– తక్షణం అలాంటి పాఠాలు మార్చండి
– సీఎంకు ఇంటర్ విద్యార్థిని లేఖ
నవతెలంగాణ – హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇంటర్ సెకండియర్ ఆంగ్లం ప్రశ్నపత్రంలో డైలాగ్ రైటింగ్‌లో రెండు ప్రశ్నలిచ్చారు. తన కుమార్తెకు వంట నేర్పాలనుకునే తల్లి, అమ్మాయి మధ్య సంభాషణ అందులో ఒకటి. మరో ప్రశ్న తన కుమారుడి భవిష్యత్ ప్రణాళికల గురించి తెలుసుకోవాలనుకునే తండ్రి, అబ్బాయి మధ్య సంభాషణ. అమ్మాయి అయితే వంట, అబ్బాయి అయితే భవిష్యత్ ప్రణాళికలా? వంట అంటే అమ్మాయిలే చేయాలా? ఈ ఆధునిక కాలంలో కూడా అమ్మాయిలను వంట గదులకు పరిమితం చేస్తారా? ఇలాంటి లింగ వివక్షతో కూడిన ప్రశ్నలు.. పాఠాలను మార్చండి’ అని హైదరాబాద్ కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదివి ఇటీవల పరీక్షలు రాసిన మహిమ కీర్తన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం పంపిన లేఖలో పేర్కొంది.
లింగ వివక్షపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఈ మెయిల్ ద్వారా ఇలా లేఖ రాసింది. ‘నేను పెరుగుతున్న క్రమంలో మా తల్లిదండ్రులిద్దరూ వంట చేయడం చూశాను. నాకు వంట చేయడం ఇష్టం. దాంతోపాటు 2023లో జరిగిన అండర్ 19 రైఫిల్ షూటింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిచాను. జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌ని. మన విద్యా వ్యవస్థ సమానత్వాన్ని నేర్పించాలి. పరీక్షలో లింగ వివక్షను చూపే ప్రశ్నలు చూసినప్పుడు నిరుత్సాహపడ్డాను. ఇలాంటి వాటిలో మార్పు చేస్తారని ఆశిస్తున్నా’ అని మహిమ కీర్తన పేర్కొంది.



