భారతదేశంలో కులం అనేది ఇప్పటికీ సజీవంగా ఉన్న ఓ సమస్య. అయితే కుల వ్యవస్థ కేవలం ఒక సామాజిక సమస్య మాత్రమే కాదు. అది ఆర్థిక, రాజకీయ అసమానతలకు కూడా మూలం. కుల రహిత సమాజం కోసం సామాజిక చైతన్యం అవసరం. అటువంటి చైతన్యాన్ని ప్రజల్లో నింపేందుకే సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నడుంబిగించాయి. పూలే జయంతి ఏప్రిల్ 11 నుండి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు విస్తృతమైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కుల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమమయ్యాయి. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ కుల సమస్యపై దేశంలో జరిగిన పోరాటాల గురించి, వారు చేయబోయే అవగాహన కార్యక్రమాల గురించి సోపతితో పంచుకున్నారు.
భారతదేశంలో వర్ణం ఎప్పటి నుండి ప్రారంభమయిందో అప్పటి నుండే ఆ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలయ్యాయి. కులం ఎప్పుడైతే మొదలయిందో అప్పటి నుండే కుల నిర్మూలన కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఎంత మంది పోరాడుతున్నప్పటికీ వర్ణం, కులం అనేవి నేటికీ సమాజంలో బలీయంగానే ఉన్నాయి. నేడు శూద్రులు కూడా రకరకాలుగా విభజించబడి పోయారు. వాస్తవానికి శూద్రులు అంటే అందరికీ ఒకే గుర్తింపు ఉండాలి. కానీ క్రమక్రమంగా ఇది పోయి భూమి ఉన్న వారికి ఒక గుర్తింపు, భూమి లేని వారికి ఒక గుర్తింపు, వస్తువులు ఉత్పత్తి చేసే వారికి ఒక గుర్తింపు, సేవలు చేసే వారికి మరో రకం గుర్తింపు… ఇలా రకరకాల విభజనలు వచ్చాయి.
అణగారిన వర్గాలు
శూద్రుల నుంచే అతి శూద్రులు(దళితులు) అనే వారు పుట్టుకొచ్చారని పూలే ఆనాడు అన్నారు. అంటే ఒకప్పుడు దళితులు అనే వారు లేరు. అందరూ శూద్రులుగానే ఉండేవారు. తర్వాత కాలంలోనే అతి శూద్రులు దళితులుగా పిలవబడుతున్నారు. అయితే అంబేద్కర్ అతి శూద్రులు అనే పదం వాడలేదు. ఆయన ‘అణగారిన వర్గాలు’ అని పిలిచారు. కేవలం ఓ ముప్పై నలభై ఏండ్ల నుండి మాత్రమే దళితులు అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. అప్పటి నుండి దళితులపై తీవ్రమైన వివక్ష కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినటువంటి ప్రాంతాల్లో, అభ్యుదయంగా ఆలోచించే ప్రాంతాలలో మాత్రం వివక్ష కొంత వరకు తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకప్పటిలా నేడు రెండు గ్లాసుల పద్దతి తగ్గిపోయింది. ప్లాస్టిక్ గ్లాసులు రావడం వల్ల కొంత వరకు ఈ వివక్ష కనిపించడం లేదు. అయితే కొన్ని గ్రామల్లో అయితే ఈ పద్దతి కొనసాగుతూనే ఉంది. కానీ దళితులు గుడుల్లోకి వెళితే ఇప్పటికీ అభ్యంతరం చెబుతున్నారు.
పెరుగుతున్న కులదురహంకార హత్యలు
ఇక వివాహాల విషయంలో అయితే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఒకవైపు కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఇంకో వైపున ఆంక్షలు, పట్టుదలలు కూడా పెరుగుతున్నాయి. సమాజంలో వస్తున్న కొన్ని మార్పులు, విద్య అందడం వల్ల ఉద్యోగాల కోసం అన్ని కులాల వారు చదువుకొని ఒక దగ్గరకు చేరుతున్నారు. ఆ పరిచయాలు ప్రేమగా మారి కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇలా కులాంతర వివాహాలు చేసుకునే వాతావరణం కూడా నేడు కొంత వరకు పెరిగింది. అయితే అదే స్థాయిలో వ్యతిరేకతలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో కాఫ్ పంచాయితీలు ఘోరంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో మీడియా ఎక్కువగా రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ వార్తలు పెద్దగా బయటకు రావడం లేదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కులదురహంకార హత్యలు జరుగుతున్నాయి. ఈ పదేండ్ల కాలంలోనే సుమారు వంద మందిపై ఇలాంటి దాడులు జరిగాయి. కులాంతర వివాహాలపై ఆంక్షలు పెడుతున్నారు.

ఏకం చేసిన మహద్ చెరువు
భారత దేశంలో కుల నిర్మూల కోసం జరిగిన పోరాటాల్లో ‘మహద్ చెరువు’ పోరాటానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో కీలకమైన పోరాటంగా దీని గురించి చెప్పుకోవచ్చు. ఈ పోరాటం సందర్భంగానే అంబేద్కర్‌ను ఈ ప్రపంచం గుర్తించింది. అంతకు ముందే ఆయన అనేక పత్రికలు నడిపారు. కానీ పెద్ద పత్రికల వాళ్లు ఆయన వార్తలను తిరస్కరించేవారు. చివరకు ఆయన నడిపిన పత్రిక అడ్వటేజ్మెంట్ కూడా వేసుకోలేదు. అలాంటి వారిలో బాలగంగాధర్ తిలక్ కూడా ఉన్నారు. అంటే దళితుల పట్ల ఎంతటి తీవ్రమైన వివక్ష ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లోనే మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం పోరాటం చేశారు. ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించిన మరో వ్యక్తి రామచంద్ర బాబాజీ మోరే. ఆయన తర్వాత కాలంలో బోంబే సీపీఐ(ఎం) పార్టీలో పని చేశారు.
పోరాట ఫలితం…
మహద్ చెరువు ఉద్యమానికి ముందే దళితులకు ప్రభుత్వ వనరులను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని ఓ తీర్మానం ప్రవేశపెడితే అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించింది. అది కేవలం బోంబేలో మాత్రమే జరిగింది. ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత దీని ఆధారంగా మహద్ చెరువు కూడా ప్రభుత్వానిదే కాబట్టి అందులోని నీరు తాగే హక్కు మనకు ఉందని మోరే పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటానికి ఎవర్ని పిలవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అంబేద్కర్‌ని పిలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చింది. అప్పటికే ఆయన బారిస్టర్ చదువుతూ విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చి మహద్ చెరువు ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికే అది ప్రభుత్వ చెరువు అని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ నీళ్లు మాత్రం తాగనిచ్చేవారు కాదు. పోరాటం చేసిన తర్వాత విజయం సాధించారు.
పోరాట ప్రత్యేకత
మహద్ చెరువు పోరాట సమయంలోనే అంబేదర్కర్ మనుస్మృతిని తగలబెడదాం అనే పిలుపు ఇచ్చారు. దాన్ని తగలబెట్టింది కూడా ఓ బ్రహ్మణుడే. చాలా మంది ఈ పోరాటంలో కేవలం మహర్లు మాత్రమే పాల్గొన్నారు అనుకుంటారు. కానీ ఈ ‘మహద్ చెరువు’ పోరాటంలో అంబేద్కర్ మహారాష్ట్రలోని అన్ని తరగతుల వారిని కలుపుకు వెళ్లారు. అభ్యుదయ భావాలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఇందులో పాల్గొన్నారు. అది ఈ పోరాట ప్రత్యేకత. అలా ఈ పోరాటంలో అందరినీ ఏకం చేశారు. కానీ ఇదంతా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కనుక కుల నిర్మూల కోసం పోరాటం కేవలం దళితులు మాత్రమే చేస్తే సరిపోదు. కుల రహిత సమాజం కోసం అభ్యుదయ వాదులందరూ కలిసి పోరాడాలని ‘మహద్ చెరువు’ పోరాట సమయంలోనే అంబేద్కర్ తెలియజేశారు. నేటి తరం దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది.
కుల సమస్యకు ప్రతిఘటనగా…
మహారాష్ట్రలో ఆనాడు కుల సమస్యపై అనేక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా మహర్లు నివసించే ప్రాంతంలో అప్పట్లో సంత జరిగేది. దళితులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సంతకు వచ్చేవారు. కానీ అక్కడ దళితులకు తాగడానికి మంచినీళ్లు దొరికేవి కావు. ఎవరూ ఇచ్చే వాళ్లు కాదు. ఎవరిని అడిగినా తరిమేసేవారు. చెరువులోకి దిగి తాగడానికి వీల్లేదు. దాంతో మోరే ఏం చేశాడంటే ఒక దళితుడితో హౌటల్ పెట్టించాడు. పైసాకి ఒక చారు, ఒక గ్లాసు నీళ్లు ఇచ్చే వాళ్లు. అంటరారాని తనానికి ఓ ప్రతిఘటనగా ఆయన ఆ హౌటల్ పెట్టాడు. అయితే అదే తర్వాత కాలంలో ఓ టర్నింగ్ పాయింట్‌గా మారింది. చుట్టుపక్కల వుండే దళితులందరూ అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునే వారు. వాటిపై పోరాటాలు చేసే ఓ కేంద్రంగా అది రూపాంతరం చెందింది. ఇలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే కేంద్రంగా మారింది. అప్పటి వరకు చరిత్రలో ఇలాంటిది జరగలేదు.
దళితుడితో టీ కొట్టు
సాహు మహరాజ్ కూడా అప్పట్లో పూలే, అంబేద్కర్ ఉద్యమాలకు ఎంతో సహకారం చేసేవారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం చేసేవారు. ఆయన తన దగ్గరకు ఎవరైనా వస్తే కాదనకుండా సాయం చేసేవాడు. అలా ఒక దళితుడు ఆయన దగ్గరకు వచ్చి ‘ఇల్లు గడవడం లేదు’ అంటే పలాన సెంటర్‌కి వెళ్లి టీ కొట్టు పెట్టు అని కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఆయన భయపడి ‘నేను టీ కొట్టు పెడితే ఎవరు తాగుతారు’ అంటే ‘నువ్వు పెట్టు, దాన్ని నడిపే మార్గం నేను చెప్తా’ అంటాడు. సాయం కోసం ఆయన్ని ఎవరైనా కలవడానికి వస్తే ఆ టీ కొట్టు దగ్గరకు రమ్మని పిలిచేవాడు. అక్కడికి వచ్చిన వాళ్లకు టీ ఆర్డర్ చేసేవాడు. అలా దళితుడు ఇచ్చిన టీ అందరూ తప్పకుండా తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సాహూ మహరాజ్ అంటరానితనంపై పోరాటం చేశాడు. అలాగే అప్పట్లో కేరళలో కూడా దేవాలయ ప్రవేశం ఒకటి జరిగింది. అందులో గాంధీజీ కూడా పాల్గొన్నారు. అది కూడా పెద్ద సంచలనం. ఇలా ఇన్ని పోరాటాలు జరిగినా ఇప్పటికీ కుల సమస్య పోలేదు.
పెండ్లి దగ్గర పట్టింపులు
చాలా మంది ఇప్పుడు కులం ఎక్కడుంది మేమంతా గ్రామంలో అక్క, చెల్లి, వదిన, అన్న అని పిలుచుకుంటాం, మా దగ్గర కుల పట్టింపులు లేవు అంటుంటారు. కానీ ఇంత ఆప్యాయంగా పిలుచుకునే వాళ్లు వేరే కులం అమ్మాయిని తమ కులంలోకి పెండ్లి చేసుకుంటారా? అని ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం ఉండదు. పైగా అలా ఏలా కుదురుతుంది అంటారు. అలాంటప్పుడు కులం ఉన్నట్టే కదా? సమాజంలో ఎంత మార్పు వస్తున్నా కులాంతర వివాహాలు జరిగితే మాత్రం భరించలేరు. నగరాల్లో, పట్టణాల్లో కొంత మార్పు వచ్చినా గ్రామాల్లో మాత్రం వివక్ష పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఉన్న గ్రామాల్లో మాత్రం మార్పు కనిపిస్తుంది.
వాళ్లకు కులం అవసరం
ప్రభుత్వాలు కూడా కులాంతర వివాహాలపై తీసుకొస్తున్న రూల్స్ సరిగా ఉండడం లేదు. ఇటీవల గుజరాత్లో తల్లిదండ్రులు అంగీకరిస్తేనే కులాంతర వివాహం చేసుకోవాలి అనే రూల్ పాస్ చేశారు. అంటే ఏంటీ మతాంతర, కులాంతర వివాహాలను ఆపాలనే కదా! ఏ తల్లిదండ్రులైనా ఎందుకు అంగీకరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మతాంతర వివాహాలపై నిషేధం విధించారు. వాట్సాప్ యూనివర్సిటీల్లో వీటిపై అనేక వార్తలు వస్తుంటాయి. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కేరళ స్టోరీ అనే సినిమా అలాంటిదే. అంటే కులాన్ని, మతాన్ని అలాగే ఉంచాలి అనేది వాళ్ల భావన. పైకి మాత్రం హిందువులందరూ ఒకటే అంటారు. మరి ద్రౌపతి ముర్మూని, రామ్‌నాథ్ కోవిద్ని పార్లమెంటు ప్రారంభోత్సవానికి, రామమందిర పూజకు రానీయకుండా వివక్ష చూపించారు. పై స్థాయిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక కింది స్థాయిలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కులం ఉంటేనే ఓట్లు
ఇప్పటికీ చాలా మంది పేరు వెనక తోకలుపెట్టుకుంటున్నారు. చివరకి కింది కులాల వాళ్లు కూడా తోక తగిలించుకుంటున్నారు. అంటే కులం ఉండాలని కోరుకోవడమే కదా! అలాగే కులం బాగా బలంగా ఉంటేనే రాజకీయనాయకులకు ఓట్లు పడతాయి. అందుకే వాళ్లు కూడా కులం ఉండాలని కోరుకుంటారు. ఒక్క కమ్యూనిస్టులు తప్ప మిగిలిన రాజకీయపార్టీలన్నీ కూడా కులం ఇలాగే ఉండాలని భావిస్తారు. అందుకే కుల నిర్మూలనా అనే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా మేము తయారు చేస్తున్న మెటీరియల్, వేయబోతున్న నాటికలు అన్నీ తర్వాత తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోపగడతాయి. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతుల మానవహారం చేయాలని నిర్ణయించాం. భార్యాభర్తలు ఇద్దరూ ఇందులో పాల్గొనాలి.

భరోసా అవసరం
కుల రహిత సమాజానికి కులాంతర వివాహాలు ఒక పరిష్కారం. అలాగే బతకడానికి ఒక వనరు ఏర్పడితే కులం అనేది పలచబడుతుంది. నేడు కులాంతర వివాహాలు జరుగుతున్నాయంటే ఆడపిల్లలు కూడా చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. కింద కులం అమ్మాయి అయినా ఉద్యోగం చేస్తుంది సంపాదిస్తుంది కాబట్టి మా భవిష్యత్తుకు భయం లేదు అనే ఆలోచనతో పెండ్లి చేసుకుంటున్నారు. వాళ్లకు ఓ భరోసా ఉంటే ఇలాంటి వివాహాలు జరుగుతాయి. ఏదో ప్రేమించాం పెండ్లి చేసుకుంటాం అంటే సరిపోదు. వాళ్లకు ఉద్యోగం ఉందా, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. అలాగే తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి.
రాజ్యాంగ విలువలు చెప్పాలి
రాజ్యాంగంలో సామాజిక సమానత్వం సాధించడం ఎలా అనే దానిపై అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు. అంటరానితనం నేరం అని ఉంటుంది. కానీ అది కేవలం రాతలకే పరిమితం. పదోతరగతి తర్వాత పిల్లల సబ్జెక్ట్స్ మారిపోతాయి. సామాజిక శాస్త్రం, చరిత్రకు దూరమైపోతున్నారు. దాంతో యువతకు రాజ్యాంగ విలువల గురించి తెలియడం లేదు. కనీసం పదోతరగతిలో అయినా రాజ్యాంగం గురించి తెలియజేస్తే అవగాహన ఉంటుంది. కానీ మన ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయడం లేదు. అలాగే కులంతార వివాహం చేసుకున్న జంటలకు ఏడాదిలో 500 మందికి మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అంటే కనీసం జిల్లాకు ఒక జంటకు కూడా అది అందడం లేదు. అది కూడా అప్లరు చేసుకున్న ఎన్నో రోజులకు వస్తుంది. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కనుక రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిపై అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం.
ఇది ఆరంభం మాత్రమే
మేము చేస్తున్న ఈ కార్యక్రమం కేవలం ఆరంభంగానే మేము అనుకుంటున్నాం. తర్వాత కాలంలో జిల్లాల్లో కూడా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుల సంఘాలు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కానీ కులం పోవాలి అని పోరాడటం లేదు. ఈ డిమాండ్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది వెనక్కు పోతున్నారు. వారి సమావేశాల్లో ఇతర కులాలను మనం తక్కువ చేసి చూడకూడదు అనే తీర్మానం చేయరు. మన కులం ఉంటేనే మనకు నాయకత్వం అనే ధోరణి కుల సంఘాలలో బాగా ఉంది. ఇది కుల నిర్మూలకు పెద్ద అడ్డంకిగా ఉంది. దీనిలో మార్పురావాలి. కాబట్టి అభ్యుదయ వాదులు ఈ బాధ్యత తీసుకోవాలి. కుల నిర్మూల కోసం మరింత విస్తృతంగా పని చేయాలి. మనం పోరాటం చేస్తూ, అవగాహన పెంచుతూ, చైతన్యం కల్పిస్తే కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. కుల నిర్మూలన జరుగుతుంది. అయితే ఇది వెంటనే జగకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం కచ్చితంగా జరుగుతుంది.
మనుషులంతా కలిసి నడిచే దారిలో
సాగిపోయే సమత గీతం పాడరా
మానవతనే మనసునిండగ నడపరా
ఆధిపత్యపు గోడలన్నీ కూలగా…
విశాలమైన వేదికల ద్వారా…
సుందరయ్య విజ్ఞానకేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కుల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 11 పూలే జయింతి రోజు నుండి ఏప్రిల్ 14 అబేంద్కర్ జయంతి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీని ప్రచారం కోసం ఏప్రిల్ 5 నుండే వివిధ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించాము. పాటలు, డాన్స్‌లు, నాటికలు, షార్ట్ఫిలిమ్స్, ఏకపాత్రాభినయనాలు వుంటాయి. దీని నిర్వహణ కోసం విశాలమైన వేదికలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నాం. అభ్యుదయ భావాలు కలిగిన వారందరూ ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు. వాళ్లు కూడా భాగస్వాములు అవుతామని అడుగుతున్నారు. మొదట ఏప్రిల్ 5న కుల నిర్మూలన మీద కవిసమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగానే వ్యాసరచనా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. 14వ తేదీన జరిగే సభలో వీరికి బహుమతులు ఇస్తాం. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఉత్సవాలను ప్రారంభిస్తారు. వీరితో పాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకోబోతున్నారు.
చరిత్రను తెలిపేందుకు ఎగ్జిబిషన్
ప్రారంభం రోజైన 11వ తేదిన ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం. చంద్రశేఖర్ అనే కార్టునిస్ట్ ‘క్యాస్ట్ కాన్సర్’ అనే అంశంపై కార్టున్స్ వేశారు. వాటిని ఇందులో ప్రదర్శించబోతున్నాం. అలాగే వేమన పద్యాలు, కుల సమస్యపై భారత రాజ్యాంగం ఏం చెబుతుంది, మనుస్మృతి ఏం చెబుతుంది అనే అంశాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టాలనుకున్నాం. గౌతమ బుద్ధుని నుండి అంబేద్కర్ వరకు చాలా మంది కులనిర్మూలన కోసం పోరాడారు. అటువంటి వారందరి ఫొటోలు కూడా పెడుతున్నాం. వాళ్ల జీవిత విశేషాలు, వాళ్లు ఏం కోరుకున్నారు, ఎలాంటి పోరాటాలు చేశారు అనేవి అన్నీ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నాం. దీని వల్ల నేటి తరానికి కుల సమస్యపై అవగాహన రావడంతో పాటు కుల నిర్మూలనకై పోరాడాలనే చైతన్యం కూడా వస్తుందని మేము భావిస్తున్నాం.
ఏకపాత్రాభినయాలు…
ఈ నాలుగు రోజుల కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పాటలు రాయించాం. ఏకపాత్రాభినయాలు రాయించాము. చాలా మంది భగత్‌సింగ్ అంటే తుపాకీ అనుకుంటారు. కానీ ఆయన విప్లవం అంటే తుపాకులు, బాంబులు కాదు అని చెప్పాడు. అలాగే కుల సమస్య వల్ల వచ్చే సమస్యల గురించి స్పష్టంగా రాశారు. ‘నీ పక్క వాడినే నువ్వు స్వీకరించలేనపుడు, ఇక స్వాతంత్య్రం కోసం పోరాటం ఎలా చేస్తావు’ అన్నాడు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కుల నిర్మూలనపై మాట్లాడారు. ఇలాంటి వారి ఏకపాత్రాభినయాలు వేస్తున్నాం. అలాగే జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే నాటకం వేస్తున్నాం. హైదరాబాద్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు ఈ నాలుగు రోజుల కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అలాగే శివాజీ అంటే ముస్లింల వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన సైన్యంలో ముఖ్య బాధ్యతలు చూసిన వాళ్లు ముస్లింలు. కాబట్టి వీళ్లు చేస్తున్న ప్రచారం సరైనది కాదు అని తెలిపేందుకు దామోదర్ పన్సారే రాసిని పుస్తకం ఆధారంగా శివాజీ ఏకపాత్రాభినయం వేస్తున్నాం. అలాగే ముస్లిం రాజులు హిందువులకు వ్యతిరేకం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. మొగల్ చరిత్రను పరిశీలిస్తే హిందూ, ముస్లిం కలయిక ఉంటుంది. కానీ ఇదంతా బయటకు రాకుండా గొడవలు సృష్టించాలని చూస్తున్నారు.
ధర్మాధర్మం
ఏ దేవుడు అంటించెనో ఈ కులగజ్జి
ఏ మహాత్ముడు సష్టించెనో ఈ మతపిచ్చి
నీది నాదీ వేరంటారు
మనిషి మనిషినీ విడగొడ్తారు
అంటరానోల్లని దూషిస్తారు
మానవత్వానికి మసి పూస్తారు
ధర్మం, ఖర్మం అంటారు
సద్ధర్మాన్నే చెడగొడ్తారు
రాళ్ళూ – రప్పల బొమ్మలు చేసి
దేవుల్లంటూ పూజిస్తారు
ఎంత కాలమో ఈ అజ్ఞానం
ఎప్పుడొస్తుందో మరి సుజ్ఞానం, ఏ దేవుడ,
బుద్ధుడు, బ్రహ్మం చూపిన బాట
వేమన, వివేక చాటిన నాట
ఫూలే, పెరియార్ చేసిన పోరు
బాబాసాహెబ్ సల్పిన హోరు
అంటరానితనం నేరం అంటూ
కులమంటేనే అమానుషమంటూ
గాంధీ చెప్పిన నీతి సూక్తులు
కాగితాలకే పరిమితమా… ఏ దేవుడు,,
ఎంత కాలమో ఈ అజ్ఞానం
ఎప్పుడొస్తుందో మరి సుజ్ఞానం.. ఏ దేవుడు..
-మహేష్ దుర్గే, 9700888972
సలీమ
94900 99083



