– అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జయంతి వేడుకలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో పూజ్య శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్ )విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎ. శ్రీ జన్, శ్రీమతి డి. శ్రవంతి, డాక్టర్ పి. ఝాన్సీ రాణి సమన్వయ బాధ్యతలు నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు, అధ్యాపక బృందం జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎ. శ్రీ జన్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలను గుర్తు చేశారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు గా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా, ప్రముఖ పార్లమెంటేరియన్ గా దేశానికి చేసిన సేవలు విశేషమన్నారు.
కేంద్ర కార్మిక మంత్రిగా కనీస వేతనాల చట్టం అమలులో కీలక పాత్ర పోషించారని,హరిత విప్లవ సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించారని, ఉప ప్రధానమంత్రిగా కూడా సేవలందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు,వాలంటీర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.



