నవతెలంగాణ – సురుల్లాబాద్
దేశానికి అపూర్వమైన సేవలు అందించిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంలో భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీర్కూరు చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి న్యాయ శాస్త్ర పట్టా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి ఏఐసీసీ సభ్యునిగా కేంద్రంలో మంత్రి వర్గంలో ఎనిమిది పోర్టు పోలియో శాఖల మంత్రి పదవులు అనుభవించారని పేర్కొన్నారు.
అలాగే నసురుల్లాబాద్ మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు బాబు జగ్జీవన్ రావ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని అన్నారు. దేశ నిర్మాణంలో, వ్యవసాయం, కార్మిక రంగాల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు కల్పించడంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు కంది మల్లేష్, మాజీ సర్పంచ్ అరిగే సాయిలు, మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, భూమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



