అద్దాలను ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులు
ఇది సీఎం చేయించిన దాడే.. : హరీశ్‌రావు
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై శనివారం దాడి జరిగింది. ఈ ఘటనలో కార్యాలయ ముఖద్వారం వద్ద అద్దాలు ధ్వంసమయ్యాయి. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే దాడి చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆఫీసులో సీఎం చిత్రపటాన్ని బిగించేందుకు సంబంధిత శాఖ అధికారులతో చర్చించి పంపించకుండా నేరుగా వచ్చి అద్దాలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడిని ఖండిస్తున్నాం..:ఎమ్మెల్యే హరీశ్‌రావు
గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ.. సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా.. లేనట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజాసంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు.
శాంతిభద్రత లను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రయివేట్ సైన్యంలా మారిపోయిందా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ ఇక్కడ పాలనను గాలికి వదిలేశారా..? ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే.. ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి.. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మీ అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు.. మేము బెదిరిపోం” అని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నామన్నారు.



