స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
మహిళా రైతులు పోరాడి హక్కులను సాధించుకోవాలి :
ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
రామన్నపేటలో మహిళా రైతు రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రైతు సంఘం ‘రాష్ట్ర మహిళా రైతు సదస్సు’ నిర్వహించారు. సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ చిత్రపటాలకు జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన సదస్సులో జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కబంధ హస్తాల్లో బందీగా చేసి రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలపై మహిళా రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం.. పెట్టుబడికి 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సూచించిందని, దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో 60 నుంచి 70 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. నాటు వేసే దగ్గర నుంచి కోత కోసే వరకు అన్ని దశల్లోనూ వారి కష్టం ఉందని వివరించారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత పురుషులకు పనివారం తగ్గిందని, అదే క్రమంలో మహిళలకు పని ఒత్తిడి బాగా పెరిగిందని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదనే మాట ప్రతి ఒక్కరూ ఉచ్చరించడం తప్ప రైతు శ్రేయస్సు కోసం పాలకవర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సరైన మద్దతు ధర, సౌకర్యాలు, భరోసా కల్పించినప్పుడు మాత్రమే వ్యవసాయం సుభిక్షం అవుతుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి చీకటి వాణిజ్య ఒప్పందాలు చేసుకొని వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్స్ మొదలగు పంటలను జీరో ట్యాక్స్ ద్వారా దిగుమతి చేసుకోవడంతో దాని ఫలితంగా స్వదేశీ పంటలకు ఆదరణ తగ్గి రైతు దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని జూలకంటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన సవరణ బిల్లు విత్తన రంగాన్ని బహుళ జాతి కంపెనీల చేతిలో పెడుతుందన్నారు. విత్తన, విద్యుత్ రంగాలను పూర్తిగా ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసిందని తెలిపారు.
విదేశీ ఒప్పందాలతో వ్యవసాయం కుదేలు : పోతినేని
అమెరికా- ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ఆ దేశాల మధ్య మాత్రమే జరగడం లేదని, ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోసైతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడిందని, దేశ ప్రధాని మోడీ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపకుండా మౌనంగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. ట్రంప్ విధ్వంసాలను ఖండించకుండా.. విదేశీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి మోడీ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఈ ఒప్పందాలతో భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలకు హక్కులు లభించడం లేదు : ప్రమీల
వ్యవసాయ రంగంలో 70 శాతం మంది మహిళలు పనిచేస్తున్నప్పటికీ వారికి హక్కులు లభించడం లేదని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోతున్నారని విమర్శించారు. వ్యవసాయంలో ఒత్తిళ్లను తట్టుకోలేక మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా రైతుల్లో చాలామంది కౌలు రైతులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాద్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి, మాటూరు బాలరాజు, బొంతు రాంబాబు, చీరిక అలివేలు, జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, నాయకులు గన్నబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, జల్లెల్ల పెంటయ్య, బురుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



