విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ రద్దు దుర్మార్గం
కార్మికులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేవంత్ రెడ్డి సర్కార్ చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న విద్యా శాఖ ఆధ్వర్యంలోని యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్లపై ఆధారపడిన చేనేతల పొట్టకొట్టే దుర్మార్గం చేస్తున్నారని విమర్శించారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.105 కోట్ల విలువైన యూనిఫాంల ఆర్డర్‌ను రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలకు ఇస్తుంటారనీ, దీని ద్వారా సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఏకపక్షంగా విద్యాశాఖ యూనిఫాంల ఆర్డర్ రద్దు చేయటంతో కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర శాఖలకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి సంబంధించిన ఆర్డర్ ను కూడా టెస్కోకు ఇప్పటికీ ఇవ్వకపోవడం కార్మికు లను సంక్షోభంలోకి నెట్టివేయడమేనని విమర్శించారు. గడువు ముగిసినప్పటికీ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన ప్రయివేటు వ్యక్తులకు ఈ ఆర్డర్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కవిత హెచ్చరించారు.
కార్యక్రమాలపై దిశా నిర్దేశం
ఈ నెల 25న మునీరాబాద్‌లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభపై తెలంగాణ జాగృతి నాయకులతో గురువారం హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత సమావేశమయ్యారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చే నాయకులు, కార్యకర్తలు, వారికి అవసరమైన వసతులు, పార్టీ ఆవిర్భావ సభకు ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.



