Friday, April 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబీటలు వారుతున్న పునాది విద్య!

బీటలు వారుతున్న పునాది విద్య!

- Advertisement -

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రాథమిక పాఠశాలలు మొదటి స్తంభాలు. బాలలందరికి ప్రాథమిక విద్య సజావుగా సమకూరితే ఆ జాతికి ఆర్థిక అభ్యున్నతి చేకూరుతుంది. కానీ, మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత విద్య లభిస్తున్నప్పటికీ అందులో నాణ్యత నేతిబీర చందంగా మారింది. దీనికి ప్రధాన కారణం- తరగతి గదిలో విద్యార్థుల తలకాయల ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించడం. ప్రాథమిక వ్యవస్థలో 30 మందికి ఒక ఉపాధ్యాయుడు అనే నిబంధన కారణంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. రాష్ట్రంలో 36శాతం ప్రాథమిక పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. 82శాతం ప్రాథమిక బడుల్లో బహుళ తరగతి బోధన నడుస్తున్నది. పిల్లలకు కనీస అభ్యసన సామర్ధ్యాలు బోధించడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా సమస్యలఒడిలో తొలి చదువులు సతమతమవుతున్నాయి.

ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్‌ 434 సిఫారసులతో విద్యా విధాన పత్రాన్ని ప్రభుత్వానికి 2026 ఫిబ్రవరి 26న అందించింది. విద్యా కమిషన్‌ నివేదికలో ప్రాథమిక విద్యకు సంబంధించి అనేక లోపాలను బయటపరిచింది. మధ్యాహ్న భోజనం, బోధనేతర పనులు, వివిధ రకాల నివేదికల తయారీ మొదలైన పరిపాలన పరమైన పనుల ఒత్తిడి వలన కేవలం మూడుగంటలు మాత్రమే బోధనకు సమయం కేటాయిస్తున్నారని నివేదిక తేట తెల్లంచేసింది. అలాగే రాష్ట్రంలో 2554 ప్రాథమిక బడులు ఒకే రూమ్‌తో కొనసాగుతున్నాయి అలాగే 5539 బడులు రెండు రూములతో 2686 బడులు మూడు రూములతో కొనసాగుతున్నాయని విద్యానివేదిక ప్రాథమిక బడుల లోపాలను ఎత్తిచూపింది.

అలాగే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడులు 36శాతం ఉన్నాయి. ఈ బడులలో ఓకే ఉపాధ్యాయుడు పరిపాలన సంబంధమైన పనులు చూసుకుంటూ పద్దెనిమిది సబ్జెక్టులను బోధిస్తున్నాడు. అలాగే 82శాతం బడులు ఒకరిద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నవి. గత దశాబ్ద కాలంగా ప్రాథమికబడుల్లో తరగతికి ఉపాధ్యాయుడిని కేటాయించమని ఉపాధ్యాయ లోకం అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాథమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య అంతకంతకు తగ్గుతున్నది. ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత వలన పునాది స్థాయి అయిన ప్రాథమిక విద్య పగుళ్ల బారిన పడుతున్నది. ఇలాంటి కారణాలతో జాతీయ విద్య సర్వేలలో ప్రాథమిక స్థాయిలో రాష్ట్రం ర్యాంకు మెరుగుపడడం లేదు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక స్థాయికి అనుసంధానం చేయాలనే సిఫారసును విద్యా కమిషన్‌ తన నివేదికలో వెల్లడించింది.

కానీ, తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇవ్వాలనే అంశాన్ని కూడా చేర్చిస్తే బాగుండేది. పది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక బడులను సమీప ప్రాథమిక బడులలో విలీనం చేస్తే మిగులు ఉపాధ్యాయులను సమీప బడికి పంపవచ్చు. ఆ విధంగా 20-50 మధ్య పిల్లలు ఉన్న బడులకు నలుగురు ఉపాధ్యాయులు చొప్పున అలాగే యాభైకంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇస్తే ప్రాథమిక బడులు బాగుపడతాయి. 13244 ప్రయివేటు బడులలో 211705 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే 24222 ప్రభుత్వబడులలో కేవలం 110275 మంది ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. ఈ లెక్కన ప్రయివేటు బడులలో ప్రభుత్వ బడుల కంటే టీచర్ల సంఖ్య రెట్టింపు ఉంది. కానీ, ప్రభుత్వ ప్రాథమికబడుల్లో ఒకరిద్దరు టీచర్లతో నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా విద్యాకమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యావ్యవస్థ బాగుకోసం ఏం చేస్తే బాగుంటుందో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందించాలి.

  • అంకం నరేష్‌, 6301650324
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -