ప్రభుత్వ అరాచకాలపై ప్రజాస్వామ్య జయకేతనం
క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీల్లో
విజయంపై కేటీఆర్ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అరాచకాలను ఓడించి ప్రజాస్వామ్య జయకేతనం ఎగురవేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ చైర్మెన్ పీఠాలను గెలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సాధించిన ఘనవిజయాన్ని ”ప్రజాస్వామ్య జయకేతనం”గా అభివర్ణించారు. ఆ మున్సిపాల్టీల చైర్మెన్, వైస్ చైర్మెన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్ (బంటి)తోపాటు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు ప్రకటించారు. అడ్డదారుల్లో మున్సిపాల్టీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా, మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్ల ధైర్యానికి ఆయన సెల్యూట్ చేశారు. క్యాతనపల్లి విజయంలో మిత్రపక్షమైన సీపీఐ కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు.
రాష్ట్రంలో అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు తావులేదని ఈ ఎన్నికల తీర్పు స్పష్టంగా తేల్చి చెప్పిందని విమర్శించారు. కేవలం రెండున్నరేండ్ల పాలనలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో కౌంట్‌డౌన్ మొదలైందనీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చాటిచెప్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



