ఆయా రంగాలలో ప్రతిభ నైపుణ్యాలు కలిగిన స్త్రీలు ఏ కాలంలోనైనా రెండో శ్రేణి ప్రాధాన్యతనే పొందుతూ ఉంటారు. డబ్బు, పురుషాధిక్యత, అవకాశవాదం… ఇవన్నీ కూడా సినిమా రంగంలో మహిళల జీవితాలలో సంక్షోభాలను ఏర్పరుస్తాయి. ఆ కోవలో ప్రస్తావించుకోదగిన నటి పుష్పవల్లి. బాలీవుడ్లో అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగిన రేఖ తల్లి.
కమలాల్లాంటి కన్నులను విసురుతూ, తిప్పుతూ విలాసంగా, వయ్యారంగా నాట్యం చేసే అందం ఆమెది. ఆ రోజుల్లోని పెళ్ళి చూపుల్లో ‘పుష్పవల్లి కళ్ళు కాకున్న అమ్మాయివి మంచి కళ్ళు” అని పెళ్ళి కూతురును పుష్పవల్లితో పోల్చేవారు. పుష్పవల్లి తొలి చిత్రం సి.పుల్లయ్య ‘సంపూర్ణ రామాయణం” (1936). తెలుగు నాట రాజమండ్రిలో తొలిసారిగా తీసారు. అయితే రాముడు సీతను వెదికే ఘట్టాన్ని గోదావరి పక్కన ఉద్యానవనం సెట్ చేసి చిత్రించారు. రాముడు ”సీతా! సీతా!!” అని ఆక్రోశిస్తుండగా గోదావరి బ్రిడ్జి మీద రైలు వెళ్ళిన దృశ్యం ప్రేక్షకులకు కనబడింది. ఈ చిత్రం ఫెయిలైంది. ఆ తరువాత చిత్రం సి.పుల్లయ్య ‘చల్ మోహనరంగ’. 1938లో ‘మోహినీ భస్మాసుర’లో భస్మారుడు ఎ.వి.సుబ్బారావు ఎదుట మోహినిగా అందాలు ఒలికించింది.
1939లో సి.పుల్లయ్య ‘వరవిక్రయం’లో కాళింది పాత్రలో శోక విషాదాల్ని ఒలికించే పాత్ర భానుమతిది. ఆమె చెల్లెలుగా అందాలోలికించే చలాకి పాత్రను పుష్పవల్లి పోషించింది. 1940 సంగతి సి.పుల్లయ్య మాలతీ మాదవం, రాజశాండో ‘చూడామణి’ ఏకకాలంలో ప్లాన్ చేసుకున్నారు. రెండింటిలోను పుష్పవల్లి హీరోయిన్. రాజశాండో వద్ద అడ్వాన్స్ పుచ్చుకున్న పుష్పవల్లి సి.పుల్లయ్య పిలుపును పుట్టింటి పిలుపులా భావించి ఆయన ‘మాలతీ మాధవం’ షూటింగులో పాల్గొనడానికి కలకత్తా వెళ్ళింది. దాంతో రాజశాండో వెళ్ళి టాకీ పులి హెచ్.ఎం.రెడ్డి గారితో మొరపెట్టుకున్నాడు. ఈనేపధ్యంలో సి.పుల్లయ్య, హెచ్.ఎం.రెడ్డిల మధ్య చిన్న వివాదం కూడ వచ్చింది. ‘చూడామణి’లో నటించి గ్లామరస్ తారగా పుష్పవల్లి స్థిరపడింది. ‘తారా శశాంకం’ (1941) లోను పుష్పవల్లి నటించింది. బి.ఎన్. ‘సుమంగళి’ (1940)లో కూడా నటించింది.
1942లో జెమినీ వారు సి.పుల్లయ్యతో ‘బాలనాగమ్మ’ తీశారు. బాలనాగమ్మగా కాంచనమాల నటించగా, గాండ్ల సంఘు పాత్రలో ఆమె నటన అనన్య సామాన్యం. అందమూ టాలెంట్ కలిసిన పుష్పవల్లి ఈ చిత్రంలో నత్యం చేస్తూ పాడిన ”నా సొగసే కని మరుడే దాసుడు కాడా”, ”సంతోషమున మనరారా” పాటలు ప్రేక్షకుల పెదవుల మీద చిందులు వేశాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కాంచనమాల. అయినా తనను సినీ రంగానికి పరిచయం చేసిన సి.పుల్లయ్యపై గౌరవంతో వాంప్ రోల్ చేసింది. ఈకాలంలోనే వచ్చిన వై.వి. రావు ‘సత్యభామ’ (1942)లో సత్యగా నటించింది.
తెలుగు సినీ సీమలో కాంచనమాల, కన్నాంబ, కృష్ణవేణిలు కత్రయంగా వెలుగొందుతున్న ఆరోజుల్లో వారి పోటీని తట్టుకోలేక పుష్పవల్లి తమిళ చిత్రరంగం వైపు మొగ్గు చూపింది. సరిగ్గా అప్పుడే కాంచనమాల జెమినీ వారితో ఘర్షణపడి చిత్రరంగం నుండి వైదొలగడం పుష్పవల్లికి కలిసి వచ్చింది.

దాంతో జెమినీ వారికి స్టాఫ్ ఆర్టిస్ట్స్ చేరింది. ఫలితంగా జెమినీవారు 1944లో తెలుగువాడైన బి.ఎన్.రావు దర్శకత్వంలో రూపొందించిన ‘దాసి అపరంజి’లో అపరంజిగా నటించి తమిళ సినిమా రంగానికి పుష్పవల్లి పరిచయమైంది. ఆ తరువాత జెమినీ వారి ‘మిస్ మాలిని’ (1947), ‘చక్రధారి’ (హీరో నాగయ్య 1948)’, సంసార్’ (హింది), ‘వింద్యారాణి’ (1948) చిత్రాలలో ఆమె గ్లామరస్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగింది. జెమినీ వారి ‘సంసారం’ తర్వాత పుష్పవల్లి ఆ సంస్థ నుండి బయటకు వచ్చి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి ‘పెంపుడు కొడుకు’లో తల్లిపాత్రను పోషించింది. ఆతర్వాత 1956లో త్రిభాషా చిత్రం బి.యన్.రంగా ‘భక్త మార్కేండేయ’ (ఈ చిత్రంలో ఆమె కొడుకు బాబ్జీ మార్కేండేయుడుగా నటించాడు). వేదాంతం రాఘవయ్య ఇంటి గుట్టు (1958)లో తల్లి పాత్రలు పోషించింది. ఆమె చివరి రెండు చిత్రాలూ బి.ఎన్.రెడ్డి ఆఖరి రెండు చిత్రాలు కావడం విశేషం. అవి :’రంగుల రాట్నం (1966), బంగారు పంజరం’ (1969).
పుష్పవల్లిది సినీ కుటుంబం. చెల్లెలు సూర్యప్రభ నటి. కూతురు రేఖ హిందీలో హీరోయిన్. కొడుకు బాబ్జీ బాలనటుడుగా కొన్ని చిత్రాల్లో నటించి నిర్మాతగా మారి ‘నయా బక్రా’ (1979) చిత్రాన్ని నిర్మించాడు. ఒకటిన్నర దశాబ్దాలపాటు గ్లామరస్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి మరో ఒకటిన్నర దశకం పాటు తల్లి పాత్రలలో జీవించిన పుష్పవల్లి సింగింగ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ”ఆ పూల మొక్కలెటులున్నవో పోయి చూచెదన్ (వర విక్రయం) నా సాగసే గని మరుడే దాసుదుగాడా, సంతోషమున మనరారా” (బాల నాగమ్మ)వంటి పాటలు మరికొన్ని చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడింది.
పుష్పవల్లి, గణేషన్ నుండి విడిపోయిన తర్వాత, కొన్ని సినిమాలలో నటించింది, ఎక్కువగా చిన్న పాత్రలలో, అందులో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని తన పాత మిత్రులు తీసిన ‘సంసార్ (1951), బహుత్ దిన్ హువే (1954), గృహస్తి (1963), జిందగీ(1964)’ వంటి హిందీ సినిమాలలో నటించింది. తన కుమార్తెలకు మద్దతు ఇవ్వడానికి ఆమె ఈ పాత్రలు చేసింది, వారిని ఆమె చాలా జాగ్రత్తగా ఒంటరిగా పెంచింది. జెమినీ గణేశన్ రేఖను తన కుమార్తెగా గుర్తించడానికి, ఆమెకు అవకాశాలు కల్పించడానికి ఇష్టపడలేదు. అతను ఈ ఇద్దరు పిల్లలను చాలా అరుదుగా కలిసేవాడు. ఆ తర్వాత పుష్పవల్లి మద్రాసుకు చెందిన సినిమాటోగ్రాఫర్ కె. ప్రకాష్‌ను పెళ్లాడింది. ఆమె తన పేరును చట్టబద్ధంగా కె. పుష్పవల్లిగా మార్చుకుంది. ఈ పెళ్లి వలన ధనలక్ష్మి, నర్తకి శేషులకు తల్లయింది ఆమె.
గణేషన్‌తో సంబంధం ముగిసిన తర్వాత, పుష్పవల్లి అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉన్నది. కానీ ఆమె కెరీర్ తాను ఆశించిన స్థాయికి ఎప్పుడూ చేరుకోలేదు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఆమె తన పిల్లలను పోషించాలనే పట్టుదలతో ఉండేది. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటిగా ఎదిగిన రేఖ, తన తల్లి ప్రభావం, బలం గురించి తరచుగా మాట్లాడేది. తన పిల్లల పట్ల పుష్పవల్లికి ఉన్న అంకితభావం, ఒంటరి తల్లిగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన ఆమె సామర్థ్యం రేఖ, రాధలపై చెరగని ముద్ర వేసింది. ఒక ఇంటర్వ్యూలో ”మా అమ్మ నా మార్గదర్శి. ఆమె ఎంతటి సుశిక్షకురాలంటే, ఒక దేవతలా, ఒక దేవిలా అనిపించేది. సౌమ్యతతో, ప్రేమతో జీవించడంలోని సౌందర్యాన్ని ఆమె నాకు నేర్పించారు. ‘కళ్లలోని మెరుపు’ను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె ఎప్పుడూ చెప్పేవారు. ఎందుకంటే, ఆ ఆనందకరమైన దక్పథమే ఒక చిన్న విత్తనం మహావక్షంగా పెరిగే అందాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.
నేను చెప్పేది కాదు, నేను ఇష్టపడేదాన్ని ఆచరించాలని కూడా ఆమె నాకు తెలివిగా సలహా ఇచ్చారు. మా అమ్మ చెప్పినట్లే నడుచుకున్నాను కాబట్టి, ఆమె నాకు ఒక ఆదర్శంగా నిలిచారని” రేఖ చెప్పుకొచ్చింది. 1929 జనవరి 3న జన్మించిన పుష్పవల్లి తొలి పేరు ‘పెంటపాడు వేంకట తాయారు’. పుష్పవల్లికి తెలుగు, తమిళం, ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉండేది. హిందీ మధ్యమ పరీక్ష పాస్ అయ్యింది కూడా. పుష్పవల్లి బైసికిల్ థీవ్స్ వంటి ఆంగ్ల సినిమాలను ఇష్టపడేది. ఆమెకు ప్రఖ్యాత హాలీవుడ్ ఫిలిం నిర్మాత ఫ్రాంక్ కాప్రాతో పరిచయం ఏర్పడింది. కాప్రా పుష్పవల్లిని అమెరికాకు రమ్మని ఆహ్వానించాడు కూడా. ఇది ఆ రోజుల్లో అంత మామూలు విషయం కాదు. ఆమె సొగసు గల పాత్రలు, వాంపు పాత్రలు, కరుణరసాత్మకమైన పాత్రలు పోషించి, నటించి, నర్తించి పాడింది. ఆమె కూతురు రేఖ పెద్ద స్టార్ కావడంతో బొంబాయిలో స్థిరపడింది. పుష్పవల్లి 1993 మే 11న మదరాసులో ఆఖరి శ్వాస విడిచింది.
తొలితరం అందాల తారలు కాంచనమాల, కన్నాంబ, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, శ్రీరంజని, వంటి వారికి కొసమెరుపుగా ప్రస్తుతించుకోదగిన పుష్పవల్లి వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు సగటు మహిళ పడిన కష్టాలకేమీ తీసిపోవు. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యలు వారి వ్యక్తిగత జీవితంపై ఎంత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవడానికి పుష్పవల్లి జీవితాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చును. జెమినీ గణేషన్‌తో ఆమెకున్న బంధం సవాళ్లతో నిండి ఉన్నప్పటికీ, దానికి బదులుగా, తన పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ కారణంగా కష్టాలను అధిగమించేందుకు ఏర్పరచుకున్న సామర్థ్యమే ఆమె వ్యక్తిత్వాన్ని రుజువు చేసింది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఒక ఒంటరి తల్లిగా ధైర్యాన్ని, దఢసంకల్పాన్ని ప్రదర్శించింది. పుష్పవల్లి జీవితంలోని ఎత్తుపల్లాలు, వేదనాభరితమైన అనుభవాలు సినిమా రంగంలోని ఈ తరం నాయికలకు హెచ్చరికల వంటివి.

పుష్పవల్లి- జెమినీ గణేషన్
పుష్పవల్లి వైవాహిక జీవితం చాలా వొడిదుడుకులతో గడిచింది. 1940లో ఐ. వి. రంగాచారి అనే లాయర్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు వారు 1946నుండి విడివిడిగా జీవించడం ప్రారంభించారు. రంగచారితో వివాహం ద్వారా పుష్పవల్లికి ఇద్దరు పిల్లలు బాబ్జీ, రమ కలిగారు. ‘మిస్ మాలిని’ (1947) చిత్రం ఆమె భవిష్యత్ సహచరుడైన జెమినీ గణేషన్‌కు తొలి చిత్రం. ఆ తర్వాత పుష్పవల్లి తమిళ చిత్రం ‘చక్రధారి’ (1948)లో గణేషన్‌తో కలిసి నటించింది. ఇందులో ఆమె కథానాయిక. జెమినీది చిన్న పాత్ర. ఈ సినిమా తర్వాత గణేషన్ ఒక పెద్ద స్టార్ అయ్యాడు. పుష్పవల్లి కేవలం సహాయ పాత్రలకు పరిమితమైపోయింది.
‘చక్రధారి’లో నటిస్తున్నపుడు పాండురంగడిగా నటించిన ఆర్.గణేశన్ ప్రేమలో పడిందామె. వారి ప్రేమ ఫలితమే భారతీయ హిందీ సినిమా రంగంలో అగ్రశ్రేణి హీరోయిన్గా ఒక వెలుగు వెలుగొందిన ‘రేఖ’ ఉరఫ్ ‘భానురేఖ’. అయితే పుష్పవల్లి జెమిని గణేషన్ చాలా బాగా కలిసిపోయారు. ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు. వాస్తవానికి అప్పటికే వారిద్దరికీ వేరే వ్యక్తులతో వివాహాలు జరిగినవి. (గణేషన్ తన మొదటి భార్య అలమేలును, (బాబ్జీ)చాలా చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నాడు. తన మరణం వరకు బాబ్జీతో వివాహ బంధంలోనే ఉన్నాడు. గణేశన్ చాలా సంవత్సరాల పాటు పుష్పవల్లికి తన వలన పుట్టిన బిడ్డలకు తండ్రిగా అంగీకరించలేదు. పుష్పవల్లి ఇంటికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడు. క్రమంగా సంబంధం క్షీణించి వారు త్వరలోనే విడిపోయారు.
1955లోనే, రాధ పుట్టకముందే, గణేశన్ ప్రముఖ నటి సావిత్రిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అది చట్టబద్ధమైన వివాహంగా గుర్తింపు పొందింది. ఎందుకంటే 1956 వరకు ఒక హిందూ పురుషుడు ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటానికి చట్టబద్ధత ఉండేది. సావిత్రికి అప్పటికే వివాహం కానందున, ఆమె గణేశన్‌కు లీగల్‌గా రెండవ భార్యగా మారడం సాధ్యమైంది. పుష్పవల్లికి ఇంకా రంగాచారితో చట్టబద్ధంగా వివాహం జరిగి ఉన్నందున (1956 వరకు హిందువులకు విడాకులు తీసుకునే అవకాశం లేదు), ఆ అవకాశం ఆమెకు లభించలేదు. ఆమె వేరొకరిని వివాహం చేసుకోవడం అసాధ్యం. కానీ పుష్పవల్లి, గణేశన్‌ల వివాహం తిరుపతిలో జరిగిందని కొందరు అంటారు. కానీ వాటికి సంబంధించిన ఏ ఆధారాలు బహిర్గతం కాలేదు.
జెమినీ గణేషన్ తమిళ చిత్ర రంగంలో గురజాడ వారు సష్టించిన గిరీశం వంటి పాత్రను పోషించాడనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక ‘కాసనోవా’లా ప్రవర్తించాడు. చాలామంది స్త్రీల జీవితాల్లోకి ప్రవేశించి వారిని తన అవసరం తీరిన తర్వాత వదిలేసుకుంటూ వెళ్లడం అతని నిత్య కత్యంగా మారిపోయింది. అతడు ఆ తర్వాత సావిత్రి కూడా తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణమయ్యాడు. సావిత్రి జెమిని ప్రేమలోని మోసాన్ని తట్టుకోలేక మద్యానికి చేరువై తన జీవితాన్ని ముగించింది. కానీ పుష్పవల్లి ఒంటరి మహిళగా తన బిడ్డల పోషణా భారాన్ని మోసింది. జెమినీ గణేషన్ కుమార్తె నారాయణీ గణేషన్ తన తండ్రి జీవిత చరిత్రలో రాస్తూ – ”అందాల తెలుగు నటి పుష్పవల్లికి, అప్పకు మధ్య ఒక స్వల్పకాలిక ప్రేమ సంబంధం ఉండేది.
బహుశా అది ఆయన వైవాహిక జీవితం వెలుపల ఆయనకు కలిగిన మొట్టమొదటి సంబంధం కావచ్చు. అయినప్పటికీ, వారు చివరి వరకూ స్నేహితులుగానే కొనసాగారు. అప్పా ప్రేమలో పడినప్పుడు, ఆయన వివాహితుడని ఆమెకు తెలియదనిపిస్తుంది. మనస్సాక్షి ఆమెను నిరంతరం వేధిస్తున్నప్పటికీ ఆమె ఆ ప్రేమను స్వీకరించింది. అప్పా కూడా ఆమె ప్రేమను స్వీకరించడం మొదలుపెట్టాడు. ఆమె అందమైన, ప్రతిభావంతురాలైన స్త్రీ. ఆమె ప్రేమను తిరస్కరించడం నిజంగా చాలా కష్టమయ్యేది. అప్పా స్త్రీల పొగడ్తలను మౌనంగా స్వీకరించే వ్యక్తి ఏమీ కాదు. ఆయన అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాడు. అలాగే తనను ఆరాధించడాన్ని, ప్రేమగా చూసుకోవడాన్ని ఆయన ఆస్వాదించేవాడు. ఆయన తన మొదటి కుటుంబాన్ని ప్రేమించాడు” అని పేర్కొంది.
నటనే ఆమె జీవిక
జెమిని దూరమయ్యాక పుష్పవల్లి తన కుటుంబానికి ఏకైక పోషకురాలిగా ఉండటంతో ఆమెకు లభించిన ఏ పాత్రనైనా సరే, విరామం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం ఆమె సినీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఆమెకు ఆఫర్ చేసిన ఏ పాత్రనైనా ఆమె అంగీకరించాల్సి వచ్చేది. దీనివల్ల ఆమెకు ప్రధాన పాత్రలు లభించే అవకాశాలు పరిమితమయ్యాయి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆమె ఎంతో శ్రద్ధతో పనిచేస్తూనే ఉంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది. పుష్పవల్లి కెరీర్లో అత్యంత కీలకమైన మలుపు, 1942లో వచ్చిన తెలుగు చిత్రం ”బాల నాగమ్మ”తో వచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఒక ముఖ్యమైన సహాయ పాత్రను పోషించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, ఒక ప్రతిభావంతురాలైన నటిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది.
1947లో, ఆమె ”మిస్ మాలిని” చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సత్యభామ (1942), దాసి అపరంజి (1944), పాదుకా పట్టాభిషేకం (1945), వింధ్యారాణి (1948), చక్రధారి (1948), సంసారం (1951), సన్సార్ (1951), దాసి (1952), మంగళ (1953), భక్త మార్కండేయ (1957) ఆమె ఇతర ముఖ్యమైన చిత్రాలలో కొన్ని. 1954లో, మధుబాల, రత్తన్ కుమార్ స్వరాజ్, అఘా నటించిన వాసన్ హిందీ చిత్రం ”బహుత్ దిన్ హువే”లో ఆమె నటించింది. ఈ చిత్రంలో పుష్పవల్లి, సావిత్రి ఇద్దరూ సపోర్టింగ్ రోల్లో నటించారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె మనోజ్ కుమార్ తల్లిగా హిందీ చిత్రం గృహస్తి (1963)లో నటించింది. చెంచులక్ష్మి (1958), ఇంటిగుట్టు (1958), సంపూర్ణ రామాయణం (1958), పెట్ర మనం (1960), బందిపోటు (1963), మంచి చెడు (1964), కై కొడుత్త దైవం (1964) ఆమె తర్వాతి చిత్రాలలో కొన్ని.
- హెచ్ రమేష్ బాబు,
గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386



