నవతెలంగాణ ఖమ్మం:
నేటి నుంచి అమలు అవుతున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా ఖమ్మంలో కార్మిక సంఘాలు బ్లాక్ డే నిరసన చేపట్టాయి. కార్మిక హక్కులను రక్షించాలంటూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
పనిచేసే ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని, భోజన విరామ సమయంలో నిరసనలు తెలపాలని, సాయంత్రం ఉమ్మడిగా ఊరేగింపులు చేయడానికి కార్మికుల సిద్దమయ్యారు. ఆదాని, అంబానీ సేవలో తప్ప కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత ఏ మాత్రం పట్టించుకోకుండా లేబర్ కోడ్స్ అమలు చేయటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ డే కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్ టీయూ తదితర సంఘాలు పాల్గొన్నాయి.



