రఘు శంకర్ రెడ్డి
నవతెలంగాణ – కాటారం
కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలో పెన్షనర్స్, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా డే కేర్, రిక్రియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర నాయకుడు, డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. రఘు శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం కాటారం కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో ఐదు మండలాలైన పలిమెల, మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మలహర్రావు ప్రాంతాలకు చెందిన పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ సమావేశం జె. కరుణాకర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ…డివిజన్ స్థాయిలో సుమారు 450 మంది పెన్షనర్స్, వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని తెలిపారు.
వారికి శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు డే కేర్ సెంటర్ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం వినోదం, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక పరస్పర చర్యలకు అనువైన వేదికగా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర సీనియర్ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కేంద్రాన్ని మంజూరు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అంకమ్మ, అంకన్న, శంకరయ్య, వెంకటి, రవి శంకర్ రెడ్డి, మధుసూదన్ రావు, దామోదర్ రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



