు, బావులు తవ్వుకుని నీటి లభ్యతను బట్టి వరి, జొన్న, మామిడి, బొప్పాయి. కొబ్బరి, జామ వంటి తోటల్ని సాగు చేస్తున్నారు. మెట్ట భూముల్లో పత్తి, పెసర, జొన్న వంటి వర్షాధార పంటలేస్తున్నారు. ఇప్పుడు అధికారులు ఆ భూములను తీసుకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వాలని, కాలుష్యం లేని కంపెనీలు నెలకొల్పాలని కోరుతున్నారు.
భూమి పోతే బతుకులేదు
భూమి గుంజుకుంటే మాకు బతుకేలేదు. చిన్నప్పటి నుంచి ఆ భూమినే సాగు చేసుకుం టున్నం. మా తాతల నుంచి ఆ భూమి ఉంది. బోరు వేసినం. వరి, ఇతర పంటలేసుకుంటం. మా కుటుంబానికి ఉన్నదే గా కొంచెం భూమి. మాకు ఏ పైసలొద్దు. భూమిని ఇచ్చేది లేదు.
-రైతు మల్లగారి చంద్రయ్య- మాందాపూర్
భూమే జీవనాధారం
మాకు ఎకరా మాత్రమే ఉంది. అదే జీవనాధారం. భూములకు ధరలు పెరిగాయి. భూమి ఉందన్న భరోసాతో బతుకుతున్నం. ఇప్పుడా భూమిని కంపెనీలు పెట్టాలని లాక్కుంటే న్యాయం కాదు. ప్రభుత్వం ఇచ్చే కొద్ది డబ్బులకు మళ్లీ మేం భూమి కొనగలమా..? లేదంటే అంతే భూమి కొని ఇవ్వగలరా..?
-తలారి నర్సింలు
పరిశ్రమలకు సాగు భూముల్ని తీసుకోవద్దు
మాందాపూర్ గ్రామంలో కంపెనీల కోసం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సుమారు 310ఎకరాలు తీసుకోవడం మానుకోవాలి. ఎప్పుడో 50, 60 సంవత్సరాల కిందట కొంతమంది రైతులకు భూమిని పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ భూమిలో రెండు దపాల పంటలు తీస్తా ఉన్నారు. ఎలాంటి నష్టపరిహారమూ ప్రకటిం చకుండా భూములను తీసుకుంటామంటే ఊరుకోం.
-కూరాకుల రాజయ్య, సీసీఐ(ఎం) మండల కార్యదర్శి



