Friday, April 3, 2026
E-PAPER
Homeజాతీయంరోజుకు 20 మందికి పైగా మృతి

రోజుకు 20 మందికి పైగా మృతి

- Advertisement -

గల్ఫ్‌దేశాల్లో భారత వలసకార్మికుల దుస్థితిపై పార్లమెంటు అధికారగణాంకాలు

న్యూఢిల్లీ : పొట్టచేతపట్టుకుని గల్ఫ్‌దేశాలకు వెళ్లే భారత వలసకార్మికుల బతుకులు దినదినగండం నూరేండ్ల ఆయుష్షులా మారుతున్నాయి. స్వదేశంలో ఉపాధి అవకాశాల్లేక.. సరైన వేతనాలూ దక్కక గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్న లక్షలాది మంది జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. పార్లమెంటులో సమర్పించిన అధికార గణాంకాల ప్రకారం.. గడిచిన ఐదేండ్లుగా సగటున రోజుకు 20 మందికిపైగా భారత కార్మికులు చనిపోతున్నారని ప్రభుత్వం పేర్కొన్నది. జనవరి 29న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌సింగ్‌ వెల్లడించిన సమాచారమిది. 2021 నుంచి 2025 మధ్యకాలంలో విదేశాల్లో మరణించిన భారతీయ కార్మికుల మొత్తం సంఖ్య 37,740గా నమోదైంది.

ఈ మరణాలకు గల కారణాల వివరాలను మాత్రం ఇందులో పొందుపరచలేదు. ఇప్పటికీ తెలంగాణ నుంచి నిజామాబాద్‌, హైదరాబాద్‌తో పాటు ఏపీ నుంచి కూడా భారీసంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్‌దేశాల బాట పడుతున్నారు. ఏండ్ల తరబడి అక్కడే ఉన్నా.. వారి ప్రాణాలకు భరోసా లేదన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికీ బతుకు దెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన తమ బంధువుల ఆచూకీ తెలియని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీసాల్లేక అక్కడే ఉన్నవారిని పోలీసులు కారాగారంలో ఉంచారా..? లేక ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా..? అన్న వివరాలు తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన పడుతున్న ఘటనలు కోకోల్లలు. ఎవరో కొందరు మాత్రం ఆయా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి.. రాయబార కార్యాలయాలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారికంగా వెల్లడించిన మృతుల జాబితా కంటే.. అనధికారికంగా భారత కార్మికుల సంఖ్య లక్షకుపైనే ఉంటుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -