రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆమనగల్లో సమీకృత భూభారతి పోర్టల్ ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
రైతులకు అన్ని విధాలా భద్రత కల్పించే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి స్థానంలో సమీకృత భూ భారతిని అమల్లోకి తెచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సమీకృత భూభారతి పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో 99 రోజుల కార్యాచరణతో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఉన్న ఆధార్ నంబర్ లాగా భూమి కలిగిన ప్రతి రైతుకూ సర్వేనెంబర్తో అనుసంధానం చేస్తూ భూధార్ నెంబర్ కేటాయిస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశామన్నారు. అందుకోసం 10,572 గ్రామాలకు వీఆర్ఏలను నియమించినట్టు తెలిపారు. సర్వే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రెండు దశల్లో దాదాపు 6వేల మంది లైసెన్సులు కలిగిన సర్వేయర్లను నియమించినట్టు చెప్పారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే అట్టి సర్వే నంబర్‌కు సంబంధించిన మ్యాప్‌తో కూడిన సరిహద్దులు ఉంటాయని తెలిపారు. అనంతరం పలువురు లబ్దిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ప్రారంభించారు.
మరో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని, అందులో 80 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, నియోజకవర్గానికి అదనంగా మరో 3500 ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. అదేవిధంగా ఆమనగల్లో ఆర్డీఓ, ఆర్టీఓ, రిజిస్ట్రేషన్, ఎస్టీఓ తదితర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సెక్రెటరీ లోకేష్‌కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారి సుశీంద ర్రావు, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీతనర్సింహ ముదిరాజ్, మున్సిపల్ చైర్మెన్ పత్యనాయక్, పీసీబీ సభ్యులు బాలాజీసింగ్, టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ ఫయ్యూమ్ ఖాద్రీ, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.



