Sunday, April 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆ రెండు మున్సిపల్‌ పీఠాల్లో బీఆర్‌ఎస్‌

ఆ రెండు మున్సిపల్‌ పీఠాల్లో బీఆర్‌ఎస్‌

- Advertisement -

ఖానాపూర్‌ చైర్మెన్‌ ఎన్నిక మూడోసారి వాయిదా
బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల ఆందోళన
పోలీసులు స్వల్ప లాఠీచార్జి
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌-సీపీఐ కైవసం
ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ బీఆర్‌ఎస్‌కే..

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి / ఇబ్రహీంపట్నం
మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పలు కారణాలతో వాయిదా పడిన పాలకవర్గాల ఎన్నికను అధికారులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ పీఠాలను ఇతరుల మద్దతుతో బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాగా, ఖానాపూర్‌ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య మూడోసారి వాయిదా పడింది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో వాయిదా పడిన రెండు మున్సిపాలిటీ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికను పోలీసులు భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నిక మొదటిసారి కోరం లేక వాయిదా పడగా, రెండోసారి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల గొడవతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘర్షణల నేపథ్యంలో చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ మంత్రి వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ అభ్యర్థిని చైర్మెన్‌ను చేయడానికి పట్టుబట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేయడంతో రెండోసారి సైతం ఎన్నిక వాయిదా పడింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ శనివారం నిర్వహించిన ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు 10 స్థానాలు రాగా.. సీపీఐ నుంచి గెలుపొందిన నలుగురు కూడా ఆ పార్టీకి మద్దతు తెలపడంతో మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా గొడిసెల సంధ్యారాణి ఎన్నికకాగా, వైస్‌ చైర్‌పర్సన్‌గా సీపీఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు.

ఖానాపూర్‌ మళ్లీ వాయిదా..
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఖానాపూర్‌ మున్సిపాలిటీలో 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ 4, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. చైర్మెన్‌ ఎన్నికకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కోరం లేక గతంలో రెండు సార్లు వాయిదా పడింది. శనివారం ఎన్నిక నిర్వహించగా ఇటీవల ఒక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్‌ ఎక్స్‌అఫీషియో ఓటుతో మొత్తం ఆరు ఓట్లు అయ్యాయి. ఎన్నికల అధికారి సమక్షంలో బీఆర్‌ఎస్‌ తరపున బీజేపీ కౌన్సిలర్‌ అంకం మౌనికను చైర్మెన్‌ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ముగ్గురు, బీజేపీ కౌన్సిలర్లు నలుగురు మొత్తం ఏడుగురు మద్దతు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్థిగా చిన్న సత్యంను ప్రతిపాదించాలని ఎమ్మెల్యే కోరారు. ఆయనకు మద్దతిచ్చిన కౌన్సిలర్లలో బీజేపీ కౌన్సిలర్‌ బొప్పారపు సత్యవతి చెయ్యి ఎత్తే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చైర్మెన్‌ అభ్యర్థి సత్యం ఆమె చేయి ఎత్తారని ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. ఆమె మాత్రం తాను చేయి ఎత్తలేదంటూ ఈ క్రమంలో ఒత్తిడికి గురై స్పృహ కోల్పోయారు. మున్సిపల్‌ కార్యాలయంలో గొడవ జరుగుతుందని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌, బీజేపీ నాయకులు రితీష్‌ రాథోడ్‌ తమ అనుచరులతో లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుపడటంతో వారిని తోసేసి వంద మీటర్ల పరిధి దాటే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం రెండు గంటలపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్ర కావడంతో ఎన్నికను వాయిదా వేస్తునట్టు ఎన్నికల అధికారి జీవరత్నం ప్రకటించారు.

ఇబ్రహీంపట్నం చైర్మెన్‌గా సుదర్శన్‌రెడ్డి ఎన్నిక నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌
భారీ పోలీస్‌ బందోబస్తు, ఆంక్షలు, ఉత్కంఠ భరిత పరిణామాల మధ్య జరిగిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పీఠం చివరకు బీఅర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్మెన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను కాంగ్రెస్‌ బహిష్కరించింది. శనివారం ఉదయం నుంచే ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. సుమారు 800 మంది పోలీసులతో ఇనుప కంచెలు వేసి, 144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో కౌన్సిలర్లు పార్టీల వారీగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

24 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. స్పష్టమైన కోరం ఉండటంతో ప్రిసైడింగ్‌ అధికారిగా జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌ పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎన్నిక నుంచి వాకౌట్‌ చేశారు. అయితే, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి కాంగ్రెస్‌ తరపున చైర్మెన్‌ పదవికి నామినేషన్‌ వేయడం గమనార్హం. ఇండిపెండెంట్‌తోపాటు బీజేపీ కౌన్సిలర్‌ మద్దతుతో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మెన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ శ్యామల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -