Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం

ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం

- Advertisement -

బంకర్‌ బస్టర్లతో అమెరికా విధ్వంసం
దుబాయ్‌లో కువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి
హార్ముజ్‌లో టోల్‌ వసూలుకు ఇరాన్‌ పార్లమెంట్‌ భద్రతా కమిటీ ఆమోదముద్ర
‘ధైర్యం చూపండి..చమురు తెచ్చుకోండి’ : రెచ్చగొడుతున్న ట్రంప్‌
అమెరికా అధ్యక్షుల మెహర్బానీ కోసం గల్ప్‌ దేశాల వెంపర్లాట

టెహ్రాన్‌: ఇరాన్‌లో అణుకేంద్రాలు కలిగి ఉన్న కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2వేల పౌండ్ల బంకర్‌ బస్టర్లతో భీకర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ఈ విషయాన్ని పేర్కొంది. మరోపక్క ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా- ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడ్డాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకోగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీనిపై ఇరాన్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఇరాన్‌ సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్‌లో ఓ భూగర్భ కేంద్రానికి తరలించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే..ఇరాన్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీఎత్తున దాడులు జరగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చేశాం: ఐఆర్‌జీసీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తయారుచేసిన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను ఇరాన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఐఆర్‌జీసీ అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇస్ఫహాన్‌ ప్రాంతంలో ఎగురుతున్న ఈ డ్రోన్‌ను ధ్వంసం చేసినట్టు ఐఆర్‌జీసీ వర్గాలు పేర్కొన్నాయి.

హార్ముజ్‌లో టోల్‌ వసూల్‌ : ఇరాన్‌ పార్లమెంట్‌ భద్రతా కమిటీ ఆమోదముద్ర
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్రమార్గాల్లో ఒకటైన హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్‌ వసూలుకు ఇరాన్‌ పార్లమెంట్‌ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి హార్ముజ్‌ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్‌ కరెన్సీ ‘రియాల్‌’ రూపంలో టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా, జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్‌ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా-ఇజ్రాయిల్‌ నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్‌ పార్లమెంట్‌ పూర్తిగా నిషేధించింది. అలాగే ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు కూడా అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని చాటుకుంటూనే ఆదాయాన్ని పెంచుకోవాలని ఇరాన్‌ యోచిస్తోంది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో ఐదో వంతు జరిగే ఈ మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని అమెరికా సహా పలు దేశాలు చెబుతున్నాయి. అక్కడ టోల్‌ వసూలుకు ఇరాన్‌కు చట్టబద్ధత లేదని పేర్కొంటున్నాయి.

ఇరాన్‌ సార్వభౌమాధికారాన్ని బలపరిచే విధంగా ఈ ప్రణాళిక రూపొందించ బడినట్టు అధికారులు తెలిపారు. జలసంధి నిర్వహణలో ఒమన్‌తో కలిసి న్యాయపరమైన విధానాలు రూపొందించేలా ఈ ప్రణాళికలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ జలసంధి గుండా సాగుతుండటంతో, దీనిపై నియంత్రణ అంతర్జాతీయంగా కీలక అంశంగా మారింది.

దేశ సార్వభౌమాధికారానికి సంకేతం : ఇరాన్‌ పార్లమెంట్‌ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు
హార్ముజ్‌ జలసంధిలో కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంకేతమని ఇరాన్‌ పార్లమెంట్‌ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు అలాఎద్దీన్‌ బొరూజెరీ పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నందున, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్పు తీసుకువచ్చామని అన్నారు. అయితే ఈ టోల్‌ వసూలుకు సంబంధించి ఆయన ఇదివరకే మీడియాతో మాట్లాడారు. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్‌ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం హార్ముజ్‌ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గంగా ఉంది. గల్ఫ్‌ ప్రాంతం నుంచి వెలువడే చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి మార్గం గుండానే సాగుతుంది.

దేశంపై దాడి చేసే ఏ దురాక్రమణదారుడి కాళ్లనైనా నరికేస్తాం : ఇరాన్‌
ఇరాన్‌ యుద్ధం ఆపాడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే మరోవైపు ఆ దేశంపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఇరాన్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తాజాగా దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించే ఏ దురాక్రమణదారుడి కాళ్లను నరికేస్తాం’.
దాడికి తమపై దాడికి పాల్పడితే దేశ సాయుధ దళాలు అంతే గట్టిగా ప్రతిస్పందిస్తాయని ఇస్లామిక్‌ రివల్యూషరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) ఖాతం అల్‌- అన్బియా ప్రధాన కార్యాలయ ప్రతినిధి మంగళవారం హెచ్చరించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రెస్‌ టివి పేర్కొంది. అలాగే అమెరికా ఇరాన్‌పై భూతల దాడులకు పాల్పడితే.. ఇరాన్‌ కూడా వాటికి గట్టిగానే బదులిస్తుంది. ఇరాన్‌కు మద్దతుగా రష్యన్‌ చెచెన్‌ యూనిట్లను పంపడానికి సిద్ధమని మీడియా పేర్కొంది.

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ నిష్క్రమణ!
అమెరికా అధ్యక్షుడిని నమ్మలేమంటున్న విశ్లేషకులు
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్‌ లొంగకపోగా దాడికి ప్రతిదాడి చేస్తోంది. దీంతో ఓ వైపు స్వదేశంలోనూ, మరోవైపు విదేశంలోనూ వ్యతిరేకత కారణంగా.. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం నుంచి నిష్క్రమించాలని ట్రంప్‌ మదిలో ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. గతంలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్న దశలోనే అమెరికా, ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీని హత్య చేసింది. పైగా తనకు ఇరాన్‌ చమురు అంటే ఇష్టమంటూ గొప్పగా ప్రకటనలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిందని స్పష్టమవుతోంది. దీంతో అమెరికా అధ్యక్షుడిని నమ్మలేమని విశ్లేషకులు అంటున్నారు.

నాడు సద్దాం… నేడు ఖమేనీ… గల్ఫ్‌ దేశాలకు మింగుడుపడని నేతలు
గల్ఫ్‌ దేశాల్లోని చమురు నిల్వలపైనే అమెరికా అధ్యక్షుల నిఘా ఉంటోంది. నాడు అమెరికా ఆధిపత్యంపై తెగించటానికి ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ సిద్ధమయ్యారు. గల్ఫ్‌ దేశాల్లోని ఆయిల్‌ నిక్షేపాలపై అమెరికా పెత్తనాన్ని నిలదీశారు. దీనిని గల్ఫ్‌ దేశాల్లోని పాలకులు వ్యతిరేకించారు. ఎలాగైన సద్దాం పీడ వదిలించుకోవటానికి.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్‌ వద్దకు వెళ్లి మోకరిల్లారు. సద్దాం హుస్సేన్‌ను పట్టుకొచ్చి మరీ ఉరిశిక్ష వేయించే దాకా వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఖమేనీని ఎలాగైనా వదిలించుకోవాలని గల్ఫ్‌దేశాలు ట్రంప్‌ను ప్రాధేయపడుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి.. రెండోనెలలోకి ప్రవేశించినా.. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం ఆగటం లేదు. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపైనే కాదు.. ఆ దేశాల ఆర్థిక మూలాలపై కూడా యుద్ధం ప్రభావితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొజ్తబా ఖమేనీని ఓడించాలని అమెరికా అధ్యక్షుడిని కోరుతున్నట్టు కార్పోరేట్‌ మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రెంటికి చెడ్డ రేవడిలా మారిన ట్రంప్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అభ్యర్థనలే.. చర్చల్లేవు ట్రంప్‌ వాదనలను తిరస్కరించిన ఇరాన్‌
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించినప్పటికీ పురోగతి సాధించామన్న వాషింగ్టన్‌ వాదనలను ఇరాన్‌ తోసిపుచ్చింది. అమెరికాతో చర్చలు జరుపుతున్నామన్న విషయాన్ని ఖండించింది. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలు తీవ్ర అపనమ్మకాన్ని వెల్లడిస్తున్నాయని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరపలేదన్న వాదనలను ఇరాన్‌ స్పష్టం చేసింది. అయితే చర్చలు ”చాలా బాగా” పురోగమిస్తున్నాయని వాషింగ్టన్‌ పదేపదే చేస్తున్న ప్రకటనలకు ఇది విరుద్ధంగా ఉంది. 31 రోజుల సంఘర్షణ సమయంలో అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్‌తో సహా మధ్యవర్తుల ద్వారా ప్రతిపాదనలతో కూడిన చర్చల అభ్యర్థనను వాషింగ్టన్‌ కేవలం సమర్పించిందని అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయీ స్పష్టం చేశారు.

సైనిక చర్యలు కొనసాగుతున్నందున, ఇరాన్‌ తనను తాను రక్షించుకోవడం పైనే పూర్తిగా దృష్టి సారించిందని, తమ జాగ్రత్త వైఖరికి కారణమైన గత దౌత్యపరమైన ”ద్రోహాలను” ఆయన గుర్తు చేసుకున్నారు.
”మా వైఖరి చాలా స్పష్టం. అమెరికా సైనిక దురాక్రమణ, దండయాత్ర పూర్తి తీవ్రతతో కొనసాగుతున్నందున మా ప్రయత్నాలన్నీ ఇరాన్‌ అస్తిత్వాన్ని కాపాడుకోవ డానికే అంకితం చేయబడ్డాయి. గత అనుభవాలను మేము మా ప్రాణంతో సమానంగా చూశాం. ఏడాదిలోపు రెండు సందర్భాల్లో దౌత్యానికి జరిగిన ద్రోహాన్ని మేము మరచిపోం” అని ఇస్మాయిల్‌ బఖాయీ అన్నారు. మరోపక్క రహస్య సంప్రదింపులు నిశిత పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ పరస్పర విరుద్ధమైన వాదనలు టెహ్రాన్‌ , వాషింగ్టన్‌ మధ్య పెరుగుతున్న అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో ప్రారంభమైన ఇరాన్‌-అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధం తీవ్రతరం అవుతూనే ఉంది.

చమురు ట్యాంకర్‌పై దాడి
దుబారు పోర్టులో భారీ అల్‌-సల్మీ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి చేసింది. ఇది చమురు లీకేజీకి దారితీయవచ్చని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ హెచ్చరించింది. లెబనాన్‌లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులు హత్యకు గురైన ఘటనకు ప్రతిస్పందనగా, ఫ్రాన్స్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని కోరింది. అలాగే జిద్దా నగరంలో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరం, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2 ప్రాంతీయ పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ దాడులను తీవ్రంగా ఖండించారు.

”ధైర్యం చూపండి.. చమురు తెచ్చుకోండి…” ఇతర దేశాలను రెచ్చగొడుతున్న ట్రంప్‌
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించడంతో చమురు ట్యాంకర్లు, నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్‌ జలసంధి నుంచి జెట్‌ ఇంధనం అందని బ్రిటన్‌ వంటి దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలో చేరడానికి నిరాకరించాయని ఆయన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ”మీకు నాదొక సూచన. మొదటిది: అమెరికా నుంచి చమురు కొనండి. మా వద్ద పుష్కలంగా చమురు ఉంది. రెండవది: ధైర్యం చూపండి.. హార్ముజ్‌కు వెళ్లి చమురు తెచ్చుకోండి.” అని సూచించారు. అంతేకాక ”మీరు సొంతంగా పోరాడటం నేర్చుకోవాలి. మీరు మాకు ఎలాగైతే అండగా ఉండరో, అలాగే అమెరికా మీకు ఎల్లప్పుడూ అండగా ఉండదు. ఇరాన్‌ బలహీనపడింది. కష్టమైన పని పూర్తయింది. ఇప్పుడు వెళ్లి చమురు తెచ్చుకోండి.” అని ట్రంప్‌ పోస్టు చేశారు. సముద్రపు నీటిని తాగడానికి యోగ్యంగా మార్చేందుకు ఉపయోగించే ఇరాన్‌ డీశాలినేషన్‌ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

హార్ముజ్‌పై నియంత్రణ సాధిస్తాం : అమెరికా ట్రెజరీ సెక్రెటరీ
హార్ముజ్‌ జలసంధిపై చివరికి తమ నియంత్రణను సాధిస్తామని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ తెలిపారు. అవసరమైతే అమెరికా లేదా బహుళ దేశాల రక్షణతో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఖర్గ్‌ ద్వీపాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు, ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్‌ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా అధ్యక్షులు చెప్పినట్టుగా తమ దేశంలోని విద్యుత్‌ ప్లాంట్లపై దాడులు జరిగితే హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఇదివరకే హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -