Thursday, April 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆర్థిక సంక్షోభంలో దక్షిణాసియా

ఆర్థిక సంక్షోభంలో దక్షిణాసియా

- Advertisement -

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావం
పొదుపు చర్యలను ప్రారంభించిన ప్రభుత్వాలు
టెహ్రాన్‌:
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం నెల రోజులు దాటినా..సద్దుమణిగే సూచనలు ఇప్పట్లో కనిపించటం లేదు. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంలో ఇప్పటివరకు 2వేల మందికిపైగా ఇరానీయులు మృతి చెందారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాల వంటి ఇరాన్‌ పౌర మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది. అదే విధంగా ఇరాన్‌ ప్రతీకార దాడుల వల్ల పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయిల్‌లో కూడా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు వచ్చాయి. అయితే.. ప్రత్యక్ష మరణాలు, విధ్వంసానికి మించి, ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండడంతో దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

గల్ఫ్‌ దేశాల్లో అధిక సంఖ్యలో దక్షిణాసియా జాతీయులు ఉండటం, గల్ఫ్‌ దేశాలు ఈ ప్రాంతానికి ప్రధాన ఇంధన ఎగుమతిదారులుగా ఉండటం వల్ల, ఈ యుద్ధం యొక్క పరోక్ష ప్రభావాలకు పొరుగున ఉన్న దక్షిణాసియా ప్రాంతం ప్రధానంగా సంక్షోభానికి గురైంది. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలలో 2.1 కోట్ల మందికిపైగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇరాన్‌ ప్రతీకార చర్యల వల్ల ఇప్పటివరకు మరణించిన వారిలో కనీసం 10మంది వివిధ దక్షిణాసియా దేశాలకు చెందినవారే. హింస, అస్థిరత కారణంగా చాలా మంది తమ ఇండ్లకు తిరిగి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే దక్షిణాసియా దేశాలలోని లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎందుకంటే, ఈ కుటుంబాలలో చాలా వాటికి పర్షియన్‌ గల్ఫ్‌లోని ఉద్యోగాలే ఏకైక ఆదాయ వనరు. వలసదారులపై ప్రభావంతో పాటు, హార్ముజ్‌ జలసంధిని మూసివేయడానికి ఇరాన్‌ అనుసరిస్తున్న ఒత్తిడి వ్యూహం, ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంధనం , ఇతర వస్తువుల వాణిజ్యాన్ని కూడా దెబ్బతీసింది. దీనివల్ల దక్షిణాసియాలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటికే ధరలు పెరగడం, ఈ వినియోగ నియంత్రణకు అనేక దేశాలు పని గంటలను తగ్గించడం, పాఠశాలలను మూసివేయడం వంటి అత్యవసర చర్యలను తీసుకోవలసి వచ్చింది. ఆ చర్యలు దేశీయ జీవితాన్ని, పారిశ్రామిక ఉత్పత్తిని మరింతగా దెబ్బతీస్తున్నాయి. దక్షిణాసియాలో సాధారణంగా ఇంధనానికి డిమాండ్‌ పెరిగే వేసవి కాలంలోనే ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ చమురు, గ్యాస్‌ వంటి తమ ప్రాథమిక ఇంధన వనరుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అంతేకాక ఈ యుద్ధం వల్ల ఈ ప్రాంతానికి కీలకమైన ఎరువుల సరఫరాకు, అలాగే దక్షిణాసియా దేశాల నుంచి పశ్చిమాసియాకు జరిగే వివిధ వస్తువుల ఎగుమతికి కూడా అంతరాయం ఏర్పడి, ఆర్థిక కార్యకలాపాలు మరింతగా దెబ్బతింటాయని అంచనా వేస్తున్నారు.

వివిధ పొదుపు, అత్యవసర చర్యలను పరిశీలిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం
ఇంధన కొరతను ఎదుర్కోనేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వివిధ పొదుపు, అత్యవసర చర్యలను పరిశీలిస్తోందని ‘ది డైలీ స్టార్‌’ ఇటీవల నివేదించింది. ఈ ప్రతిపాదిత చర్యలలో పాఠశాలలను మూసివేయడం, తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించడం, వారంలో అదనపు సెలవులను చేర్చడం , ఇంటి నుంచే పని చేసే అవకాశాలను కల్పించడం వంటివి చేస్తోంది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలలో విద్యుత్‌ వినియోగంపై బంగ్లాదేశ్‌ ఇప్పటికే ఆంక్షలు విధించింది.

పాకిస్తాన్‌లో రూ.332కు చేరిన లీటర్‌ ఇంధన ధర
ఇంధన సరఫరా కొరత కారణంగా పాకిస్తానీలు ఇప్పటికే ఇంధన ఉత్పత్తుల ధరలలో తీవ్ర పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత అధిక ధరలను ఎదుర్కోవలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్‌లో లీటరు ఇంధన ధర రూ.332 పాకిస్తానీ కరెన్సీ (1.20 డాలర్లు)చేరింది. ఈ దేశంలో వచ్చే నెల నుంచి ధృవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) లభ్యత దాదాపుగా సున్నాకి పడిపోతుందని పాకిస్తానీ అధికారులు తెలిపారు. దేశంలోని మొత్తం విద్యుత్‌లో దాదాపు 20 శాతం ఉత్పత్తి చేయడానికి ఎల్‌ఎన్‌జీని ఉపయోగిస్తారు. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతం నుంచి దిగుమతుల ద్వారానే తమ ఇంధన అవసరాలలో 90 శాతంపైగా ఆధారపడుతారు. దీంతో మార్చి ఆరంభంలోనే అత్యవసర చర్యలను అమలు చేసిన ప్రభుత్వాలలో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఒకటి. అలాగే వినియోగాన్ని అరికట్టేందుకు పాఠశాలలు, కళాశాలలను మూసివేయడంతో పాటు, ఇంధన పంపిణీకి కోటా విధానాన్ని అమలు చేస్తూ కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది.

నిరుద్యోగులుగా మారుతున్న లక్షలాది మంది
దేశంలోని అనేక పరిశ్రమలు ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌ సరఫరా కొరతతో మూతపడుతున్నాయి, దీనివల్ల కొన్ని పరిశ్రమలు పాక్షికంగా మూతపడటమే కాక లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. వివిధ నగరాల్లో వీధుల్లో ఆహార, పానీయ విక్రయాలపై ఎక్కువగా ఆధారపడి జీవించే లక్షలాది మంది ప్రజలు, వంట గ్యాస్‌ కొరత కారణంగా తమ వ్యాపా రాలను మూసివేయడమో లేదా కట్టెలు సమకూర్చుకోవడమో చేయాల్సి వస్తోంది.

క్లిష్ట పరిస్థితిలో నేపాల్‌
యుద్ధం కారణంగా నేపాల్‌ కూడా వంటగ్యాస్‌, నూనె కొరతను ఎదుర్కొంటోంది. ఇక ఉద్యోగాల కోసం పశ్చిమాసియాకు వెళ్లాలనుకుంటున్న వేలాది మంది నేపాలీ పౌరులు వెళ్లలేకపోతున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నవారు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలా వద్దా అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధం, ఈ వలసదారుల ఆర్థిక అవకాశాలకు, అలాగే స్వదేశంలో వారిపై ఆధారపడిన లక్షలాది మంది ఇతరుల అవకాశాలకు ముప్పు తెచ్చిపెట్టింది.

ఇంధన కొరత తగ్గించేందుకు శ్రీలంకలో అదనపు సెలవు
దిగుమతులపై అధికంగా ఆధారపడటం, తగినంత నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టిన తొలి దేశాలలో శ్రీలంక ఒకటి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇంధన ధరలు 33 శాతం పెరిగాయి. దీనికితోడు ఇతర నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయి. కీలకమైన సముద్ర వాణిజ్య మార్గంలో ఉన్న శ్రీలంక, తన ఓడరేవులలో రద్దీని, ఆలస్యాలను, అలాగే కొన్ని ఎగుమతులు రద్దు కావడాన్ని కూడా ఎదుర్కొంటోంది. ఈ ఇంధన ఉత్పత్తుల కొరతను తగ్గించడానికి, ప్రభుత్వం ఇప్పుడు వారంలో ఒకరోజు బుధవారాన్ని అదనపు సెలవుగా ప్రకటించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలను మరిన్నింటినీ పరిశీలిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -