Saturday, April 4, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చూపులేకున్నా కొత్త శిఖరాలకు....

చూపులేకున్నా కొత్త శిఖరాలకు….

- Advertisement -

తన ముందు విస్తరించి ఉన్న ట్రాక్‌ ముగింపు రేఖ, తనను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులు ఆమెకు కనిపించరు. అయినా గుండె వేగంగా కొట్టుకుంటుండగా.. ఆమె తన సర్వశక్తితో పరుగెత్తుతారు. కేవలం గెలవాలనే కాదు, తనను తాను ఎంత దూరం నెట్టుకోగలనో చూడాలనే ప్రగాఢమైన సంకల్పం ఆమెలో ఉంది. ఆమే అథ్లెట్‌ కోమల్‌ త్యాగి. కంటి చూపు లేకపోయినా కొత్త శిఖరాలు అధిరోహించింది. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి.. ఇలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించి నేడు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…

పుట్టుకతోనే దృష్టి లోపంతో జన్మించిన కోమల్‌ మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పెరిగింది. ‘నా ఇద్దరు అంధ తోబుట్టువులతో పాటు, నేను కూడా అందరిలాగే సాధారణ పాఠశాలకు వెళ్ళాను. కానీ నేను అందరితో పాటు చదువుకోలేకపోవడంతో పాఠశాలలో సమస్యలు తలెత్తాయి. మా కుటుంబ సభ్యులు అంతగా చదువుకోకపోవడంతో, మమ్మల్ని అంధుల పాఠశాలలో చేర్పించడం గురించి ఆలోచించలేదు’ అని ఆమె గుర్తుచేసుకుంది. గ్వాలియర్‌లో అంధుల కోసం ఒక పాఠశాల ఉందని ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఆలోచించారు. తమ ఇద్దరు చిన్న పిల్లలను ఆ పాఠశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు.

తన కోసం తాను
కోమల్‌ పెద్దది కావడంతో ఆమెను ఆ పాఠశాలకు పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఆలోచించారు. అయితే ఆమె తన కోసం తాను వాదించుకుంది. చివరికి 2015లో తన చెల్లితో పాటు ఆ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేరింది. అప్పుడు ఆమె వయసు 14 ఏండ్లు. అప్పటి వరకు ఆమె ఎప్పుడూ ఇంటికి దూరంగా నివసించలేదు. ‘అక్కడ చాలా బాగుండేది. అందరూ మాలాంటి వాళ్ళే. ప్రతీదీ మా కోసమే ఏర్పాటు చేశారు. నేను ఎవరికన్నా తక్కువ అని నాకు అనిపించలేదు’ అని ఆమె అంటుంది.

పట్టుదలకు ఫలితం ఉంటుంది
అప్పటి వరకు ఆటలు ఆడాలనే ఆలోచనే కోమల్‌కు లేదు. కానీ ఆ కొత్త పాఠశాల డైరెక్టర్‌ ఆమె దృఢమైన శారీరాన్ని గమనించి క్రీడలను చేపట్టమని ప్రోత్సహించారు. డిసెంబర్‌ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక చిన్న కార్యక్రమంలో ఆమె షాట్‌పుట్‌ పోటీలో అడుగుపెట్టి. తన మొదటి ప్రయత్నంలోనే పతకం గెలుచుకుంది. ఆ ఉత్సాహంతో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అది త్వరలోనే ఆమెను ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీకి చేర్చింది. ఫలితం కంటే అనుభవంపై దృష్టి పెట్టమని ఆమె ఉపాధ్యాయులు సలహా ఇచ్చారు. కానీ కోమల్‌ షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో రెండింటిలోనూ స్వర్ణం గెలుచుకుంది. దాంతో మధ్యప్రదేశ్‌ నుండి జాతీయ ఐబీఎస్‌ఏ (అంతర్జాతీయ అంధుల క్రీడా సమాఖ్య) పతకాన్ని సాధించిన మొదటి దృష్టి లోపం ఉన్న మహిళా అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది.

కరోనా రావడంతో…
‘నేను పతకాలు గెలిచినప్పుడు, మీడియాలో నా గురించే వార్తలు వచ్చాయి. నా కుటుంబం కూడా ఇది చూసింది. భవిష్యత్తులో నేను ఇంకా రాణించగలననే నమ్మకం వచ్చింది’ అని ఆమె అంటుంది. ఆమె శిక్షణ కొనసాగించింది. కానీ పన్నెండవ తరగతి తర్వాత కరోనా రావడంతో ఆమె గ్వాలియర్‌ నుండి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. చివరికి ఇంట్లో వాళ్లు ఆమె పెండ్లి గురించి ఆలోచించారు. కానీ కోమల్‌ ఇంకా చదువుకోవాలని నిశ్చయించుకుంది. ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్‌లో చేరింది. ఒక ఏడాది ఆన్‌లైన్‌ తరగతుల తర్వాత ఆమె క్యాంపస్‌కు వెళ్లింది.

