భారతదేశం తన డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర ప్రయాణంలోఎన్నో శిఖరాలను అధిరోహించింది. కానీ, అదే వెలుగుల వెనుక.. మన జాతీయ రహదారుల పక్కన, ముళ్లపొదల చాటున, తాత్కాలిక గుడారాల నీడన ఒక ‘అదృశ్య భారతం’ నిశ్శబ్దంగా రోదిస్తోంది. వారు మన కళ్ల ముందే తిరుగుతుంటారు. ఇనుమును కరిగిస్తూ, పాత సామాన్లను సేకరిస్తూ, వీధి విన్యాసాలతో పొట్ట నింపుకుంటూ కనిపిస్తారు. కానీ, మన ప్రభుత్వ రికార్డుల్లో వారు లేరు. మన బడ్జెట్ అంకెల గారడీలో వారికి చోటులేదు. మన ప్రజాస్వామ్య ఫలాల వాటాలో వారికి వాసన కూడా తగలదు. వారే విముక్త (Denotified), సంచార (Nomadic) తెగలు. ఒకప్పుడు ఈ దేశ సాంస్కృతిక జీవనానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ జాతులు, నేడు స్వదేశంలోనే పరాయివారిగా బతుకుతున్నాయి. ‘లెక్కిస్తేనే గుర్తింపు – గుర్తిస్తేనే హక్కు’ అనే కనీస సూత్రం కూడా వీరికి వర్తించకపోవడం ఆధునిక భారత పౌరసత్వానికే ఒక సవాలు. 2027 జనాభా గణన ఈ చారిత్రక విస్మృతిని సరిదిద్దేందుకు మన ముందున్న ఒక ఆఖరి అవకాశం.
ఈ తెగల దుస్థితికి మూలం 1871లో బ్రిటిష్ వలస పాలకులు అమలు చేసిన ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’. బ్రిటిష్ పాలనకు లొంగని, స్వేచ్ఛగా సంచరించే తెగలను అణచివేయడానికి ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. కేవలం కొన్ని కులాల్లో పుట్టినందుకే వారిని ”పుట్టుకతోనే నేరస్తులు”గా ముద్రవేశారు. పిల్లలు పుట్టగానే వారిపై నేరముద్ర పడేది, వారు నిరంతరం పోలీస్ స్టేషన్లలో హాజరు కావాల్సి ఉండేది. వారి కదలికలపై తీవ్ర ఆంక్షలు ఉండేవి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, ఈ వర్గాలకు మాత్రం 1952 ఆగస్టు 31 వరకు విముక్తి లభించలేదు. అయ్యాంగార్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నల్లచట్టాన్ని రద్దు చేసిన తరువాతే వీరిని ‘విముక్త తెగలు’గా పిలవడం ప్రారంభమైంది. అయినప్పటికీ, చట్టం రద్దయినా ఆ చట్టం సృష్టించిన సామాజిక వివక్ష మాత్రం ఇప్పటికీ వీరిని వెంటాడుతూనే ఉంది. అయితే, 1871 నాటి చట్టం రద్దయినప్పటికీ, దాని స్థానంలో వచ్చిన 1952 నాటి ‘Habitual Offenders Act’ అనేక ప్రాంతాల్లో అమలులో ఉంది. ఈ చట్టం పోలీసులకు విస్తృత అధికారాలను ఇస్తోందనే విమర్శలు ఉన్నాయి.
చట్టం పేరు మారింది కానీ, పోలీసుల లాఠీ తీరు మారలేదనే భావన ఇప్పటికీ ఈ వర్గాల అనుభవాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ దేశంలో ఏ వర్గానికైనా న్యాయం జరగాలంటే ముందు ఆ వర్గం జనాభా ఎంత ఉందో తెలియాలి. కానీ డిఎన్టి/ఎన్టిల విషయంలో ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. 2008లో నియమించిన బాలకృష్ణ రేంకే కమిషన్ వీరి జనాభా సుమారు 10.74 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. 2017లో భిఖు రామ్‌జీ ఇదాటే కమిషన్ ఈ వర్గాల స్థితిగతులపై మరింత లోతైన విశ్లేషణను అందించింది. ప్రస్తుతం నిపుణుల అంచనాల ప్రకారం వీరి జనాభా 13 నుండి 15 కోట్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అంటే దేశ జనాభాలో దాదాపు పదిశాతం కంటే ఎక్కువ. అయినప్పటికీ, ఈ భారీ జనాభా ఏ అధికారిక గణనలోనూ ప్రత్యేకంగా నమోదు కావడం లేదు. వీరు ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గాలలో చెల్లాచెదు రుగా కలిసిపోవడంతో, వారి కోసం కేటాయించే నిధులు కూడా ఇతరవర్గాలకు మళ్లిపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో లెక్కించ బడని వారు.. పరిగణించబడరు (Those who are not counted, do not count).
ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, భారత దేశం ఈ వర్గాలను గుర్తించడానికి నిరాకరిస్తూనే ఉంది. వీరిలో కొందరు ఎస్సీలుగా, మరికొందరు ఎస్టీలుగా, ఇంకొందరు ఓబిసిలుగా జాబితా చేయబడ్డారు. చాలామందికి అసలు ఎక్కడా గుర్తింపు లేదు. ఒక రాష్ట్రంలో ఒక జాబితాలో ఉన్న వారు, మరో రాష్ట్రంలో మరో జాబితాలో ఉంటున్నారు. అయితే వివిధ అంచనాల ప్రకారం వీరి జనాభా 8 నుండి 14 కోట్ల మధ్య ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ, భారత ప్రభుత్వం వద్ద వీరి ఖచ్చితమైన జనాభాపై కనీస అంచనా కూడా లేకపోవడం ఒక పెద్ద లోపం. అందువల్ల, రాబోయే జనాభా గణనలో కేవలం సంఖ్యలు మాత్రమే కాకుండా, వారి వలసల తీరు, మాతృభాషల స్థితి, ఆరోగ్య సూచికలు వంటి కీలక డేటాను కూడా సేకరించడం అత్యవసరం.
అందుకే వీరి ప్రధాన డిమాండ్లు ‘మూడు సి’లతో మొదలవుతాయి: Cognisance(గుర్తింపు), Categorisation(వర్గీకరణ), Counting(గణన). ముందుగా వారి ఉనికిని గుర్తించాలి, ఆపై వారిని సరైన వర్గాల్లో చేర్చాలి, చివరగా జనాభా గణనలో ప్రత్యేకంగా లెక్కించాలి. ఈ మూడు దశలు పూర్తయినప్పుడే వీరి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సాంప్రదాయంగా సంచార తెగలు భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించేవి. గడియా లోహర్లు వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవారు. బంజారాలు ఉప్పు, ఇతర నిత్యావసరాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రవాణా చేసేవారు. మరికొందరు పశువైద్యులు, జానపద కళాకారులుగా జీవించేవారు.
అయితే ఆధునిక పారిశ్రామికీకరణ వీరి సంప్రదాయ నైపుణ్యాలను పనికిరాకుండా చేసింది. ట్రాక్టర్ల వినియోగం పెరగడంతో లోహర్‌ల అవసరం తగ్గింది. మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల బంజారాల వృత్తి దెబ్బతిన్నది. ఫలితంగా, నేడు వీరు నైపుణ్యం లేని కూలీలుగా మారిపోయారు. సంచార జీవన విధానం కారణంగా వారి పిల్లలకు విద్య అందడం కష్టమవుతోంది. రేషన్ కార్డులు, ఓటు హక్కు వంటి ప్రాథమిక హక్కులు కూడా అందుబాటులో ఉండవు. భూమి లేకుండా, స్థిర నివాసం లేకుండా జీవించడం వీరిని మరింత వెనుకబాటుతనంలోకి నెట్టుతోంది. ఈ తెగల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలనే ఆశతో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, సాంకేతిక కారణాలతో వారి పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. రాజకీయంగా ఓటు బ్యాంకుగా మారని ఈ వర్గాల సమస్యలు పెద్దగా ప్రాధాన్యం పొందడం లేదు. కులగణనపై జరుగుతున్న రాజకీయ చర్చలు ప్రధానంగా ఓబీసీల చుట్టూ తిరుగుతుండగా, అసలు అట్టడుగున ఉన్న ఈ వర్గాల గురించి చర్చ చాలా తక్కువగా ఉంది. విముక్త, సంచార తెగల సంక్షేమానికి మరో ప్రధాన అడ్డంకి వారి వర్గీకరణలో ఉన్న అస్పష్టత. ఒకే కులం ఒక రాష్ట్రంలో ఎస్టీగా ఉంటే, మరో రాష్ట్రంలో బీసీగా ఉండవచ్చు. ఇంకొక రాష్ట్రంలో ఏ జాబితాలోనూ ఉండకపోవచ్చు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు సమానంగా అమలుకావడం కష్టమవుతోంది. ఇదాటే కమిషన్ సూచించినట్లుగా, వీరికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ షెడ్యూల్ రూపొందించడం అత్యవసరం. ఎస్సీ,ఎస్టీ తరహాలో ప్రత్యేక రక్షణలు, కేటాయింపులు ఉంటే మాత్రమే వీరి జీవనస్థితిలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది.
ఇప్పటికే అయ్యంగార్ కమిటీ (1949) సిఫార్సుల మేరకు 1871 నాటి చట్టం రద్దు చేయబడింది. కాకా కాలేల్కర్ కమిషన్ (1953) కూడా వీరిని వెనుకబడిన వర్గాలుగా గుర్తించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ, ఈ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుతం వీరికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రత్యేక నియోజకవర్గాలు లేదా నామినేటెడ్ పదవులు అవసరమనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇదాటే కమిషన్ సుమారు 1,200 కమ్యూనిటీలను గుర్తించింది. ఇంకా 269 వర్గాలను వర్గీకరించాల్సి ఉందని పేర్కొంది. అలాగే తదుపరి జనాభా గణనలో డిఎన్టి-ఎన్టిలను ప్రత్యేకంగా లెక్కించాలని స్పష్టంగా సిఫార్సు చేసింది.
2027లో జరగబోయే జనాభా గణన ఈ వర్గాల భవిష్యత్తును మార్చగలిగే ఒక కీలక మలుపుగా నిలవాలి. ప్రభుత్వం కేవలం సాధారణ కులగణనతో సరిపెట్టకుండా, డిఎన్టి-ఎన్టిల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలి. అలా చేస్తే ఎక్కడ ఏ తెగలు ఉన్నాయో, వారి విద్యా స్థాయి, ఆర్థిక పరిస్థితి వంటి కీలక సమాచారం బయటపడుతుంది. జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేయడం సాధ్యమవుతుంది. అలాగే వారిని గుర్తించడం ద్వారా ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు వంటి ప్రాథమిక హక్కులు కల్పించి, సంచార జీవనం నుండి స్థిర జీవన విధానానికి మార్గం సుగమం చేయవచ్చు. అడ్రసు లేని మనిషికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది? స్థిర నివాసం లేని వాడికి ఓటు హక్కు ఎలా దక్కుతుంది? మన డిజిటల్ ఇండియాలో వీరు కేవలం ‘ఎర్రర్ కోడ్స్’గా మిగిలిపోకూడదు.
ఈ నేపథ్యంలో డిఎన్టి-ఎన్‌టి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2027 జనాభా గణనలో వీరికి ప్రత్యేక కాలమ్ ఉండాలని డిమాండ్ చేస్తోంది.కాబట్టి, ప్రభుత్వానికి కావలసినవన్నీ ఉన్నాయి-పాలసీ నిర్ణయం ఉంది, జాబితాలు సిద్ధంగా ఉన్నాయి, కమిషన్ల సిఫార్సులు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రశ్న: దీనిని అమలు చేయడానికి ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ఉందా? లేక ఆ సంకల్పం కలిగేలా మనం చేయ గలమా? ఒక నాగరిక సమాజంగా మనం కోట్లాది ప్రజలను చీకటిలో ఉంచి అభివృద్ధి గురించి మాట్లాడలేం. బ్రిటిష్ పాలకులు వేసిన నేరముద్రను పూర్తిగా తుడిచివే యాలంటే కేవలం చట్టం రద్దు చేయడం సరిపోదు, వారిని గౌరవప్రదమైన పౌరులుగా గుర్తించాలి. మన చుట్టూ ఉన్న ఈ ‘అదృశ్య భారతీయులను’ అంకెల్లోకి, అక్షరాల్లోకి తీసుకురావడం అత్యవసరం. జనాభా గణనలో వారిని లెక్కించడం ద్వారా మాత్రమే మనం వారికి నిజమైన న్యాయం కలుగుతుంది. అప్పుడే ఈ తెగలకు వందల ఏళ్ల వివక్ష నుంచి నిజమైన విముక్తి లభిస్తుంది.
భరత్ చౌహాన్ 9030666999



