Sunday, April 5, 2026
E-PAPER
Homeబీజినెస్దిగుమతి బిల్లు తడిసిమోపెడు..!

దిగుమతి బిల్లు తడిసిమోపెడు..!

- Advertisement -

రూపాయి పతనం, చమురు ధరల ఎఫెక్ట్‌
పెరుగుతోన్న వాణిజ్య లోటు
పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం, చమురు ధరలు అమాంతం పెరగడం భారతదేశ దిగుమతి బిల్లును తడిసిమోపెడు చేయనుంది. ప్రస్తుతం దిగుమతి బిల్లు ప్రస్తుతం రెండు వైపుల నుండి ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఓ దశలో 95 కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రెండింటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28న ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్‌ తీర ప్రాంతంలో సరఫరా అంతరాయాలు చోటు చేసుకున్నాయి. భారత్‌ తన అవసరాలకు కావాల్సిన చమురుతో పాటు ఎలక్ట్రానిక్స్‌, బంగారం, ఎరువులు, పారిశ్రామిక యంత్రాలను ప్రధానంగా డాలర్లలోనే చెల్లింపులు చేసి దిగుమతి చేసుకుం టుంది. చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత ఏకకాలంలో సంభవించడం వల్ల వాణిజ్య లోటు పెరగడమే కాకుండా దేశీయం గా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చమురు ధరలు రెట్టింపు..
ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 27 మధ్య కాలంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 60.75 డాలర్ల నుండి ఏకంగా 105.32 డాలర్లకు చేరుకుంది. ఇది దాదాపు 73.4 శాతం పెరుగుదల. ఇదే సమయంలో రూపాయి విలువ 89.96 నుండి 94.59కి పడిపోయి 5.1 శాతం క్షీణతను నమోదు చేసింది. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం మొదలైన ఒక నెల రోజుల్లోనే చమురు ధరలు 45 శాతం పైగా పెరగడం గమనార్హం. రూపాయి పతనంతో వాణిజ్యలోటు పెరగడంతో పాటుగా కార్పొరేట్‌ రుణాల భారం పెరగనుంది. ప్రభుత్వ విదేశీ అప్పుల కు అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు విదేశీ పెట్టుబడులు తరలిపోనున్నాయి.

ఆర్థిక లోటుపై ప్రభావం
గత ఏడాది కాలంగా రూపాయి విలువ పతనంలో రోజుకో రికార్డ్‌ను సృష్టిస్తోంది. 2025-26 బడ్జెట్‌లో ఆర్థిక లోటును 4.4 శాతంగా అంచనా వేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయంగా ధరలు అదుపులో ఉంటాయని భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఆ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతంలో 2022 ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తి భారతదేశ వాణిజ్య లోటు దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఏప్రిల్‌-ఫిబ్రవరి 2025-26 కాలానికి గానూ వాణిజ్య లోటు ఇప్పటికే 310.60 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం ఆందోళన కలిగి స్తోంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వాణిజ్య లోటు అమాంతం పెరుగుతోంది.

కేంద్రానికి సవాల్‌..
బలహీనమైన రూపాయి వల్ల దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇది రవాణా ఖర్చులను పెంచి చివరికి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతుంది. ఈ దిగుమతి ద్రవ్యోల్బణం అటు ప్రభుత్వానికి, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు పెద్ద సవాలుగా మారింది. ఈ పతనాన్ని అరికట్టడానికి ఆర్‌బిఐ ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికీ పెద్ద ఫలితాలు ఇస్తోన్నట్లు కనబడటం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గకపోతే భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే నెలల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -