Sunday, April 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురేవంత్‌రెడ్డిది బోగస్‌ ప్రచారం

రేవంత్‌రెడ్డిది బోగస్‌ ప్రచారం

- Advertisement -

ఇక్కడ హామీలకు దిక్కులేదు..కేరళంలో అవాకులు చవాకులు
కేరళంలో ఆదర్శవంతమైన పాలన
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి
సుప్రీం తీర్పు మత స్వేచ్ఛకు భంగం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేయడం లేదు కానీ..కేరళంలో అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళంలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో కొనసాగుతున్న అభివృద్ధికి కనీస పొంతన లేదని వివరించారు. అయినా రేవంత్‌ రెడ్డి అక్కడకు పోయి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బోగస్‌ ప్రచారం చేస్తున్న బోగస్‌ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు నెలకు రూ.2500, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఇండ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీని అమలు చేయడం, ఎస్సీ, ఎస్టీలకు దళితబంధు కింద రూ.12 లక్షల హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వివరించారు. కానీ ఆరు గ్యారంటీలు ఇక్కడ అమలు చేస్తున్నట్టు కేరళలో ప్రచారం చేయడం.. ప్రజలను మోసం చేయడమే అవుతుందని అన్నారు. కేరళంలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘనత సాధించిన దాఖలాలు లేవన్నారు.

తెలంగాణలో 76 శాతం అక్షరాస్యత ఉంటే కేరళంలో 100 శాతం ఉందని, పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ అమలు చేస్తోందని వివరించారు. విద్యా, వైద్యం పూర్తిగా అక్కడ ఉచితమని, ఇక్కడ వ్యాపారంగా మార్చారని అన్నారు. సామాజిక న్యాయంలో, మత సామరస్యం పాటించడంలో, దోపిడీ వ్యవస్థను అరికట్టడంతో కేరళం ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఆదర్శంగా పని చేస్తోందని, దళితులకు, అణగారిన తరగతుల వారిని పూజారులుగా నియమించిన ఏకైక రాష్ట్రం కేరళం అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని, దీనిపై హైకోర్టు విద్యార్థుల నుంచి వసూలు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని జాన్‌వెస్లీ అన్నారు. పేదలకు ఉచిత విద్య అందించాల్సి ఉండగా దాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ ఉద్యమాలు చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తున్నారని, వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

సుప్రీం తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
దళితులు క్రైస్తవంలోకి మారినా వారిపై వివక్ష పోవడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని జాన్‌వెస్లీ అన్నారు. ఆర్టికల్‌ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉందని, నచ్చిన మతాన్ని అనుసరించే అవకాశం ఉందని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందన్నారు. దేశంలో మతం మారడం సాధ్యమవుతుంది కానీ కులం మారడం మాత్రం సాధ్యం కావడం లేదని, మతం మారినా వివక్ష.. దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలో పసుపుతోపాటు వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌, ఆశన్న, పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద్ది వెంకట్‌రాములు, పల్లపు వెంకటేష్‌, శంకర్‌గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్‌, సుజాత తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -