ఆటిజం అనేది జీవితాంతం ఉండే ఒక నాడీ సంబంధిత రుగ్మత. పిల్లల్లో ఇది మొదటి మూడేండ్లలోపు సంభవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 64 మంది పిల్లల్లో ఒక్కరు ఆటిజం రుగ్మత కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దాని వలన కలిగే దుష్ప్రభావాలను సమాజానికి తెలియచేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2007 ఏప్రిల్ 2న అంతర్జాతీయ ఆటీజం అవేర్నెస్ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఆటిజంను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తారు. దీనితో బాధపడుతున్న పిల్లలు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైనది. సామాజిక భద్రత పాటు పిల్లలకు భద్రత గౌరవం, సమాన అవకాశాలను కల్పించడం తల్లిదండ్రులకు చాలా కష్టంతో కూడుకున్నది.
చిన్న పిల్లల్లో 18 నెలల వయస్సు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపిస్తున్న లోపాలను గుర్తిస్తారు. మొదటగా పిల్లలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ క్రమేణా సామాజిక, భాషా నైపుణ్యాలను కోల్పోవడం వలన ఆటిజం లక్షణాలు తీవ్రంగా మారుతాయి. ఆర్టిజం కలిగిన పిల్లల సామర్థ్యాలు, అవసరాలు మారుతూ ఉంటూనే కాలక్రమేనా అభివృద్ధి చెందుతాయి. ఆటిజం రుగ్మత కలిగిన వారిలో కొద్దిమంది స్వతంత్రంగా జీవించగలుగుతున్నప్పటికీ మరికొద్ది మంది తీవ్రమైన వైకల్యానికి గురవుతారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు ఆటిజం కలిగిన పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అనేక స్టడీ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నవి. తల్లిదండ్రులు తక్కువ వయస్సు ఉండడం, గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురవడం, నెలలు నిందకముందే పిల్లలు పుట్టడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి సంఘటనలు ఆటిజం పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుండి 2023 నాటికి 178 శాతం అటిజం ప్రాబల్యం పెరిగింది. మన దేశంలో ప్రస్తుతం కోటి ఎనభై లక్షల మంది ఆటిజంతో బాధపడుతున్నారని అంచనా. దేశంలో ప్రతి 66 మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం సమస్య ఉంది. వీరిలో నలభై శాతం మంది పిల్లలు మాట్లాడలేకపోతున్నారు. ఆటిజం బాలికల కంటే అబ్బాయిల్లో నాలుగురేట్లు ఎక్కువగా నిర్ధారణ అవుతుందని ప్రభుత్వ లెక్కలు. అటిజం ఉన్న పెద్దల్లో నలభై శాతం మంది జీతం పొందే ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. ఆటిజం కలిగిన వారిలో మూడింట ఒక్కవంతు మందికి ఆందోళన ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నవి. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఆటిజంను కూడా అంగవైకల్యంగా గుర్తించింది. కానీ, నేటికీ వారికి వైకల్య ధృవీకరణ పత్రాలివ్వడం లేదు. నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, మానసిక వికలాంగుల సంక్షేమం కోసం నేషనల్ ట్రస్ట్ ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు ఐదు లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. వీరి గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో స్వచ్చంద సంస్థలు, ప్రయివేటు సంస్థలు ఆటిజం థెరపి కోసం ప్రత్యేక కేంద్రాలను నడుపుతున్నవి. రాష్ట్ర వ్యాపితంగా వందలాది ప్రయివేటు క్లినిక్స్,స్పెషల్ స్కూల్స్ నడుస్తున్నవి. ప్రయివేటు క్లినిక్స్ విచ్చల విడిగా నెలకు రూ.15వేల నుంచి రూ.50వేల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రయివేటు థెరపి సెంటర్స్, స్పెషల్ స్కూల్స్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి.. సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెంటల్లి హ్యాండి క్యాపడ్ (ఎన్ఐఎంహెచ్) ఉంది.
కానీ, అక్కడ సరిపడా సిబ్బంది, పరికరాలు లేదు. జిల్లాల నుండి ట్రీట్మెంట్ కోసం చంటి పిల్లలతో హైదరాబాద్‌కు రాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉచిత థెరపి సెంటర్స్ ప్రారంభించి, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మూడేళ్ల వయస్సు కలిగిన పిల్లలకు ఆటిజం పరీక్షలు నిర్వహించాలి.ఈ సమస్య కలిగిన పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటిజం స్పెషలిస్ట్ డాక్టర్‌ను నియమించాలి. పుట్టిన పిల్లల్లో శరీరక, మానసిక వైకల్యాల లోపాలను గుర్తించి వాటిని నివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాలభరోసా పథకాన్ని ప్రారంభించింది. దీన్ని పటిష్ట అమలునకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఆటిజం ఉన్న వ్యక్తులతో సహా ప్రజలందరికీ అత్యున్నత స్థాయి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందే హక్కు ఉంది. అయినప్పటికీ, ఆటిజం ఉన్న వ్యక్తులు తరచుగా కళంకం, వివక్షకు గురవుతారు.
ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య సమాజంలో భాగస్వామ్యం అవకా శాలను అన్యాయంగా నిరాకరిస్తోంది. ఆటిజం ఉన్నవారికి సాధారణ జనాభాకు ఉండే ఆరోగ్య సమస్యలే ఉంటాయి. అయితే, వీటికి అదనంగా, వారికి ఆటిజం లేదా ఇతర సహాసంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలు ఉండవచ్చు. శారీరక నిష్క్రియాత్మకత, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి ప్రవర్తనాపరమైన ప్రమాద కారకాల కారణంగా, వారు దీర్ఘకాలిక అంటువ్యాధులు కాని వ్యాధుల బారిన పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే, వారు హింస, గాయాలు, దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అకాల మరణం చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
మిగతా జనాభా మాదిరిగానే, ఆటిజం ఉన్న వారికి కూడా సాధారణ ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అవసరం. వీటిలో ప్రోత్సాహక, నివారణ సేవలు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్స కూడా ఉంటాయి. అయినప్పటికీ, సాధారణ జనాభాతో పోలిస్తే ఆటిజం ఉన్నవారిలో తీరని ఆరోగ్య సంరక్షణ అవసరాల రేటు ఎక్కువగా ఉంది. మానవతా అత్యవసర పరిస్థితులలో కూడా వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఆటిజం గురించి సరైన, అవగాహన లేకపోవడం ఒక సాధారణ అడ్డంకిగా ఏర్పడుతుంది. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులలో, సమాజంలో ఆటిజంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
- ఎం.అడివయ్య, 9490098713



