Saturday, April 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఒంటరి ట్రంప్‌!

ఒంటరి ట్రంప్‌!

- Advertisement -

డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ అనే పండుగాడి దెబ్బతగిలింది. మైండ్‌ బ్లాక్‌ లేదా బ్లాంక్‌ (పనిచేయటం మానింది లేదా ఖాళీ) అయినట్లు కనిపిస్తోంది. బుధవారం నాడు అతగాడి మాటలను చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది, కనిపిస్తుంది. దాడులను ఎప్పుడు నిలిపివేస్తారో, అసలు ఇరాన్‌తో ఏ అంశాలపై ఒప్పందాన్ని అమెరికా కోరుకుంటున్నదో బుర్రవున్న వారికెవరికీ అర్ధం కావటం లేదు. పొంతన లేని మాటలు. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని ధ్వంసం చేస్తా అన్నాడు, ఇప్పుడు అది శుద్ధి చేసిన యురేనియంతో తనకు పనిలేదంటాడు. ఒప్పందం కుదిరినా లేకున్నా దాడులు నిలిపివేస్తానంటాడు. కీలక లక్ష్యాల సాధనకు దగ్గరలో ఉన్నామని చెబుతాడు, పూర్తి చేశామంటాడు, అయినా ఇంకా రెండు మూడు వారాలు దాడులు కొనసాగుతాయని మాట్లాడటాన్ని చూస్తే బుర్ర ఖరాబైందన్నది స్పష్టం.

నాటో దేశాల మీద విరుచుకుపడిన ట్రంప్‌ అవి ఏకం కావటానికి పుణ్యం కట్టుకున్నాడు. అమెరికాతో పని లేకుండానే హార్ముజ్‌ జలసంధి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నాటోలోని 35 దేశాలు నడుంకట్టాయి. ఆ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే తమను కాగితపు పులి, తాను లేకపోతే నాటో లేదన్న ట్రంప్‌ ఆపహాస్యపు మాటలతో ఇప్పటి వరకు మొద్దు బారిన నాటో చర్మం స్పందిస్తున్నట్లు కనిపిస్తున్నది. తన పౌరులను ఉద్దేశించి బుధవారం నాడు చేసిన ప్రసంగంలో కొత్త విషయాలేమీ లేవు. రెండు మూడువారాల్లో ఇరాన్‌పోరు ముగుస్తుంది. కీలక లక్ష్యాల సాధన ముగింపు దశలో అమెరికా మిలిటరీ ఉంది.భవిష్యత్‌లో హార్ముజ్‌ జలసంధి ద్వారా చమురు దిగుమతులు చేసుకోము.శాంతి ఒప్పందానికి ఇరాన్‌ ముందుకు రాకపోతే దాని విద్యుత్‌ కేంద్రాలను నాశనం చేస్తాం.రాతియుగం కాలం నాటికి ఇరాన్‌ను వెనక్కు నెడతాం. ఇవీ ట్రంప్‌ ప్రసంగ ముఖ్యాంశాలు.

అనేక ప్రశ్నలు, సందేహాలకు ఎలాంటి సమాధానం లేదు.ఇతరుల కోసమే తాము దాడులు చేస్తున్నట్లు గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు తమకు చమురు అవసరం లేదని ఎవరికి కావాలంటే వారు చూసుకోవాల్సిందే అని తేల్చి చెప్పాడు. బడాయి, పోసుకోలు కబుర్లుగాకపోతే దాడులు చేయాలని అసలు ట్రంప్‌ను ఏ దేశం కోరింది? ఒప్పందానికి టెహరాన్‌ తహతహ లాడుతోందన్న ట్రంప్‌ మాటలను ఇరాన్‌ అపహాస్యం చేసింది.దాని మిలిటరీ శక్తిని నాశనం చేశామని చెప్పిన ట్రంప్‌ ప్రసంగం ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున ఇజ్రాయిల్‌, గల్ఫ్‌లో అనేక కేంద్రాలపై క్షిపణుల ప్రయోగం జరిగింది.ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చే ఎత్తుగడలలో భాగంగా తాము అమెరికా, ఐరోపా, ఇరుగు పొరుగుదేశాల పౌరులకు వ్యతిరేకం కాదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూదు పెజెషకియాన్‌ ప్రకటించాడు.

అదిరింపులు బెదిరింపులతో ఇరాన్‌ను దారికి తెచ్చుకోలేమన్న ఇంగిత జ్ఞానం నెలరోజుల దాడుల తరువాత కూడా ట్రంప్‌కు కలగలేదు. ‘మన దేశానికి ముప్పు తప్పించేందుకు అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన ఇరాన్‌ మీద 32 రోజులుగా దాడులు చేస్తున్నామని, ఇంకా కొనసాగినా భరించాల్సిందే’ అన్నట్లు తన 19 నిమిషాల ప్రసంగంలో ట్రంప్‌ చెప్పాడు. ఇంథన ధరల పెరుగుదలతో సాధారణ పౌరుల నుంచి తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో దీనికి కారణం ఇరానే అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అసలు దాడులను ప్రారంభించింది తానే అన్న చిన్న విషయం కూడా తెలియనంత అమాయకంగా అక్కడి పౌరులున్నారా? ట్రంప్‌ ఉపన్యాసం అమెరికన్లకు ఇబ్బందికరంగా, అసంగతంగా, ఆందోళనకు గురిచేసేదిగా ఉందని, తమ విజయం గురించి చేసిన ప్రసంగంలా ఉందని ఇరాన్‌ చూస్తున్నదనే వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ట్రంప్‌ చర్యలు మన ప్రధాని నరేంద్రమోడీకి ఇంకా జ్ఞానోదయం కలిగించినట్లు లేదు.కానీ, గతంలో అనేక దుర్మార్గాల్లో భాగస్వాములైన నాటో దేశాలకు కనువిప్పు కలిగించినట్లు చెప్పవచ్చు. తోడు దొంగల మధ్య పంపకాల్లో తేడాలు వచ్చినపుడు కీచులాడుకుంటారు, తిరిగ ఒక్కటౌతారు, అలాగే నాటో దేశాల వైఖరిని కూడా చెప్పలేం గానీ ఇరాన్‌ విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా ఉన్నాయి. నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించాడు, అదే జరిగితే ఏం చేయాలనే మల్లగుల్లాలు ఆ కూటమిలో మొదలయ్యాయి. మన ఖర్చు మనమే పెట్టుకుంటున్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది కూడా ఆ దేశాల్లో ఉన్నది. అమెరికాతో తెగతెంపులు చేసుకోవటం ఐరోపాకు అంత తేలిక కాదు. ఒక వేళ నాటో విచ్చిన్నమైతే తమ భద్రత గురించి కొన్ని దేశాలు ఇప్పటికే ఆలోచిస్తున్నాయని వార్తలు. అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలాన్ని వినియోగించుకొనేందుకు వీల్లేదని కొన్ని నాటో దేశాలు స్పష్టం చేశాయి. తమ మౌలిక ప్రయోజనాలకే ముప్పు వస్తుందనుకుంటే అమెరికన్‌ సామ్రాజ్యవాదులు రంగంలోకి దిగి అవసరమైతే ట్రంప్‌ను ఇంటికి సాగనంపినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అతన్ని నమ్ముకున్న నరేంద్రమోడీ వంటివారి సంగతేమిటి? రాముడేం చేస్తాడో మరి!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -