Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్లోరిడా వర్సిటీ బృందంతో మంత్రి తుమ్మల భేటీ

ఫ్లోరిడా వర్సిటీ బృందంతో మంత్రి తుమ్మల భేటీ

- Advertisement -

డిజిటల్‌, సుస్థిర వ్యవసాయంపై సంయుక్త భాగస్వామ్య ప్రతిపాదన
ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలపై చర్చ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఫ్లోరిడా యూనివర్సిటీ సహజ వనరులు, పర్యావరణ పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యింది. కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం( ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ)తో కలిసి పరిశోధన, విస్తరణ, విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ఫ్లోరిడా వర్సిటీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూతో కలిసి తెలంగాణ డిజిటల్‌, సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం స్థాపనపై కూడా చర్చించారు. ఈ భాగస్వామ్యం ద్వారా డిజిటల్‌, సుస్థిర వ్యవసాయం, ఏఐ ఆధారిత వ్యవస్థలు, రిమోట్‌ సెన్సింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటల అభివృద్ధి, నేల ఆరోగ్య సంరక్షణ, నీటి వినియోగ సమర్థత పెంపు వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తెలంగాణలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ పంటల సాగు, అలాగే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్‌ టెక్నాలజీలు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులకు అధిక ఆదాయం అందించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, రైతులకు మార్కెట్‌ అవకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయాలని ఫ్లోరిడా వర్సిటీ ప్రతినిధులు సూచిం చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయం పెంచడం దిశగా ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ భేటీలో ఏఎన్‌జీఆర్‌యూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘువర్ధన్‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -