‘అయ్యో… మీరు ఇంత మంచివారు కదా! మీకెందుకు ఇలా జరిగింది..?’ ఇలా సింపతితో చిరాకు తెప్పించే మాటలు. ‘మంచి డాక్టర్ దగ్గర చూపించకపోయారా..’ లోపాన్ని పసిగట్టామన్న అత్యుత్సాహం. ‘ఇంట్లో కూర్చోబెడితే ఎలా… కొంచెం బయటకు తీసుకొస్తే పిల్లల్ని చూస్తాడు, తెలివి పెరుగుతుంది’ దయార్థ హృదయాల సలహా. ‘అయ్యయ్యో పిల్లల్ని కొడతాడేమో ఇలాంటి పిల్లల్ని బయటకు తీసుకురాకూడదు, ఇంట్లోనే పెట్టాలి’.. ప్రాణహాని భయంతో పాకులాడే ప్రాణాలు. ‘ఏ జన్మలో ఏ పాపం చేశారో, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నారు’.. అక్కస్సు వెళ్లగక్కే అమాయకత్వం. ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా పట్టించుకోకూడదు. మన పిల్లలు ఇండిపెండెంట్ అయ్యేందుకు చేయగలిగే ప్రతి ప్రయత్నాన్ని ఎంతో ఓర్పుతో ముందుకుసాగాలి. సాధారణంగా పిల్లల బాధ్యత అంటే తల్లిదే అనే భావన మన సమాజంలో ఉంది. ఇక ప్రత్యేక పిల్లల్ని చూసుకోవడం మరింత బాధ్యతతో కూడుకొని ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా మానవి పాఠకుల కోసం ఈ ప్రత్యేక వ్యాసం…
పర్సనల్ విత్ డిజబుల్ యాక్ట్ 2016 ప్రకారం మొత్తం 21 రకాల వైకల్యాలను గుర్తించారు. వాటిలో ఆటిజం స్పెక్ట్రం డిసార్డర్ (Autism Spectrum Disorder (ASD) ఒకటి. Autism Spectrum Disorder అనే పదం గ్రీక్ భాష నుంచి వచ్చింది. Autos (Greek word) మూల పదం నుండి వచ్చింది. దీని అర్థం ‘సెల్ఫ్’ (తనలో తాను) ఆటిజం అంటే వ్యక్తి తనలో తాను ఉండటం, బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువగా ఉండటం. ఈ పదాన్ని మొదటగా Eugen Bleuler (1911లో) ఉపయోగించాడు. ఇది మెదడు అభివృద్ధి సమస్య. కమ్యూనికేషన్, (మాట్లాడటం) ప్రవర్తన సామాజిక సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
లక్షణాలు ఇవే…
Spectrum అంటే లక్షణాలు తక్కువ నుంచి ఎక్కువ వరకు మారుతూ ఉండటం. ముఖ్యంగా కమ్యూనికేషన్ సమస్యలు, మాట ఆలస్యంగా రావడం, అవసరాలు చెప్పలేకపోవడం, చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ చెప్పడం, సామాజిక సమస్యలు, కళ్లలోకి చూడకపోవడం, పేరు పిలిచినా స్పందించకపోవడం, ఒంటరిగా ఉండతానికి ఇష్టపడటం, పునరావృత ప్రవర్తనలు, చేతులు ఊపడం, ఒకే పని మళ్లీ మళ్లీ చేయడం, రొటీన్ మారితే ఇబ్బంది పడటం మొదలైనవి. ఆలస్యంగా మాట్లాడటం, ఇతర పిల్లలతో ఆడకపోవడం, శబ్దాలు/లైట్లు ఇబ్బంది పెట్టడం, భావాలు అర్థం చేసుకోలేకపోవడం వంటి సాధారణ లక్షణాలు కొన్నింటిని చూసి గుర్తించవచ్చు.
సాధారణ కారణాలు
ఆటిజం రావటానికి ఇది అని ప్రత్యేక కారణం చెప్పలేకపోయినప్పటికీ కొన్ని సాధారణ కారకాల్లో భాగంగా జన్యు కారణాలని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఉంటే అవకాశం పెరుగుతుంది. కొన్ని జీన్స్‌లో మార్పులు, మెదడు అభివృద్ధి సమస్యలు, మెదడు నిర్మాణం/పని విధానం తేడా, నర్వ్ కనెక్షన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపం, పుట్టిన తర్వాత, పుట్టేటప్పుడు ఆక్సిజన్ లోపం, తక్కువ బరువుతో పుట్టడం, ఫిట్స్/జ్వరాలు, కాలుష్యం, హానికర రసాయనాలు, మందుల ప్రభావంగా వంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు.
పరిష్కార మార్గాలుగా…
స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ శిక్షణ ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి పిల్లలకు శిక్షణలు ఇవ్వబడతాయి. మితమైన ఆటిజంలో తక్కువ సహాయంతో కొంతమేర మాట్లాడగలరు. మధ్యస్థ ఆటిజంలో మధ్యస్థ సహాయం అవసరం వుంటుంది. పునరావృత వైఖరి ఎక్కువ. తన అత్యవసరాలను మాత్రమే చెప్పగలరు. తీవ్రమైన ఆటిజంను ఎదుర్కొనే వారికి ఎక్కువ సహాయం అవసరం. మాట్లాడటం చాలా తక్కువ లేదా అసలు మాట్లాడలేకపోవచ్చు. సూటిగా చూడలేకపోవటం, ఇతరులతో సంబంధం చాలా తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత శ్రద్ధతో, విజువల్ మెటీరియల్స్‌తో, రొటీన్ ఫాలో అయ్యేలా చేస్తే స్వతంత్రంగా జీవించే సమర్థతను పెంపొందించుకుంటారు.
ఎప్పుడు గుర్తించవచ్చు
ఆటిజం లక్షణాలు సాధారణంగా 12 నుండి18 నెలల నుంచే కనిపించవచ్చు. 18 నుండి 24 నెలలలో స్పష్టంగా గుర్తించవచ్చు. 2 నుండి 3 ఏండ్ల వయసులో డయగ్నాస్టిక్ చేయవచ్చు. ఒకప్పుడు ఆటిజం విదేశీ సమస్యగా ఉండేది. అవగాహన లోపం, డయాగ్నోసిస్ సదుపాయాల లేమి వల్ల కొన్ని దేశాల్లో కచ్చితమైన మార్పులు కనిపించకపోవచ్చు. వాటిని వాస్తవ పరిస్థితులనుకునే భ్రమలో మాత్రం మనం ఉండలేము. నేడు ప్రపంచంలో ఆటిజం రేషియో ప్రపంచ వ్యాప్తంగా వందలో ఒకరికి, భారతదేశంలో 80 నుండి 100 మంది పిల్లల్లో ఒకరికి ఉంది. గణాంకాల్లో ఆటిజం సమస్య ఎక్కువగా ఉన్న దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఉంది. సుమారు 36 మంది పిల్లలలో ఒకరు ఈ సమస్యతో పోరాడుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అంతమాత్రాన అక్కడే ఎక్కువ మంది ఆటిజం సమస్యతో ఉన్నారు, మిగతా దేశాల్లో తక్కువ అని చెప్పలేము. ఎక్కువ అవగాహన, డయగ్నాసిస్ చేసే విధానాల వల్ల వాస్తవ పరిస్థితులను చూడగలిగాము.
వర్చువల్ ఆటిజం
పెద్దకుటుంబాలు విచ్ఛిన్నమై నేడు చిన్న కుటుంబాలుగా మొలకెత్తాయి. వారి అవసరాలు, బాధ్యతల నిర్వచనాలు మారిపోయాయి. ఫలితంగా చిన్నకుటుంబాల్లో వారికి పిల్లల్ని సముదాయించే ఓపిక కానీ, కేటాయించే సమయం కానీ ఉండటం లేదు. ఏడ్చినా, అల్లరిచేసినా, అన్నం తినకపోయినా, పనులకు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకైనా వారి చేతిలో మొబైల్ మాయావిని పెట్టేస్తున్నారు. అది వారిని వశం చేసుకుని స్క్రీన్ ఎడిక్షన్‌కు దోహదమవుతుంది. ఫలితంగా మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, ఏడవడం/ కోపం, మాట్లాడటం ఆలస్యం, ఇతరులతో కలవకపోవడం, కంటి సంపర్కం తక్కువ.. మొత్తంగా అభివృద్ది నెమ్మదిస్తుంది. ఇది వర్చువల్ ఆటిజంగా మరోసమస్యకు తెరదీస్తున్నది.
స్క్రీన్ నుంచి దూరంగా
వర్చువల్ ఆటిజం అనేది అధికంగా స్క్రీన్ ఉపయోగం వల్ల చిన్న పిల్లల్లో కనిపించే ఆటిజం లక్షణాలు. ఇది అఫీషియల్ డయగ్నాసిస్ కాదు. కానీ ప్రాక్టికల్‌గా ఉపయోగించే టర్మ్. కారణం చిన్న వయసులో ఎక్కువ సమయం మొబైల్, టీవీ, యూట్యూబ్ చూడటం. మానవ సంబంధాలు తగ్గిపోవడం, ఆలస్యంగా మాట్లాడడం, పేరు పిలిచినా స్పందించకపోవడం, కళ్లలోకి చూడకపోవడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, స్క్రీన్ మీద ఎక్కువ ఆసక్తి చూపటం జరుగుతుంది. ఇకనైనా తల్లిదండ్రులు పిల్లలకు స్క్రీన్ నుంచి దూరంగా ఉంచి వారితో సమయాన్ని గడపటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించవచ్చు.
అందరి జీవితానికి విలువుంది
ప్రతి ఏడాది ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఏప్రిల్ 2న జరుపుతారు. 2026 థీమ్ ‘ఆటిజం అండ్ హ్యూమానిటీ’గా నిర్ణయించారు. ‘అందరి జీవితానికి విలువ ఉంది’ అని ఉద్దేశ్యం. ఈ థీమ్ ఆటిజం ఉన్న వ్యక్తుల గౌరవం, సమాన విలువను ప్రతిబింబిస్తూ, అవగాహనతో ముందుకు వెళ్తూ, అర్థవంతమైన సమావేశం, గౌరవంతో కూడిన సమాజాన్ని ప్రోత్సహించటం ముఖ్య లక్ష్యంగా ఉంది. మనిషి శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండగలిగేది. సమర్థత ఉన్నా సాధించాలనే తపన లేని వారు ఎంతో మంది ఉన్నారు. లోపం ఉన్నా, అది పాపం కాదని, శాపమైనా వరంగా మార్చుకోగలిగే ధృడ విశ్వాసం తమకుందని, అలుపెరుగని పోరాటం చేసి ఎందరో తమ జీవితాలను ఆదర్శంగా చూపి నిరూపించారు. తల్లిదండ్రులు నిరాశ, నిస్పృహలకు లోనవకుండా, నిరంతర శ్రమతో, అలుపెరుగని ఆత్మవిశ్వాసంతో ఆటిజంతో కూడా అర్థవంత జీవితాన్ని గడపవచ్చని తెలుసుకోవాలి.
- షేక్. నసీమాబేగం,
ప్రత్యేక బోధకురాలు, 9490440865



