కళ్లల్లో ఆశ…
హృదయంలో నిరాశ..
వృద్ధాశ్రమం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ..
తొంబై ఏళ్ల అచ్చమ్మ కన్నీటి గాధ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
“నాన్న… నా వాళ్లు వస్తారు… నన్ను తీసుకెళ్తారు…” అంటూ అశ్వారావుపేట అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమం గుమ్మం వైపు కళ్లప్పగించి చూస్తున్న 91 ఏళ్ల అచ్చమ్మ మాటలు వినగానే అక్కడున్న వారి హృదయాలు చలించి పోయాయి. చిన్నప్పుడు తన పిల్లలు ఏడిస్తే తాను నిద్ర మానుకుని ఒడిలో పెట్టుకుని ఊరడించిన తల్లి…
ఈరోజు తనే కన్నీళ్లు పెట్టుకుంటూ “నన్ను ఎందుకు వదిలేశారు?” అని అడగాల్సిన పరిస్థితి రావడం కాలం చేసిన క్రూరమైన పరిణామం కాకపోతే ఏమిటి? సంక్రాంతి పండుగ తర్వాత ఆశ్రమం దగ్గరికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారని చెబుతున్న అచ్చమ్మ, “ఫోన్ చేయాలంటే ఫోన్ లేదు… నంబర్ లేదు… వాళ్లు ఎలా ఉన్నారో కూడా తెలియదు…” అని చెప్పేటప్పుడు ఆమె గొంతు ఆగిపోయింది.
“ఒక పాత చీర ఇచ్చి వెళ్లిపోయారు… ఇదేనా నా జీవితానికి చివరి బహుమతి?” అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక విలేకరుల కళ్లలోనూ నీళ్లు మెదిలాయి. బుధవారం ఆశ్రమం లో ఓ కార్యక్రమానికి హాజరైన విలేకరుల దృష్టిలో పడిన ఓ వృద్ధురాలు వాస్తవ గాధ ఇది. ప్రతిరోజూ ఆశ్రమం గుమ్మం దగ్గర కూర్చుని
“ఈరోజైనా వస్తారేమో…”“ఇంకోసారి పిలుస్తారేమో…” అని ఎదురు చూస్తున్న ఆ పండు వయసు తల్లి మనసులో ఎంత బాధ ఉందో ఊహించుకోవడమే కష్టం.
మనసును తట్టి లేపే ప్రశ్న
మనకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కాపాడిన తల్లిని… మన భవిష్యత్తు కోసం తన కోరికలు త్యాగం చేసిన తండ్రిని… వాళ్లు నడవలేని వయసులో మనం వదిలేస్తే మన విజయాలకు అర్థం ఏమిటి? ఒకసారి మన హృదయాన్ని అడుగుదాం వాళ్లు మనల్ని చిన్నప్పుడు వృద్ధాశ్రమంలో వదిలేసి ఉంటే మనం ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళం? సమాజానికి పిలుపు
తల్లిదండ్రులకు అవసరం పెద్ద ఇల్లు కాదు…పెద్ద మనసు. అన్నం కాదు…ఆప్యాయత. డబ్బు కాదు… ఒక ప్రేమతో పలికే “అమ్మ” అనే మాట.
చివరిగా..
తల్లిదండ్రులను దేవుళ్లలా చూసే సంస్కృతి మనది…వాళ్లను ఒంటరిగా వదిలేయడం మనిషితనం కాదు.
గుర్తుంచుకోండి: ఈరోజు వాళ్లు… రేపు మనమే.!



