అది ఓ ఉద్యమంలా సాగాలి
సేవకులుగానే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలపాలన్నదే సంకల్పం
మీ సంపూర్ణ సహకారం కావాలి : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సందేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళిక సాధారణ కార్యక్రమం కాదు… ఒక దీక్ష అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అది ఒక ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. పాలకులుగా కాకుండా సేవకులుగానే తాము ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు. అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రజలకు సందేశం పంపారు. దాన్ని గ్రామ సభల్లో అధికారులు చదివి వినిపించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశంలో ఇలా…. ‘ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేండ్ల మూడునెలలైంది. ఎన్నో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ…గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ… సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోంది. మేం పాలకులం కాదు…సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం.
ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు…ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరూ వాడా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి.
మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. ‘తెలంగాణ రైజింగ్- 2047′ విజన్‌తో ఆర్థికంగానే కాక, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై, దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారం కావాలి’ అని ప్రజలను కోరారు.



