అమ్జద్ మాతృభాష ఉర్దూ అయినా, తెలుగు సాహిత్యం మీద అభిమానంతో, ఇష్టంగా తెలుగులో రచనలు చేస్తూ ఉన్నారు. అలా కవితలు, కథలు, నవలలు, సాహిత్య రాజకీయ పర్యాటక వ్యాసాలు రాశారు- రాస్తున్నారు. ”పూలచాదర్, మరో మలుపు” పేరిట సొంత తెలుగు కథల సంపుటాలు, ”తొలకరి చినుకులు” పేరిట కవిత్వ సంపుటిని, ”జీవితపు అలల్లో, మిస్టర్ బాలు” పేరిట నవలలను వెలువరించారు. ఉర్దూ సాహిత్యంలోని మేలిమి రచనల్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న అభిలాషతో, కొందరు ప్రసిద్ధ రచయితల ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువాదం చేశారు. వీరు చేసిన అనువాదాలతో ”గోరింటాకు, దయా హృదయ, అనార్కలి (సాదత్ హసన్ మంటో)” పేరుతో సంపుటాలను వెలువరించారు. ఇప్పుడు అమృతా ప్రీతమ్ కథల నుంచి కొన్ని ఎంపిక చేసిన అనువాద కథలతో ‘బొమ్మా? బొరుసా?’ అనే సంపుటితో మళ్ళీ మన ముందుకు వచ్చారు.
అమృతా ప్రీతమ్ 20వ శతాబ్దపు మొదటి ప్రముఖ మహిళా పంజాబీ రచయిత్రి, కవయిత్రి. ఆమె తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో కవిత్వం, వ్యాసాలు, నవలలు, జీవిత చరిత్రలు మొదలైనవి వందకు పైగా రచనలు చేశారు. ఆమె రచనలను భారత్, పాకిస్తాన్ ప్రజలు సమానంగా ఇష్టపడతారు. అమృత చాలా చిన్న వయసులోనే రాయడం ప్రారంభించింది. కేవలం 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ‘అమృత్ లెహ్రన్’ (1936) పేరుతో ఆమె తొలి కవితా సంపుటాన్ని విడుదల చేసింది. ఆ తరువాత ఆమె 1936 నుండి 1943 వరకు కనీసం 6 కవితా సంపుటాలను ప్రచురించింది. అమృత తన సాహిత్య రచనల ద్వారా ప్రజలను ప్రేరేపించడానికి ప్రగతిశీల రచయితల ఉద్యమంలో చేరింది. 1944 లో ఆమె ‘లోక్ పీడ్’ (ప్రజల వేదన) రచనల సంకలనాన్ని రూపొందించింది. ఆమె అనేక లాభాపేక్ష లేని సంస్థలలో చురుకైన సభ్యురాలు. ఆమె స్వచ్ఛంద సేవ కార్యక్రమాల కోసం పనిచేసేది.
తర్వాత కాలంలో అమృతాప్రీతమ్ జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమెను స్త్రీవాదిని చేశాయి. ఆమె రాసిన కథలు, కవితలు ఎక్కువ శాతం తన వైవాహిక జీవితంలోని దుర్భర అనుభవాల నేపథ్యంలో వ్రాయబడినవి. ఆమె స్వీయ చరిత్ర రచనలు ‘బ్లాక్ రోజ్, రసిది టిక్కెట్’ ఆ కోవకు చెందినవే. ‘రసిది టిక్కెట్లిలో ముఖ్యంగా తన ప్రణయ గాథలు ధైర్యంగా వివరించింది. తను రాసిన చాలా కథల్లో ప్రముఖ ఉర్దూ షాయర్ ,సినీ గేయ రచయిత సాహిర్ లుధియాన్వి తో తన ప్రేమ వ్యవహారం తొంగి చూస్తుంది. మంచి పేరున్న చిత్రకారుడు ఇమ్రోజ్ తో గడిపిన సహజీవనం గురించి ప్రస్తావన కూడా ఉంది.
వీరు 17 కవిత సంపుటాలను, 10 నవలలను, నాలుగు ఆత్మకథలను, రెండు కథా సంపుటాలను వెలువరించారు. పంజాబీ, హిందీలలో వ్రాసిన ఆమె రచనలు చాలావరకు స్వీయ చరిత్రతో సహా ఇంగ్లీష్, ఫ్రెంచ్, డానిష్, జపనీస్ ,ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి .ఆమె కథలు కొన్ని తెలుగులో కూడా అక్కడక్కడ అనువాదాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంమ్జద్, అమృతాప్రితమ్ కథలలోంచి కొన్ని ఎంపిక చేసిన వాటిని అనువదించి ‘బొమ్మా? బొరుసా?’ పేరుతో ఇప్పుడు మన ముందుకు తీసుకువచ్చారు.
ఇందులో మొదటి కథ ‘దిష్టిబొమ్మ’. కుమ్మరి ఆవంలో తయారైన కుండలు ఎవరి చేతిలో పడి ఎలా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాయో ఎవరికి తెలుసు? కూరకుండగా పొయ్యి మీదికి ఎక్కాల్సింది, దిష్టిబొమ్మలా తయారు కావచ్చు. స్త్రీ పరిస్థితి కూడా అంతే. ఆమె భర్త అతని స్థితిగతులను బట్టి ఆమె జీవితం మారుతుందని- కుండకు, స్త్రీ పరిస్థితిని పోల్చి చూపుతూ ఈ కథ నడుస్తుంది. ఇంకో కథలో వ్యభిచారి అయిన పొరిగింటావిడ భర్త ఎవరి దగ్గరకు వెళతాడో తెలియదు. కానీ రాత్రి అయిందంటే ఇంటికి తిరిగి వస్తాడు, తన భార్య దగ్గరికి. హార్ట్ పేషంట్ అయిన శియాన భర్త అతి త్వరగా తెలియని గమ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఎప్పటికీ తిరిగి రాడు. ఇరువురికి భర్తల వల్ల కలిగే దుఃఖం, వారు చేసిన ‘గుండె గాయాలు’ను పోల్చి చూపుతూ ఈ కథను నడిపించారు.
ప్రేమ చనిపోతుంది. వాగ్దానాలు మరణిస్తాయి. కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరణించవని ‘వెలుతురు బాధ’లో, జీవితంలో ప్రేమించిన వాడిని వదిలేసి పెద్దలు కుదిర్చిన పెళ్లి- సంసారంలో ఉన్నప్పటికీ, ప్రేమికుడిని మరిచిపోలేక అతని జ్ఞాపకాలలో బతుకుతున్న ప్రేమికురాలి గాధ ‘బొమ్మ? బొరుసా?’ ఒక ఆఫీసులో బాస్ కింద ‘ఐదుగురు’ స్టెనోలు పనిచేసేవారు. ప్రతిరోజు ఐదు గంటలకు అతడిని తీసుకెళ్లే అందమైన భార్య అంటే ఆ ఐదుగురిలో ఒక విధమైన అసూయ. హఠాత్తుగా బాస్ భార్య చనిపోతుంది. బాస్ ను ఆకర్షించడానికి ఆ అయిదుగురు ఎంతో ప్రయత్నిస్తారు. హఠాత్తుగా బాస్ ఒక ఆంగ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆ ఐదుగురు చాలా నిరుత్సాహపడిపోతారు. ”అమ్మాయిలు అందరికీ అర్థం అయింది. వాళ్లు వృద్ధులైపోయారని” అనే వాక్యంతో కథను ముగించడం చాలా బాగా వచ్చింది.
‘మట్టి కులం’ కథలో, ఖత్రీయుల అమ్మాయి బాలు, జాట్ అబ్బాయి కందా ప్రేమలో పడతారు. అది నచ్చని బాలు తల్లిదండ్రులు తమ ఖత్రీయుల కుటుంబంలోని వాడినే తెచ్చి ఆమెకు పెళ్లి చేస్తారు. ఆమె ప్రేమను, వియోగాన్ని, కన్నీళ్లను కళ్ళారా చూసిన ఛబ్రీ మాత్రమే బాలు బాధను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఛబ్రీ కూడా ఒక భగ ప్రేమికురాలు కాబట్టి. ‘అరటి తొక్క’ కథలో ప్రేమికులను విడదీసి, ఆ స్థానంలో తాను రావడానికి ప్రయత్నించే స్నేహితురాలు ఆడిన డబుల్ గేమ్ ను చూడవచ్చు. ఎవరితోనైనా ప్రేమలో పడితే, అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే , ఏదో మందు పెట్టారని సామాన్య జనాలు అనుకుంటారు. కానీ ప్రేమలో పడిన వారు కూడా తమ నిజమైన ప్రేమను సరిగా గుర్తించలేక, అదంతా ”పిచ్చి మొక్క” మహిమ అనుకోవడం ఒక విచిత్రం.
తన బట్టలు ఇతరులు వేసుకుంటేనే భరించలేని మనస్తత్వం గల కరమవాది, తన భర్తను ఇతర స్త్రీతో పంచుకోవడం ఇష్టం లేక, వాడిని వదిలేసి పనిమనిషిగా కొత్త జీవితాన్ని గడుపుతుంటుంది. ఆమె శరీరం ఎంత దృఢంగా ఉందో, ఆమె మనస్సు కూడా అంతే దృఢంగా ఉందని” తిలకం” కథలో రచయిత్రి గమనిస్తుంది. బూతులతో అందరి మీద విరుచుకు పడే ‘ధన్ను’ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా, అండగా నిలబడేది. ధన్ను మరణానంతరం తన పొలం, భూమిని ఊరిలో బడి కోసం వీలునామా రాసి ఇస్తుంది. ‘అమ్మాయిలకు ఓ నాలుగు అక్షరం ముక్కలు నేర్పాలి. వారి జీవితం బజారుపాలు కాకుండా ఉండాలి’ అనే ఆమె చివరి కోరిక అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.’ ఓ దేశంలో… కొందరు అమ్మాయిలు” అంటూ ఓ ఐదుగురు అమ్మాయిల జీవితాలను ఒక కథలో తెలియజేస్తారు. అసంతృప్తితో, ఆవేదనలో, విషాదంలో మునిగిపోయిన వారి జీవితాలను చూస్తుంటే, ఈ దేశంలో ఆడవాళ్ళ పరిస్థితి అంతా ఇంతేనని పాఠకులు గ్రహించగలుగుతారు. ‘ఈరోజు’ కథలో డాకా యూనివర్సిటీలో, యూనివర్సిటీ స్టూడెంట్స్ జరుపుకుంటున్న మీటింగ్‌ను భగం చేయడానికి ప్రభుత్వాధికారులు అన్వర్‌ను నియమిస్తారు. పైలట్ గా విమానాన్ని యూనివర్సిటీ మీదుగా నడుపుతూ విద్యార్థుల మీద బాంబింగ్, మిషన్ గన్లతో విరుచుకుపడాలని ఆదేశిస్తారు. అమాయక విద్యార్థులపై మారణకాండ జరపడం ఇష్టం లేక అన్వర్ పేరాచూట్ సహాయంతో బయటపడి, ఆ విమానాన్ని దారి తప్పించి ధ్వంసం అయ్యేలా చూస్తాడు.
రెండు విరుద్ధ సంఘటనలను తీసుకొని, వాటిని పోల్చి చూపుతూ ఒక జీవిత సత్యాన్ని తెలియజేయడం ‘దిష్టిబొమ్మ, గుండె గాయాలు’ కథలలో కనిపిస్తుంది. ప్రేమలో పడిన అమ్మాయిలు తర్వాత కాలంలో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం చేసుకున్నప్పటికీ ,తమ ప్రేమికుడిని మరిచిపోలేక మూగగా కుమిలిపోయేవారు ఎక్కువగా వీరి కథల్లో కనిపిస్తారు. స్వీయ వ్యక్తిత్వం, ఆత్మాభిమానం గల స్త్రీలుగా ‘తిలకం’ కథలోని కరమవాలి, ‘ధన్ను’ మనకు గుర్తుండిపోతారు. అప్పటికీ, ఇప్పటికీ స్త్రీల పరిస్థితులలో ఎలాంటి మార్పు రాలేదని పాఠకులు ఈ కథలు చదివితే గుర్తించగలుగుతారు. అమ్జద్ చేసిన అనువాదం చాలా బాగుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి కథలను చదివింపజేస్తాయి.
– కె.పి.అశోక్ కుమార్
9700000948