ఆర్థిక భారంతో…
కొత్త వాతావరణం, తన సీనియర్ల నుండి లభించిన మద్దతు ఆమె తిరిగి క్రీడలలోకి రావడానికి సహాయపడ్డాయి. ఆమె జాతీయ స్థాయి ఈవెంట్లలో పోటీపడటం ప్రారంభించి, జాతీయ పారాఅథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లు, ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో అనేక పతకాలను గెలుచుకుంది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పెండ్లి చేసుకోవాలని లేదు. ఈ సమయానికి, నా లాంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయని నాకు తెలుసు’ అని ఆమె అంటుంది. కానీ అథ్లెటిక్స్‌ను వృత్తిపరంగా కొనసాగించడానికి అధిక ఖర్చు అవుతుందని కూడా ఆమెకు తెలుసు. ఢిల్లీలో జీవించడం ఖరీదైనది. దీనికి తోడు శిక్షణ ఖర్చులు కూడా తోడయ్యాయి. దాంతో ఆమె వికలాంగుల క్రీడల కోసం ఉన్న కేంద్రంలో శిక్షణ పొందడానికి గ్వాలియర్‌కు మారింది.

క్రీడను వదిలేయాలనుకున్నప్పుడు
2024 నాటికి కోమల్‌ పూర్తిగా క్రీడను వదిలివేయడానికి సిద్ధపడింది. శిక్షణా కేంద్రం మైదానం, కోచ్‌, వసతి కల్పించినప్పటికీ ఇతర ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రత్యేకమైన రన్నింగ్‌ స్పైక్స్‌, అధిక ప్రోటీన్‌ ఉన్న పోషకాహారం, ప్రయాణ ఖర్చులు అవసరమయ్యాయి. చూపులేని అథ్లెట్ల కోసం ఉద్దేశించిన టి11 విభాగంలో పోటీ చేసేందుకు ఆమెకు ఒక గైడ్‌ రన్నర్‌ కూడా అవసరమైంది. ఇవన్నీ భరించలేక 2024లో ఆమె దాదాపుగా క్రీడను వదిలేయడానికి సిద్ధమయింది. అప్పుడే వికలాంగుల కోసం పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ సీఎంబీ ఇండియా ట్రస్ట్‌ నుండి సహాయం అందింది. వారు ఆమెను తమ పారా అథ్లెట్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ కోసం ఎంపిక చేశారు. ఆ సంస్థ ఆమె పోషకాహారం, పరికరాల నుండి కోచింగ్‌, ప్రయాణం, పోటీ ఫీజుల వరకు అన్ని ఖర్చులను భరిస్తుంది. ‘నేను ఆశ కోల్పోయిన క్షణంలో సీఎంబీ ఇండియా నాకు అండగా నిలిచింది’ అని ఆమె అంటుంది.

క్రీడలకు ఆ శక్తి ఉంది
సీఎంబీ ఇండియా ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోనీ థామస్‌ మాట్లాడుతూ.. ‘అన్ని మూస పద్ధతులను ఛేదించి, మరింత సమ్మిళిత సమాజం కోసం గట్టిగా గళం విప్పే ఒక ప్రత్యేకమైన శక్తి క్రీడలకు ఉంది. కానీ ప్రతిభకు ముందుకు రావడానికి మనం అవకాశం ఇవ్వాలి. మా పారా అథ్లెట్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ చేయడానికే ఉంది. అథ్లెట్ల అవసరాలను బట్టి, కోచింగ్‌, పోషణ నుండి పరికరాలు, పోటీ ఫీజుల వరకు అయ్యే ఖర్చులన్నింటినీ మేమే భరిస్తాం. తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏ క్రీడాకారిణి సామర్థ్యానికి అడ్డుగా నిలవవు. బయట ఇంకా ఎంతో మంది కోమల్‌లు ఎదురుచూస్తున్నారు. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’ అని ఆమె అన్నారు.

ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంది
ఆమె గ్రామంలో ప్రజలు ఇప్పటికీ ఆమెకు ఎప్పుడు పెళ్లి అని అడుగుతూ ఉంటారు. పారా-అథ్లెటిక్స్‌ గురించి గానీ, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి గానీ వారికి అవగాహన లేదని ఆమెకు తెలుసు. ‘ఆ అమ్మాయి పెద్దదైంది, ఇంకా పెళ్లి కాలేదని మాత్రమే వాళ్ళు చూస్తారు’ అని ఆమె అంటుంది. కోమల్‌ బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. ఆమె ఇంకా ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంది. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్‌లో పోటీ పడాలనుకుంటోంది. ‘ప్రతి క్రీడాకారిణి భారతదేశం తరపున ఆడాలని కలలు కంటుంది. నాకూ అదే కల ఉంది’ అని అంటూ ఆమె తన మాటలు ముగించింది.

ముందుకు సాగుతూనే ఉండాలి
ఇటీవల జరిగిన ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో కోమల్‌ 100, 200 మీటర్ల స్ప్రింట్‌ ఈవెంట్లకు మారింది. ‘నా శరీర బరువు, ఎత్తు డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌కు సరిపోవని చాలా మంది కోచ్‌లు చెప్పారు. నేను స్ప్రింట్‌ కోసం శిక్షణ తీసుకుని, పోటీపడి గెలిచాను. కొన్నిసార్లు నేను ఇలా అనుకుంటాను: బహుశా ఇది నాకు సరిపోదేమో. బహుశా ఏదో సరిగ్గా జరగడం లేదేమో..” ఆమె కొనసాగించే ముందు ఒక్క క్షణం ఆగి.. ‘అప్పుడు నేను నా కోచ్‌తో మాట్లాడతాను. లేదా నాకంటే ఎక్కువగా కష్టపడిన వారి గురించి వింటాను. అప్పుడు నాకు గుర్తుకొస్తుంది: కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. నేను పతకం కోసమే ఆడాలని ఎప్పుడూ అనుకోను’ అని ఆమె అంటుంది.

– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -