Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం53 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర

53 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర

- Advertisement -

ప్రారంభమైన ఆర్టెమిస్‌ -2
విజయవంతమైతే నేరుగా చంద్రుడిపైకి
అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రక ఘట్టం

న్యూయార్క్‌ : అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. 53 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మానవుడు మళ్లీ చంద్రుడి వద్దకు పయనమయ్యాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రమండల యాత్ర ‘ఆర్టెమిస్‌-2’ దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజామున 4.06 నిమిషాలకు చారిత్రక ప్రయోగం మొదలైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపానికి వెళ్లి పరిశోధనలు చేయనున్నారు. నలుగురు వ్యోమగాముల బృందం చంద్రుని చుట్టూ పది రోజుల పాటు ప్రయాణించి, అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది.

ఈ మిషన్‌ విజయవంతమైతే, ‘ఆర్టెమిస్‌ -3’ ద్వారా నేరుగా చంద్రుడిపైకి
ఆర్టెమిస్‌-2 అనేది ఒక ప్రయోగం మాత్రమే కాదు. చంద్రునిపై శాశ్వత మానవ ఉనికిని ఏర్పాటు చేసే ‘ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌’లో అత్యంత కీలకమైనది. చంద్రుని ఉపరితలంపై మనుషులను దించడానికి ముందు చేసే కీలక పరీక్షలాంటింది. వాస్తవానికి ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 6:24 గంటలకు జరగాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నాసా సాంకేతిక బృందాలు సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించడంతో ప్రయోగం సజావుగా సాగింది.

ఈ పది రోజుల యాత్రలో వ్యోమగాములు కీలక పరిశోధనలను చేయనున్నారు. భూమి నుంచి సుమారు 4 లక్షల కిలోమీటర్ల అవతలికి వీరు వెళ్లే అవకాశం ఉంది. వ్యోమగాముల ప్రాణాలను రక్షించే లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ వ్యవస్థలు చంద్రుని వద్ద ఎలా పనిచేస్తాయో వీరు పరిశీలించనున్నారు. ఈ మిషన్‌ విజయవంతమైతే, ‘ఆర్టెమిస్‌ -3’ ద్వారా చంద్రునిపై మనుషులను నేరుగా దించే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. 1972లో అపోలో-17 తర్వాత, మళ్లీ ఇప్పుడు మానవ మేధస్సు చంద్రుడిని తాకేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌ పరిశోధనలు, ప్రయోగాలలకు ఇది కీలకం కానున్నది.

ఆ నలుగురి నేపథ్యం
ఈ మిషన్‌లో పాల్గొన్న నలుగురు వ్యోమగాముల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే వారెవరు, వారి నేపథ్యం వివరాలేంటో తెలుసుకుందాం.
రీడ్‌ వైజ్‌మాన్‌- మిషన్‌ కమాండర్‌: వైజ్‌మాన్‌ అమెరికా నౌకాదళంలో అధికారిగా పనిచేశారు. 2009లో నాసాలో చేరిన ఆయనకు అంతరిక్షంలో 165 రోజుల అనుభవం ఉంది. ఈ మిషన్‌ను ఆయనే ముందుండి నడిపిస్తున్నారు.
విక్టర్‌ గ్లోవర్‌- పైలట్‌: ఈ మిషన్‌లో ఓరియన్‌ నౌకను నడిపించే బాధ్యత గ్లోవర్దే. ఈయన చంద్రుని పైకి వెళ్తున్న తొలి శ్వేతజాతీయేతర వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. నౌకాదళంలో పైలట్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. ఆ అనుభవమే. బాధ్యతను ఆయనకు అప్పగించేలా చేసింది.

క్రిస్టినా కోచ్‌- మిషన్‌ స్పెషలిస్ట్‌: మహిళా వ్యోమగాముల్లో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు ఈమె పేరిట ఉంది. ఇప్పుడు చంద్రుని కక్ష్యకు చేరుకోనున్న తొలి మహిళగా కోచ్‌ రికార్డు సృష్టించబోతున్నారు. ఈ మిషన్‌ ద్వారా ఆమె కోట్లాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
జెరెమీ హాన్సెన్‌- మిషన్‌ స్పెషలిస్ట్‌: కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన హాన్సెన్‌, చంద్రుని పైకి వెళ్తున్న తొలి అమెరికాయేతర వ్యక్తి. ఫైటర్‌ పైలట్‌గా పనిచేసిన అనుభవం హాన్సెన్కు ఉంది. ఇది హాన్సెన్‌ మొదటి అంతరిక్ష ప్రయాణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -