జీడీపీ ఒక్క శాతం తగ్గొచ్చు
సామాన్యులపై ధరలభారం ఇవై రిపోర్ట్
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదం తో పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే భారత జీడీపీ అంచనాల్లో దాదాపు 1 శాతం మేర కోత పడే ప్రమాదం ఉందని గ్లోబల్ టాక్స్ కన్సల్టింగ్ సంస్థ ‘ఇవై’ తన ఎకానమీ వాచ్ నివేదికలో వెల్లడించింది. కేవలం వృద్ధి తగ్గడమే కాకుండా సామాన్యుడిపై ధరల భారం కూడా భారీగా పెరగనుందని, రిటైల్ ద్రవ్యోల్బణం బేస్‌లైన్ అంచనాల కంటే మరో 1.5 శాతం ఎగబాకే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2026-27లో భారత జిడిపి 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని ఫిబ్రవరిలో ఇవై అంచనా వేసింది. తాజా రిపోర్ట్‌తో ఈ అంచనాలను 5.8 శాతం నుంచి 6.2 శాతానికి కోత పెట్టినట్లయ్యింది. 2026-27లో జీడీపీ రేటు 6.1 శాతానికి పరిమితం కావచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఉపాధి కల్పనలో కీలకమైన రంగాలు తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టెక్స్టైల్స్, పెయింట్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, సిమెంట్, టైర్ల వంటి పరిశ్రమలు నేరుగా ప్రభావితం కానున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ రంగాలలో కార్యకలాపాలు మందగించి ఫలితంగా ఉద్యోగాల్లో కోత లేదా ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. ఇది మార్కెట్లో ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించి, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా చేస్తుందని ఇవై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



