Sunday, April 5, 2026
E-PAPER
Homeబీజినెస్తీవ్ర సంక్షోభంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్‌

తీవ్ర సంక్షోభంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్‌

- Advertisement -

సామర్థ్యంలో సగం నిరుపయోగం
న్యూఢిల్లీ :
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం భారీ పెట్టుబడులతో నిర్మించిన లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జి) టెర్మినల్స్‌ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను దెబ్బతీయడంతో దేశంలోని కీలక ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్‌ వాటి పూర్తి సామర్థ్యంలో సగం కూడా వినియోగంలో లేవని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని తాకడం, రవాణా మార్గాల్లో ఆటంకాలు ఏర్పడటం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారాయి. గత కొన్నేళ్లుగా భారత్‌ తన గ్యాస్‌ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం పెరిగింది. ప్రస్తుత సరఫరా షాక్‌ కారణంగా మార్చి నెలలో ఎల్‌ఎన్‌జి దిగుమతులు గణనీయంగా తగ్గి 1.6 మిలియన్‌ టన్నులకు పరిమితమయ్యాయి. దేశంలోనే అతిపెద్దదైన దహేజ్‌ టెర్మినల్‌ తన సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ, దాని వినియోగం ప్రస్తుతం కేవలం 56 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు ప్రతి ఎంఎంబిటియు 20 డాలర్లకు పైగా పెరగడంతో దేశీయంగా ఎరువులు, విద్యుత్‌, ఇతర పారిశ్రామిక రంగాలు గ్యాస్‌ వాడకాన్ని తగ్గించుకోవాల్సి వస్తోంది.ఈ పరిణామం భారీ వ్యయంతో నిర్మించిన ఎల్‌ఎన్‌జి ప్రాజెక్టుల ఆర్థిక మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని ఆ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా ధరల అస్థిరత కొనసాగుతుండగా మరోవైపు దేశీయ గ్యాస్‌ ఉత్పత్తి కూడా సుమారు 5 శాతం మేర తగ్గడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఘర్షణలు త్వరగా తొలగకపోతే ఇంధన భద్రత విషయంలో భారత్‌ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీని ప్రభావం పరోక్షంగా విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -