నవతెలంగాణ-మద్నూర్
ఇటీవల మద్నూర్ మండల అభివృద్ధి అధికారిగా పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన మండల పరిధిలోని తడి హిపర్గా గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్మశాన వాటిక పరిధిలోని ఫామ్ ఫండ్, బోరుబావి ఇంకుడు గుంతలకు మార్కౌట్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఫామ్ ఫాండ్ ల నిర్మాణాలు, బోరుబావుల గుంతలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి హామీ లేబర్ చార్టు కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. అదేవిధంగా గ్రామపంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఇంటిపన్ను, కులాయి పన్నులను వసూలు చేయాలని కార్యదర్శి జ్యోతిని ఆదేశించారు.
అంతకుముందు గ్రామ సర్పంచ్ అశ్వినీ సుదర్శన్ మున్నా, కార్యదర్శి, గ్రామ పెద్దలు కలిసి జీపీ కార్యాలయంలో ఎంపీడీఓను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అర్జున్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆ గ్రామ రేషన్ డీలర్ వామన్ రావు, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.



