ఏ పనిలోనైనా విఫలమైతే సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు. తమలో ఉన్న బలాలేవీ గుర్తుకురావు అప్పుడు. చాలా మంది తమ రెండు కాళ్ళను కోల్పోతే సులభంగా ఓటమిని అంగీకరిస్తారు, కానీ ఈ యోధురాలు తన దృఢ సంకల్పం, కఠోర శ్రమతో అన్నింటినీ తట్టుకుని అధిగమించింది. ఆమె మనుగడ కోసం పడిన అపారమైన కష్టాలను దాటి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి మనందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణమైన విజయం కాదు. నిజమైన విజయం ఇతర ఆటగాళ్లను ఓడించడంలో లేదు, ప్రతిరోజూ మనల్ని ఓడిపోయిన వారిగా పిలిచే మన అంతరాత్మ స్వరాన్ని ఓడించడంలో ఉంది. మనం ఆ అంతరాత్మ స్వరంపై గెలవాలి.
అప్పుడే మనం నిజమైన విజేతలం అవుతాం. కొన్నిసార్లు సమాజానికి తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, జాలిపడటానికి కొంతమంది వ్యక్తులు అవసరమనిపిస్తుంది. అది వికలాంగుల ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని సౌకర్యవంతంగా విస్మరిస్తుంది. తాము ఎంత అసమర్థులైనా వారికోసం ఎంతో చేస్తున్నామని వికలాంగులకు నిరంతరం గుర్తు చేయడానికి ఒక్క క్షణం కూడా కేటాయించదు. వాస్తవానికి, వారు కూడా సాధారణ వ్యక్తులే. వారి ఆశయాలు సాధారణమైనవే. వారి కలలు సాధారణమైనవే. వారి ధైర్యం సాధారణమైనదే. వారి అభిరుచి, ఉత్సాహం సాధారణమైనవే. ఆ అసాధారణ ‘బాస్కెట్‌బాల్ గర్ల్’ స్ఫూర్తి గాథ.
చైనాకి చెందిన చియాన్ హాంగ్‌యాన్‌కు ఇప్పుడు ముప్పయ్యేండ్లు తల్లిదండ్రులూ, ఇద్దరు సోదరులూ కష్టపడి పనిచేస్తేనే రోజు గడిచే నిరుపేద కుటుంబం వారిది. నాలుగేండ్ల వయసులో ఒకరోజు రోడ్డు దాటుతున్న చియాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. నడుం కింది నుంచి పూర్తిగా తొలగించక తప్పలేదు. వీల్‌చైర్ కొనలేని తమ నిస్సహాయతకు దుఃఖిస్తూ గాయం మానేవరకు వైద్యం చేయించి బిడ్డను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. రోజులు గడుస్తున్నాయి. పిల్ల నడిచేదెలా అన్న ప్రశ్న అందరినీ వేధించింది.
తాతా ఆలోచన
సమయంలో చియాన్ తాతకు ఒక ఆలోచన వచ్చింది. బాస్కెట్ బాల్ ఆటలో వాడే బంతిని కాస్త కత్తిరించి ఆమె శరీరానికి అమర్చారు. చేతులు రెండూ భూమి మీద ఆనించి నడిచేలా చెక్కతో పీటల్లాంటివి చేయించారు. అలా ఆమె నడకకు రంగం సిద్ధమైంది. తాత సాయంతో వాటి ఆధారంగా మెల్లిమెల్లిగా నడకను అలవాటు చేసుకుంది చియాన్. విచిత్రంగా నడిచే ఆ చిన్న శరీరాన్ని చూసి తోటి పిల్లలు ‘బాస్కెట్‌బాల్ గర్ల్’ అంటూ ఆటపట్టించేవారు. అవేవీ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లేది చియాన్. స్కూల్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే చియాన్ ఒక్కతే తరగతి గదిలోనే కూర్చుని చదువుకునేది.
కృత్రిమ కాళ్లు
ఐదేండ్లు బాస్కెట్‌బాల్‌లోనే జీవించిన తర్వాత, ఆమె కథ చివరకు చైనాతోపాటు, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. వైకల్యం గురించి చర్చించడం అసాధారణమైన చైనాలో, ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాక, ఇది కియాన్ జీవితంలో ఒక మలుపుగా కూడా నిలిచింది. బాల్‌తో స్కూలుకు వెళ్లివస్తున్న ఆమె ఫొటోలు పత్రికల్లో రావడంతో బీజింగ్‌లోని రిహాబిలిటేషన్ రీసెర్చ్ సెంటర్ వాళ్లు పిలిచి ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చారు.

క్వీన్ మెర్మెయిడ్
విరాళాలతో ప్రాథమిక విద్య మాత్రమే పూర్తిచేయగలిగిన చియాన్ ఆ తరవాత వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్విమ్మింగ్ క్లబ్‌లో చేరింది. కొత్తలో ఇబ్బంది పడ్డా మెల్లగా అలవాటుపడింది. పట్టువదలకుండా సాధన చేసింది. స్నేహితుల్లాగా పరుగులు పెడుతూ ఆడుకోలేకపోయినందుకు బాధపడ్డ చియాన్ నీటిలో ఆ ఆనందాన్ని పొందింది. బాస్కెట్ బాల్ గర్ల్ కాస్తా ‘క్వీన్ మెర్మెయిడ్’ అనిపించుకుంది.
స్వర్ణ పతకం
పారాలింపిక్ క్రీడలలో పాల్గొనడానికి ఆమె క్లబ్‌లో రోజుకు నాలుగు గంటల పాటు శిక్షణ ప్రారంభించింది. ఆమె కఠోర శ్రమ ఫలితంగా, 2011 చైనీస్ నేషనల్ పారాలింపిక్ స్విమ్మింగ్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఒక సంవత్సర కాలంలోనే, ఆమె స్విమ్మింగ్‌లో మొత్తం నాలుగు బంగారు, ఐదు వెండి పతకాలను గెలుచుకుంది. పారాలింపిక్ క్వాలిఫైయర్స్‌కు కొద్ది రోజుల ముందు కియాన్ తాతగారు మరణించారు. క్వాలిఫైయర్స్‌లో ఆమె కాంస్యం గెలుచుకున్నప్పటికీ, జట్టులో స్థానం సంపాదించలేకపోయింది. అయినప్పటికీ, ఆమె సోదరులు ఆమెను ఒక వీరవనితలా స్వాగతించారు. చైనాలో 2009లో జరిగిన జాతీయ పారాలింపిక్ ఛాంపియన్‌షిప్‌లో 100మీ. ఈత పోటీలో మొట్టమొదటి స్వర్ణ పతకం ఆమెదే.
ఇతర విభాగాల్లో మరో రెండు వెండి పతకాలు వచ్చాయి. ఇక ఆ తరవాత ఆమె వెనుదిరిగి చూడలేదు. రియో పారాలింపిక్స్‌కి వెళ్లింది. ‘ఇతరులను ఓడించానా, పతకం సాధించానా అన్నది కాదు… నన్ను నేను గెలవడమే నాకు ముఖ్యం. నువ్వు దివ్యాంగురాలివి, నీవల్ల కాదు అంటున్న అంతరాత్మ నోరు నొక్కి నేనేంటో చూపిస్తున్నాను’ అనే చియాన్ ఎవరిమీదా ఆధారపడకుండా బతకడం నేర్చుకున్నారు. ఆటల పోటీలేవీ లేనప్పుడు దివ్యాంగుల సమాఖ్యలో ప్రభుత్వ ఉద్యోగినిగా అసహాయులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు.
- అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



