పినరయి విజయన్‌కు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడ అధికారంలోకి వచ్చాక చేపట్టిన పనులు చెప్పుకోలేక.. అక్కడి సీఎం పినరయి విజయన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ అన్నారు. పినరయి విజయన్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో తానేదైనా మంచి పని చేసి ఉంటే వాటిని చెప్పుకోవటంతోపాటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే పనిని చెప్తే బాగుంటుందని హితవు పలికారు.
కమ్యూనిస్టులు, కమ్యూనలిస్టులు (మతోన్మాదులు) ఒకటే అనే పద్ధతుల్లో మాట్లాడటం అంటే ‘మోకాలికి బోడి.. గుండుకు ముడి” పెట్టడమే అవుతుందని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో జరిగిందని, విద్యా వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారని తెలిపారు. అత్యంత పేదరికం లేని రాష్ట్రంగా కేరళను చేసి చూపించిన ఘనత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఐదు లక్షలకు పైగా పేదలకు అందమైన ఇండ్లను నిర్మించి ఇచ్చారని, లౌకిక భావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మత ఘర్షణలు లేకుండా రాష్ట్రాన్ని ఉంచారని అన్నారు. అటువంటి కేరళ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపైన తెలంగాణ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని, తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వై.గంగాధర్, సుజాత, జె.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



