రెండూ మూడు వారాల్లో భీకరదాడులు
లేదంటే ఇరాన్ నాశనమే
ఆ దేశాన్ని తిరిగి రాతియుగం నాటికి తీసుకెళ్తాం : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యాలు పూర్తి కావస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం అన్నారు. ఇరాన్ ఇప్పుడు ఆర్థికంగా, సైనికంగా నాశనమైందని చెప్పారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు వెళ్లే దేశాలు అక్కడికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకోవాలని కూడా తెలిపారు. ”వారు కొంత ఆలస్యమైనా ధైర్యం తెచ్చుకొని, దానిని స్వాధీనం చేసుకోవాలి. ఇరాన్ నాశనమైంది. కష్టమైన పని పూర్తయింది కాబట్టి.. స్వాధీనం చేసుకునే పని సులభంగా ఉండాలి” అని ఆయన అన్నారు. గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి శ్వేతసౌధం నుంచి ట్రంప్ ఈ ప్రసంగం చేశారు. పద్దెనిమిది నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రసంగంలో ఇరాన్‌తో యుద్ధం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్ : ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలనీ, లేకపోతే రెండు మూడు వారాల్లో ఇరాన్‌ను రాతియుగానికి పంపేంత తీవ్రంగా అమెరికా దెబ్బతీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒక దానిని నాశనం చేయడానికి అమెరికాకు 32 రోజులు పట్టిందని ఆయన చెప్పారు. ”మా లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు దాడులను మేము కొనసాగిస్తాం. త్వరలో, అతి త్వరలో అమెరికా లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసే దారిలో ఉందని నేను చెప్పగలను” అని ట్రంప్ అన్నారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందని చెప్పారు. ఆ దేశంలో కీలక నాయకత్వాన్ని తొలగించామని అన్నారు. యుద్ధం లో మరణించిన 13 మంది అమెరికా సైనికుల కుటుంబాలు ‘పనిని పూర్తి చేయాలని’ తనను వేడుకున్నాయని కూడా ఆయన తెలిపారు. అమెరికా ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ నాలుగు వారాలలో తమ సాయుధ దళాలు యుద్ధరంగంలో వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, అఖండమైన విజయాలు సాధించాయని చెప్పుకొచ్చారు.
ఈ రాత్రికి ఇరాన్ నౌకాదళం అంతమైందనీ, వారి వైమానిక దళం నాశనమైందని తెలిపారు. వారిలో చాలా మంది ఉగ్రవాదులు, వారు నడిపిన ప్రభుత్వం ఇప్పుడు అంతమ య్యాయని ఆయన అన్నారు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలను ధ్వంసం చేయడానికి తాను ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’కు ఆదేశించినట్టు ట్రంప్ చెప్పారు. ఇరాన్ రక్షణ సామర్థ్యాలను ఒక క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నామనీ, వారి నౌకాదళం అంతమైపోయిందని ట్రంప్ తెలిపారు. అనేక ఏండ్లు గా అమెరికా నాశనాన్ని కోరుకున్న ఇరాన్ లెక్కలేనన్ని దారుణ చర్యలకు పాల్పడిందనీ, ఆ హంతకపాలన తన సొంత ప్రజలలో 45వేల మందిని చంపిందని అన్నారు. ఈ పరిస్థితి 45 ఏండ్లుగా కొనసాగిందనీ, దీనిని తన పూర్వ అధ్యక్షుడు ఆపి ఉండాల్సిందని ఆయన తెలిపారు. వారి గౌరవ వందనం పొందడానికి ఒబామా ఇరాన్‌కు అణుబాంబు అభివృద్ధి కోసం 1.5 బిలియన్ డాలర్ల నగదు ఇచ్చారని ఆరోపించారు. ”మనం చమురు ఉత్పత్తి కోసం వెనిజులాతో కలిసి పని చేస్తున్నాం. మధ్యప్రాచ్యం నుంచి పూర్తిగా స్వతంత్రంగా ఉన్నాం. మాకు వారి చమురు అవసరం లేదు. స్వల్పకాలిక చమురు ధరల పెరుగుదల ఇరాన్ దిగ్బంధనం ఫలితమేనని, దానికి యుద్ధంతో ఎలాంటి సంబంధమూ లేదని ట్రంప్ తెలిపారు.



