నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు,పరిసరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని,ప్రతిరోజూ శానిటేషన్ పనులు నిర్లక్ష్యం లేకుండా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య,వారి హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఉద్యోగి విధిగా డైలీ అటెండెన్స్ నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతిరోజూ ఓపి (OP)కి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాల నమోదు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.రోగుల రిజిస్టర్‌ను సమగ్రంగా నిర్వహించాలనీ,ప్రతి రోగి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.ఆసుపత్రిలో అవసరమైన ఔషధాలు సరిపడా ఉన్నాయా లేదా అని సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
ఎలాంటి లోటు లేకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.రోగులకు అందిస్తున్న మందుల వివరాలను సక్రమంగా రికార్డు చేయాలని తెలిపారు.రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి మనోహర్,వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



