Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధోన్మాదంలో మనీగేమ్‌!

యుద్ధోన్మాదంలో మనీగేమ్‌!

- Advertisement -

అమెరికా రక్షశాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌పై అనుమానాలు
నీ వల్లే ఇరాన్‌పై వార్‌కు దిగామన్న ట్రంప్‌
న్యూయార్క్‌ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతోన్న వేళ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌కు సంబంధించి ఓ సంచలన వార్త వినిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సైనిక చర్య ప్రారంభానికి కొన్ని వారాల ముందు హెగ్సెత్‌ బ్రోకర్‌ ఒకరు అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం వెలువరించింది. అయితే ఇంతకు ముందు హెగ్సెత్‌ చెప్పటం వల్లే యుద్ధానికి దిగినట్టు ట్రంప్‌ ప్రకటన చేశారు. దీన్ని బట్టి డీల్‌ షేరింగ్‌ కాస్త బెడిసికొట్టిందని స్పష్టమవుతోంది.

డీల్‌ ఎలాగంటే..!
మార్గాన్‌ స్టాన్లీతో కలిసి పనిచేస్తోన్న ఆ బ్రోకర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్‌రాక్‌ను సంప్రదించినట్టు సమాచారం. బ్లాక్‌రాక్‌కు చెందిన డిఫెన్స్‌ ఇండిస్టియల్స్‌ యాక్టివ్‌ ఈటీఎఫ్‌ల్లో మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి ఆ బ్రోకర్‌ ఆరా తీసినట్టు సదరు కథనం వెల్లడించింది. దీనికి సంబంధించి అంతర్గతంగా చర్చలు నడిచాయని సదరు వర్గాలు పేర్కొన్నట్టు తెలిపింది. కానీ, ఆ ఈటీఎఫ్‌లను మార్గాన్‌ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అప్పట్లో అవి అందుబాటులో లేకపోవడంతో ఆ పెట్టుబడుల ప్రక్రియ ముందుకు వెళ్లలేదని సమాచారం. ఆ తర్వాత పీట్‌ హెగ్సెత్‌ బ్రోకర్‌ మరో రక్షణరంగ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. అయితే, యుద్ధానికి కొన్ని వారాల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పీట్‌ హెగ్సెత్‌ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీట్‌ చెప్పడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి దిగానంటూ అమెరికా అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పెట్టుబడుల వార్తల గురించి రక్షణ శాఖ కార్యదర్శి నుంచి గానీ.. పెంటగాన్‌ నుంచి గానీ ఎలాంటి స్పందన వెలువడలేదు.బ్లాక్‌రాక్‌కు చెందిన డిఫెన్స్‌ ఇండిస్టియల్స్‌ యాక్టివ్‌ ఈక్విటీ ఫండ్‌ విలువ 3.2 బిలియన్‌ డాలర్లు. రక్షణ, భద్రతపై ప్రభుత్వ ఖర్చు పెరగడం వల్ల లాభపడే ఏరోస్పేస్‌, సెక్యూరిటీ టెక్నాలజీ, డిఫెన్స్‌ కాంట్రాక్టింగ్‌ వంటి కంపెనీల స్టాక్‌ పోర్ట్‌ఫోలియోను ఇది నిర్వహిస్తుంది. ఆర్టీఎక్స్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి ప్రధాన రక్షణ రంగ కంపెనీలు దీనితో కలిసి పనిచేస్తున్నాయి. తక్కువ ఫీజులు, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో ఇలాంటి ఈటీఎఫ్‌లకు మదుపర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -