కుల వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేయాలి :
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్
26న కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
జయప్రదంగా సన్నాహక సమావేశం
నవతెలంగాణ- ముషీరాబాద్
ఇప్పటికీ ప్రజల మధ్య కులమత వైశమ్యాలు కొనసాగడం విచారకరమని, సాటి మనుషులంతా సమానమనే సమానత్వ భావనను పెంపొందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో శనివారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ”కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల” సన్నాహక సమావేశం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటిస్తూ కుల రహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులవివక్ష, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఈ సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కుల రహిత సమాజం ద్వారా మాత్రమే భారతీయ సమాజం పురోభివృద్ధి చెందుతుందని, ఆ విధంగా కులరహిత ఉత్సవాల్లో జానపద కళాకారులు, డప్పు కళాకారులు పాల్గొని వివిధ సాంస్కృతిక రూపాలతో అవగాహన కల్పించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశవ్యాప్తంగా నెలకు 10000 చొప్పున దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యాలను అరికట్టడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందన్నారు. పైగా వాటిని ప్రోత్సహించే విధంగా ఆ పార్టీ విధానాలు ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ మొత్తం కుల వివక్ష అంటరానితనంపై ప్రజల్లో చైతన్యం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారధి కళాకారుల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు పెట్టడంపై అహంకారపూరిత అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే వ్యాఖ్యాలను ఉపసంహరించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్, టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి.రాములు, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ మాట్లాడారు. కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకొని కులపరమైన దౌర్జన్యాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. వివిధ సంఘాల నేతలు, మేధావులు, శ్రేయోభిలాషులతో కలిసి సమిష్టిగా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సన్నాహక సమావేశంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎన్ ఆశాలత, టీిఎస్ యూటీిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటప్ప, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, రాష్ట్ర నాయకులు దామెర కిరణ్, విగేష్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి.రమేష్, రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదమరాజు, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, వశపాక నరసింహ్మ, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్య కిరణ్, జగతి ఆర్ట్స్ బాధ్యులు ఆర్.సైదులు, జైభీమ్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, అలెగ్జాండర్ ప్రభు, డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండి జావీద్, సామాజిక కార్యకర్త గట్టు అశోక్, మాయ, నరేష్, ఎస్ఎఫ్ఐ ఓయూ నాయకులు పాల్గొన్నారు.
మనుషులంతా సమానమేనని చాటిచెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



